పండగపూట జనాల కిచెన్ బడ్జెట్‌కు షాక్.. బియ్యం, కూరగాయల ధరలకు పైపైకి!
Kitchen Budget : దసరా, బతుకమ్మ వేళ నిత్యావసరాల ధరలు షాక్ ఇస్తున్నాయి. కూరగాయల ధరలే కాదు.. సన్నబియ్యం ధరలు కూడా రెక్కలు వచ్చినట్టుగా పైపైకి లేస్తున్నాయి.
పండుగల వేళ పేద, మధ్యతరగతి కుటుంబాలపై ధరల భారం తీవ్రంగా పడింది. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడం సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో పాటు వ్యాపారుల కృత్రిమ కొరత వల్ల తెలంగాణ వ్యాప్తంగా ధరల పైపైకి వెళ్తున్నాయి.. పండుగ వేళ కొత్త బట్టల కొనుగోలు కంటే కూడా రోజువారీ నిత్యావసరాల ఖర్చులే ప్రజలకు పెద్ద సవాలుగా మారాయి.

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో సన్న బియ్యం ధరలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. మార్కెట్లో డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో సన్నబియ్యం కిలో రూ.100కు చేరువవుతోంది. భవిష్యత్తులో పంట దిగుబడి తగ్గుతుందనే ముందస్తు నెపంతో కొంతమంది రైస్ మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జైశ్రీరామ్ క్వింటాలు ధర ఏకంగా రూ.8500 నుంచి రూ.9000 మధ్య కొన్ని ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఇక హెచ్ఎంటీ క్వింటాలు రూ.7,000 నుంచి రూ.8,000 వరకు విక్రయిస్తున్నారు. బీపీటీ క్వింటాలు రూ.6,500 నుంచి రూ.7,000 మధ్య పలుకుతున్నాయి. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించి జనాలు ముందుగానే బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకునేందుకు చూస్తున్నారు. ఈ కారణంతో కూడా ధరలు పెరుగుతున్నాయి.
సెలవుల సందర్భంగా ఉద్యోగులు, విద్యార్థులు సొంతూర్లకు చేరుకోవడంతో ఇళ్లలో నిత్యావసరాల వాడకం పెరిగింది. అయితే దుకాణాల్లో సరుకుల ధరలు చూసి సామాన్యులు షాక్‌కు గురవుతున్నారు. నిత్యం వాడే పప్పు ధాన్యాలు, నూనెలు, సబ్బుల ధరలు కూడా పెరిగాయి.
నువ్వులు-రూ. 230, కందిపప్పు-రూ. 180, పల్లీలు (వేరుశెనగ)-రూ. 180, పెసరపప్పు-రూ. 140, ఉల్లిపాయలు-రూ. 70పైనే, చక్కెర-రూ. 60గా పలుకుతున్నాయి. ఉదాహరణకు సాధారణంగా ఈ సీజన్లో ఉల్లిపాయల వ్యాపారం జోరుగా సాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎల్ నినో పరిస్థితుల కారణంగా సాగు, ఉత్పత్తి తగ్గడంతో ఉల్లిపాయల రాక తీవ్రంగా తగ్గిపోయింది. వర్షాభావ పరిస్థితులు, విపరీతమైన ఎల్ నినో ప్రతికూల వాతావరణ ప్రభావం వల్ల పంటల సాగు తగ్గడం, ఫలితంగా ఉత్పత్తి దారుణంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఉల్లిధర పైపైకి వెళ్తోంది.
దీనికి తోడు ఇతర కూరగాయల ధరలు కూడా కిలో రూ.100కు చేరుకుంటున్నాయి. ఏ కూరగాయ ముట్టుకున్న షాక్ తగిలే ధరలు చెబుతున్నారు వ్యాపారులు. కొన్ని కూరగాయలు పావుకిలో తీసుకుంటే.. రూ.20కి తగ్గించి అమ్మడం లేదు. అరకిలో అయితే రూ.30 నుంచి 35 తీసుకుంటున్నారు.
సరకులను అక్రమ నిల్వలు నిరోధించేందుకు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని జనాలు కోరుతున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర సరుకులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చి సబ్సిడీ ద్వారా సామాన్యులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


