Rice water : బియ్యం నీళ్లతో జుట్టు పొడవుగా పెరుగుతుందా? సోషల్ మీడియా ట్రెండ్స్ వెనుక అసలు నిజాలివే..
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్న 'బియ్యం నీళ్ల ట్రెండ్'పై చర్మ, కేశ సంరక్షణ నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. బియ్యం నీటిని వాడటం వల్ల జుట్టు నిజంగా పెరుగుతుందా లేదా అనే విషయాలను శాస్త్రీయ దృక్పథంతో తెలుసుకోండి..
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. బియ్యం కడిగిన నీళ్లతో (గంజి) జుట్టు సౌందర్యం పెరుగుతుందంటూ వందలాది వీడియోలు దర్శనమిస్తుంటాయి. బియ్యం నీటిని టోనర్‌గా, హెయిర్ సీరమ్‌గా వాడితే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ఆన్‌లైన్ హడావుడిలో నిజమెంత? చర్మ విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతోంది? బెంగళూరులోని డాక్టర్ శ్వేతాస్ స్కిన్ సూత్ర క్లినిక్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్వేత శ్రీధర్ ఈ ట్రెండ్ వెనుక ఉన్న నిజా నిజాలను విశ్లేషించారు.

సోషల్ మీడియా హంగామా.. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?
బియ్యం కడిగిన నీటిలో స్టార్చ్ (పిండి పదార్థం), అమైనో ఆమ్లాలు, కొన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయనే మాట నిజమే. వీటిలో ఉండే 'ఇనోసిటాల్' అనే కార్బోహైడ్రేట్ వెంట్రుకల పీచును దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుందని కొన్ని ప్రాథమిక పరిశోధనల్లో తేలింది.
అయితే, బియ్యం నీళ్లను తలకు పట్టించడం వల్ల జుట్టు పొడవు పెరుగుతుందని లేదా కొత్త వెంట్రుకలు వస్తాయని చెప్పడానికి ఎలాంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్ శ్వేత స్పష్టం చేశారు. చాలామంది తమ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తున్నారే తప్ప, మానవులపై జరిపిన సైంటిఫిక్ ట్రయల్స్‌లో ఇది ఎక్కడా నిరూపణ కాలేదని అన్నారు.
జుట్టు మెరిసేది తాత్కాలికమే!
కొందరు బియ్యం నీళ్లు వాడిన తర్వాత జుట్టు కాస్త మృదువుగా, ఒత్తుగా కనిపిస్తోందని చెబుతుంటారు. దీనికి కారణం అందులోని స్టార్చ్ మాత్రమే. స్టార్చ్ వెంట్రుకల పైన ఒక పొరలా ఏర్పడటం వల్ల తాత్కాలికంగా జుట్టు నునుపుగా, కాంతివంతంగా అనిపిస్తుంది.
ఇది కేవలం బాహ్యమైన మెరుపు (కాస్మొటిక్ ఎఫెక్ట్) మాత్రమే తప్ప, కుదుళ్ల నుంచి కొత్త జుట్టు రావడం కాదని గుర్తుంచుకోవాలి. వెంట్రుకల పొడవు, సాంద్రత అనేవి జన్యువులు, హార్మోన్ల సమతుల్యత, మనం తీసుకునే పోషకాహారం, తల చర్మం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి.
సైడ్ ఎఫెక్ట్స్: జుట్టు దెబ్బతినే ప్రమాదం!
బియ్యం నీళ్లను పరిమితికి మించి వాడటం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశముంది.
ప్రోటీన్, స్టార్చ్ పేరుకుపోవడం: బియ్యం నీటిని క్రమంగా వాడితే వెంట్రుకలపై స్టార్చ్ మిగిలిపోయి జుట్టు గట్టిగా, పొడిగా మారి చిక్కుబడుతుంది.
ఇన్ఫెక్షన్ల ముప్పు: ఇంట్లో తయారుచేసే పులిసిన బియ్యం నీళ్లలో బాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. తల చర్మం సున్నితంగా ఉన్నవారికి దీనివల్ల దురద, అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్లు వస్తాయి.
జుట్టు రాలడానికి అసలు కారణాలు ఇవే..
ఒకవేళ మీకు విపరీతంగా జుట్టు రాలుతుంటే, ఆన్‌లైన్ చిట్కాలపై ఆధారపడటం కంటే అసలు కారణాన్ని గుర్తించడం అత్యవసరం. ఐరన్ లోపం (అనీమియా), థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, ప్రోటీన్ లోపం, మానసిక ఒత్తిడి వంటివి కేశ సమస్యలకు ప్రధాన కారణాలు. సొంత ప్రయోగాలు పక్కనబెట్టి, అర్హత కలిగిన డెర్మటాలజిస్టును సంప్రదించి సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడమే శ్రేయస్కరం.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఆరోగ్య పరమైన వివరాల పూర్తి వివరాల కోసం మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


