గుడ్లను ఇలా తింటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే! డాక్టర్ సేథీ చెప్పిన ఆ మ్యాజిక్ ఇదే
గుడ్లను కేవలం ప్రోటీన్ కోసమే కాకుండా, శరీరంలో వాపులను తగ్గించి (Anti-inflammatory), పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుత ఆహారంగా ఎలా మార్చుకోవచ్చో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ వివరిస్తున్నారు.
సాధారణంగా మనలో చాలామందికి గుడ్డు అంటే కేవలం ప్రోటీన్ ఇచ్చే ఆహారం మాత్రమే. కానీ, మన వంటింట్లో దొరికే కేవలం రెండు రకాల దినుసులతో గుడ్డును ఒక 'పవర్‌హౌస్' లాగా మార్చవచ్చని చెబుతున్నారు కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ. AIIMS, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో శిక్షణ పొందిన ఆయన.. గుడ్ల ద్వారా గరిష్ట ప్రయోజనాలు ఎలా పొందాలో ఒక ప్రత్యేకమైన రెసిపీని పంచుకున్నారు.

గుడ్లు: ఒక సంపూర్ణ ఆహారం
2019లో 'న్యూట్రియెంట్స్' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, గుడ్లలో ప్రోటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్ A, D, E, K, B తో పాటు ఎన్నో రకాల ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే గుడ్లను ఒక 'సూపర్ ఫుడ్'గా పరిగణిస్తారు. అయితే, ఈ పోషకాలను పేగుల ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఎలా మార్చుకోవచ్చో డాక్టర్ సేథీ వివరించిన విధానం ఇక్కడ ఉంది.
సొనతో సహా రెండు గుడ్లు
రెండు గుడ్లు క్రాక్ చేసి పచ్చ సొనతో సహా బౌల్‌లో తీసుకోండి. చాలామంది గుడ్డులోని పచ్చసొన (Yolk) తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతుంటారు. అయితే, ఈ భయం పాతకాలపు సైన్స్ అని డాక్టర్ సేథీ కొట్టిపారేశారు. ఆరోగ్యవంతులు రోజుకు రెండు పచ్చసొనలు హాయిగా తినవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఆ రెండు దినుసులే 'సీక్రెట్'
ఆ రెండు గుడ్లకు చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి జత చేయండి. ఈ రెండూ డాక్టర్ సేథీ చెప్పిన సీక్రెట్ మంత్రాలు. పసుపులో అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (వాపు నిరోధక) గుణాలు ఉంటాయి. అయితే, మిరియాల పొడిని కలిపినప్పుడు మాత్రమే పసుపులోని ఆ గుణాలు యాక్టివేట్ అయ్యి శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి. ఇది పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఉప్పు - కొద్దిగా అయితేనే ముద్దు
ఈ గుడ్లకు తగినంత ఉప్పు జత చేయండి. వంటలో రుచి కోసం ఉప్పు అవసరమే కానీ, దాన్ని చాలా తక్కువగా వాడాలని ఆయన సూచించారు. ఉప్పును ఎంత తక్కువగా వాడితే ఆరోగ్యానికి అంత మంచిది.
కూరగాయలతో నింపేయండి
కేవలం గుడ్లు మాత్రమే కాకుండా, అందులో టమోటాలు, ఉల్లిపాయలు, మష్రూమ్స్ లేదా ఆలివ్స్ వంటి మీకు నచ్చిన కూరగాయలను చేర్చండి. "ఇది ఆహారానికి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను జోడిస్తుంది. ఇవి మీ పేగుల్లో ఉండే మేలు చేసే బ్యాక్టీరియాకు ఎంతో ఇష్టమైన ఆహారం" అని ఆయన వివరించారు.
తక్కువ నూనెలో
గుడ్లను వేయించినా లేదా ఆమ్లెట్‌గా వేసుకున్నా.. తక్కువ మంట మీద సున్నితంగా వండాలి. నూనెలో ముంచేయకుండా జాగ్రత్త పడండి. అప్పుడే అందులోని సహజమైన పోషకాలు దెబ్బతినకుండా ఉంటాయి.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే లేదా కొత్త ఆహారపు అలవాట్లు మొదలుపెట్టే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించడం మర్చిపోవద్దు. ఈ కథనం సోషల్ మీడియాలో నిపుణులు పంచుకున్న సమాచారం ఆధారంగా రూపొందించింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


