గుండెకు హాని చేసే 5 అలవాట్లు: సర్జన్ ఇచ్చిన రేటింగ్స్

గుండె ఆరోగ్యానికి హాని కలిగించే ఐదు అలవాట్లను హార్ట్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తన క్లినికల్ అనుభవం ఆధారంగా 1-10 స్కేల్‌పై రేటింగ్ ఇచ్చారు. వేపింగ్, ఆల్కహాల్, నిద్ర లేమికి 10/10, ఒత్తిడికి 8/10, సోడాకు 4/10 రేటింగ్ ఇచ్చారు. ఆరోగ్యానికి ఈ అంశాలు ఎంత ప్రమాదకరమో ఆయన వివరించారు.

Published on: Oct 21, 2025, 07:26:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జార్జియాకు చెందిన కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్.. రోజువారీ అలవాట్లు ఆరోగ్యాన్ని, ముఖ్యంగా గుండెను ఎలా దెబ్బతీస్తాయో వివరించారు. ఆయన తన క్లినికల్ అనుభవాన్ని బట్టి 1 నుండి 10 స్కేల్‌పై (1 అతి తక్కువ, 10 అత్యంత హానికరం) ఐదు సాధారణ అలవాట్లకు రేటింగ్ ఇచ్చారు. మీ గుండె ఆరోగ్యం కోసం వీటిని తప్పక తెలుసుకోవాలి.

గుండెకు హాని చేసే 5 అలవాట్లు: సర్జన్ ఇచ్చిన రేటింగ్స్ (Freepik)
గుండెకు హాని చేసే 5 అలవాట్లు: సర్జన్ ఇచ్చిన రేటింగ్స్ (Freepik)

1. వేపింగ్ (Vaping) - 10/10

సిగరెట్ల కంటే వేపింగ్ సురక్షితమైన ప్రత్యామ్నాయంగా చాలా మంది భావిస్తారు. అయితే, డాక్టర్ లండన్ దీనిపై తీవ్ర హెచ్చరిక చేశారు. ఆయన దీనికి 10కి 10 రేటింగ్ ఇచ్చారు.

“సిగరెట్ల విషయంలో ఉన్నంత ఎక్కువ కాలపు డాటా (డేటా) వేపింగ్‌కు లేకపోయినా, వేపింగ్ కారణంగా యువకుల్లో కొన్ని విషాదకరమైన పరిణామాలు నేను వ్యక్తిగతంగా చూశాను” అని డాక్టర్ లండన్ చెప్పారు.

సిగరెట్లపై చాలా కాలంగా అధ్యయనాలు జరుగుతుండగా, వేపింగ్ కొత్తగా వచ్చింది కాబట్టి దాని ప్రమాదాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు.

2. నిద్ర (Sleep) - 10/10

మంచి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన స్తంభాలలో నిద్ర ఒకటి. ఇది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి సహాయపడుతుంది. నిరంతరంగా నిద్ర లేమికి గురైతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తప్పక వస్తాయి.

డాక్టర్ లండన్ దీనికి అత్యధికంగా 10/10 రేటింగ్ ఇచ్చారు. తన జీవితంలో కూడా నిద్ర సమస్యలతో ఇబ్బంది పడ్డానని ఆయన వెల్లడించారు.

“చాలా కాలంగా నేను దీనితో పోరాడుతున్నాను. ఇది నా మొత్తం ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావం చూపింది. నా నిద్రను ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే అంతా అధ్వాన్నంగా మారింది. అందుకే నేను నిద్రతో నాకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. మీరు కూడా మీ నిద్రను అంచనా వేసుకోమని సిఫార్సు చేస్తున్నాను” అని ఆయన అన్నారు.

సాధారణ సలహాలను గుడ్డిగా పాటించకుండా, ప్రతి ఒక్కరూ తమ నిద్ర విధానాలు, నాణ్యతపై స్వయంగా అవగాహన పెంచుకోవాలని, తమకు ఏది పనిచేస్తుందో తెలుసుకోవాలని డాక్టర్ లండన్ సూచించారు.

3. ఆల్కహాల్ (Alcohol) - 10/10

ఆల్కహాల్‌ను కూడా అత్యంత హానికరమైన అలవాటుగా గుర్తించారు, దీనికి 10కి 10 పూర్తి రేటింగ్ ఇచ్చారు. ఆల్కహాల్ వల్ల కలిగే నష్టం కణ స్థాయిలో (Cellular level) లోతుగా, విస్తృతంగా ఉంటుంది. ఆల్కహాల్ తాగడం వ్యక్తిగత ఎంపిక అయినప్పటికీ, దానితో ముడిపడి ఉన్న ప్రమాదాలు, సమస్యలను శాస్త్రీయ ఆధారాలు నిరూపిస్తున్నాయని డాక్టర్ గుర్తు చేశారు. చిన్న మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా కూడా అది శరీరంపై ప్రభావం చూపకుండా ఉండదు. ఉదాహరణకు, 2025 సెప్టెంబర్‌లో BMJ ఎవిడెన్స్-బేస్డ్ మెడిసిన్‌లో ప్రచురితమైనన ఒక అధ్యయనం ప్రకారం, పార్టీలలో అప్పుడప్పుడు తీసుకునే ఆల్కహాల్ కూడా మతిమరుపు (Dementia) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.

4. ఒత్తిడి (Stress) - 8/10

ఒత్తిడి అనేది ఒక సాధారణ జీవసంబంధమైన ప్రతిస్పందన. దీనికి రేటింగ్ ఇవ్వడం కొంచెం క్లిష్టమని డాక్టర్ లండన్ అభిప్రాయపడ్డారు. ఆయన దీనికి 8/10 రేటింగ్ ఇచ్చారు.

పరుగెత్తడం, బరువులు ఎత్తడం వంటి సమయాల్లో ఒత్తిడి సానుకూలంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. అయితే, ఈ సానుకూల అంశాల కంటే, పనిలో లేదా ఆర్థికపరమైన భావోద్వేగ ఒత్తిడి వల్ల కలిగే ప్రతికూల ప్రభావమే చాలా ఎక్కువ.

“ఒత్తిడి క్లిష్టమైనది. మీరు పరుగెత్తడానికి లేదా బరువులు ఎత్తడానికి వెళ్లినప్పుడు, అది మంచి ఒత్తిడి (Good Stress). ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును మెరుగుపరుస్తుంది. కానీ, ఉద్యోగంలో భావోద్వేగ ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి మీ శరీరంపై చెడు ప్రభావం చూపిస్తాయి” అని ఆయన చెప్పారు.

5. సోడా (Soda) - 4/10

వ్యక్తిగతంగా డాక్టర్ లండన్ రెగ్యులర్ సోడాలను తాగడం మానుకుంటారు. ఎందుకంటే వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది డైట్ సోడాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చూస్తారు. అయితే, ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, దీనికి 4/10 రేటింగ్ ఇచ్చారు.

“నేను డైట్ సోడాలు తాగినప్పుడు, నాకు చెడు ఆహారాలపై (Bad Foods) కోరిక పెరుగుతుంది” అని ఆయన వివరించారు.

(పాఠకులకు సూచన: ఇది సోషల్ మీడియాలోని యూజర్- రూపొందించిన కంటెంట్ ఆధారంగా ప్రచురించిన కథనం. HT.com ఈ వాదనలను స్వతంత్రంగా ధృవీకరించలేదు. ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే, వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More