దిండు కవర్లు, దుప్పట్లు ఎన్నాళ్లకు ఉతకాలి? చర్మ వైద్య నిపుణుల సూచనలివే

చెమట, చర్మంలోని నూనెతో దుప్పట్లు, దిండు కవర్లు త్వరగా మురికిగా మారతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని ఎంత కాలానికి ఉతకాలో ముంబై డెర్మటాలజిస్ట్ డాక్టర్ సోనాలీ కోహ్లీ వివరించారు.

Published on: Nov 26, 2026, 21:11:03 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మనిషి తన జీవితంలో సుమారు మూడో వంతు కాలం మంచంపైనే గడుపుతాడని ఒక అధ్యయనం చెబుతోంది. ఆ సమయంలో మన చర్మం నిరంతరం దుప్పట్లు, దిండు కవర్లతో తాకుతూనే ఉంటుంది. మనం చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మనం పడుకునే దుప్పట్లు, ముఖ్యంగా దిండు కవర్లను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?

దిండు కవర్లు, దుప్పట్లు ఎన్నాళ్లకు ఉతకాలి? (Pexels)
దిండు కవర్లు, దుప్పట్లు ఎన్నాళ్లకు ఉతకాలి? (Pexels)

చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి దుప్పట్లు, దిండు కవర్లను ఎంత కాలానికి మార్చాలో ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ డెర్మటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సోనాలీ కోహ్లీ వివరించారు. చర్మంపై ఉండే నూనె దుప్పట్లపై ఎలా పేరుకుపోతుంది, అది చర్మ సమస్యలకు ఎలా దారి తీస్తుందనే విషయాలను ఆమె పంచుకున్నారు.

ఎన్నాళ్లకు ఒకసారి ఉతకాలి?

బెడ్‌షీట్లు, దిండు కవర్లను శుభ్రంగా ఉంచుకోవడానికి డాక్టర్ సోనాలీ ఈ కింది పద్ధతులు పాటించాలని సూచించారు.

  • దిండు కవర్లు: వారానికి రెండు నుంచి మూడుసార్లు ఉతకాలి. మొటిమలు లేదా జిడ్డు జుట్టు ఉన్నవారు వారానికి రెండుసార్లు ఉతకాలి, లేదంటే మధ్యలో దిండు కవర్‌ను తిరగేసి వాడుకోవచ్చు.
  • దుప్పట్లు: వారానికి ఒకసారి తప్పకుండా ఉతకాలి.
  • ఉతికే విధానం: దుప్పట్లను వేడి నీటితో, సున్నితమైన, సువాసన లేని సబ్బుతో ఉతకాలి. వీలైతే ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి.

"రోజూ చేసే ఈ పనులను మరింత సులభతరం చేసే చిన్న చిట్కాలు కూడా ఉన్నాయి. పడుకునే ముందు ముఖం కడుక్కోవాలి, రాత్రి పూట రాసే సౌందర్య సాధనాలు చర్మానికి పట్టిన తర్వాతే పడుకోవాలి, జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవాలి. సిల్క్ దిండు కవర్లు వాడితే చర్మం, జుట్టు చికాకు పడకుండా ఉంటాయి" అని డాక్టర్ సోనాలీ తెలిపారు.

రాత్రి పూట చెమటతో మురికి

రాత్రి నిద్రలో మన చర్మం నుంచి నూనె స్రావం ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. "మనం పడుకుని అటూ ఇటూ కదిలినప్పుడల్లా ఆ జిడ్డు కొద్దికొద్దిగా దిండు కవర్‌పై చేరుతుంది. పడుకునే ముందు రాసుకునే నైట్ క్రీమ్, సీరం లేదా తల నూనె కూడా తోడై దిండు కవర్‌పై జిడ్డు పొరను పెంచుతాయి. కాటన్ ఆ నూనెను పీల్చుకుంటుంది కాబట్టి బయటకు కనిపించకపోయినా, కొన్ని రోజులకే అది మురికిగా మారుతుంది" అని ఆమె వివరించారు.

నిద్రలో తెలియకుండానే దాదాపు ప్రతి ఒక్కరికీ చెమట పడుతుంది. ఏడాది పొడవునా వేడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో దుప్పట్లపై చేరే తేమ, నూనె, మృతకణాలు సూక్ష్మజీవులు పెరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

మొటిమలు, రంధ్రాలు మూసుకుపోవడం

దిండు కవర్లపై చెమట, సెబమ్ పేరుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయా, చర్మ రంధ్రాలు మూసుకుపోతాయా అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. "పడుకునే భంగిమను బట్టి కొందరిలో ఒకే చెంపపై మొటిమలు రావడం నేను తరచూ గమనిస్తాను. శుభ్రంగా లేని దిండు కవర్ నిద్రలో జిడ్డు అవశేషాలు, బ్యాక్టీరియా, చర్మానికి రాసుకున్న పదార్థాలను బంధిస్తుంది. రాపిడితో కలిసి ఇవి రంధ్రాలు మూసుకుపోవడానికి, మొటిమలకు దారి తీస్తాయి. దవడ రేఖ, వెంట్రుకల వెనుక భాగంలో చిన్న గడ్డలు రావడం సాధారణంగా కనిపిస్తుంది" అని డాక్టర్ సోనాలీ చెప్పారు.

తల చర్మంపై ప్రభావం, ఇతర ముప్పులు

మనిషి తల చర్మంలో సహజంగా మలసేజియా అనే ఫంగస్ ఉంటుంది. అది శరీరంలోని నూనెలను ఆహారంగా తీసుకుంటుంది. "నూనె, చెమట పేరుకుపోయిన దిండు కవర్ వాడితే ఆ ఫంగస్‌కు మరింత ఆహారం దొరుకుతుంది. దీనివల్ల చుండ్రు, ఇతర చికాకు సమస్యలతో పాటు కొన్నిసార్లు సెబోరిక్ డెర్మటైటిస్, తలపై మొటిమలు వస్తాయి. తడి జుట్టుతో పడుకుంటే రాత్రంతా దిండు తడిగా ఉండి సమస్య మరింత తీవ్రమవుతుంది" అని ఆమె పేర్కొన్నారు.

దుప్పట్లలో చేరే చెమట, చర్మ అవశేషాలు, సహజ నూనెలు బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలకు కారణమవుతాయా అని అడిగినప్పుడు, "అవును, మృతకణాలు డస్ట్ మైట్స్‌కు ఆహారంగా మారుతాయి. తేమ, వేడి వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి" అని తెలిపారు.

అయితే ఎగ్జిమా, అలర్జీలు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ సమస్య వల్ల చికాకు, దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.