సంతానలేమికి కారణమవుతున్న హెచ్‌పీవీ: స్క్రీనింగ్ చాలా ముఖ్యం
భారతదేశంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్ల పట్ల అవగాహన చాలా తక్కువ. ఈ వైరస్ కేవలం క్యాన్సర్‌కే కాదు, దేశంలో పెరుగుతున్న సంతానలేమి సమస్యకు కూడా ప్రధాన కారణమవుతోందని డాక్టర్ శ్రీనివాస వరలక్ష్మి యాకసిరి (MBBS, DGO, రీజినల్ మెడికల్ హెడ్ & ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఒయాసిస్ ఫర్టిలిటీ) చెబుతున్నారు.
భారతదేశంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) గురించి చర్చ వస్తే చాలామంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, ఈ వైరస్ నిశ్శబ్దంగా దేశంలో ‘సంతానలేమి’ (Infertility) మహమ్మారిని పెంచుతోందన్న చేదు నిజం చాలామందికి తెలియదు. మన దేశంలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో 6.6 శాతం మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. సరైన స్క్రీనింగ్ లేకపోవడం వల్ల సుమారు 2.4 కోట్ల మంది మహిళలు, అంతకంటే ఎక్కువ మంది పురుషులు ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు అంచనా.

హెచ్‌పీవీ (HPV) అంటే ఏమిటి?
ఇది లైంగికంగా సంక్రమించే వైరస్. ఇందులో 100కు పైగా రకాలు ఉన్నాయి. వీటిని 'తక్కువ ముప్పు' (Low-risk), 'ఎక్కువ ముప్పు' (High-risk) అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు, కొన్నిసార్లు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, హై-రిస్క్ వైరస్ శరీరంలోనే ఉండిపోతే అది జననేంద్రియాలపై మొటిమలు (Warts) లేదా క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ క్రమంలో అది పునరుత్పత్తి కణజాలాన్ని (Reproductive tissue) దెబ్బతీసి, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.
మహిళల్లో సంతానలేమికి ఎలా కారణమవుతుంది?
హై-రిస్క్ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ మహిళల్లో గర్భాశయ ముఖద్వారంలో మార్పులు తెస్తుంది. దీనివల్ల గర్భం దాల్చడంలోనూ, గర్భం నిలవడంలోనూ సమస్యలు ఎదురవుతాయి.
- పిండం ఇంప్లాంటేషన్ సమస్య: గర్భాశయ గోడలకు పిండం అంటుకోవడాన్ని ఈ వైరస్ అడ్డుకుంటుంది. గర్భాశయ లైనింగ్‌లో కణాల మరణం (Cell death) పెరగడం వల్ల పిండం సరిగ్గా అభివృద్ధి చెందదు. దీనివల్ల గర్భస్రావం (Miscarriage) అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
- యోని మైక్రోబయోమ్ మార్పు: ఆరోగ్యకరమైన యోని స్రావాలు గర్భం దాల్చడానికి తోడ్పడతాయి. వైరస్ ప్రభావంతో ఈ వాతావరణం దెబ్బతిని ఇన్ఫెక్షన్ ముదురుతుంది.
- చికిత్స వల్ల కలిగే ఇబ్బందులు: ఒకవేళ హెచ్‌పీవీ వల్ల గర్భాశయంలో గాయాలు (Lesions) ఏర్పడితే, వాటిని తొలగించే క్రమంలో గర్భాశయ ముఖద్వారం బలహీనపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే కాన్పు (Preterm birth) అయ్యే అవకాశం ఉంది. పరిస్థితి విషమించి క్యాన్సర్ వరకు వెళ్తే.. కీమోథెరపీ లేదా సర్జరీ వల్ల శాశ్వతంగా సంతాన సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
పురుషులపై ప్రభావం తక్కువేమీ కాదు
చాలామంది హెచ్‌పీవీ కేవలం మహిళలకే వస్తుందనుకుంటారు, కానీ ఇది పురుషులను కూడా సమానంగా దెబ్బతీస్తుంది.
- శుక్రకణాల నాణ్యత: ఈ వైరస్ శుక్రకణాలకు అంటుకుని వాటి కదలికను (Motility), సాంద్రతను తగ్గిస్తుంది.
- డీఎన్ఏ విచ్ఛిన్నం: శుక్రకణాల్లోని డీఎన్ఏ విచ్ఛిన్నం కావడం వల్ల ఫలదీకరణం జరగడం కష్టమవుతుంది.
- ఆక్సిడేటివ్ స్ట్రెస్: వీర్యంలో అస్థిర అణువులను పెంచి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీనివల్ల పిండం నాణ్యత దెబ్బతిని ఐవీఎఫ్ (IVF) వంటి చికిత్సల్లో కూడా సక్సెస్ రేటు తగ్గిపోతుంది.
ఒక అధ్యయనం ప్రకారం.. హెచ్‌పీవీ లేని దంపతుల్లో గర్భస్రావం రేటు 15 శాతంగా ఉంటే, హెచ్‌పీవీ సోకిన వారిలో అది 66.7 శాతంగా ఉండటం గమనార్హం.
పరిష్కారం: ముందస్తు స్క్రీనింగ్, వ్యాక్సినేషన్
హెచ్‌పీవీ నేరుగా సంతానలేమిని కలిగించకపోయినా, సంతానోత్పత్తికి అవసరమైన కణాల నాణ్యతను దెబ్బతీయడం ద్వారా పరోక్షంగా ఈ సమస్యకు కారణమవుతోంది.
- రెగ్యులర్ చెకప్స్: లక్షణాలు ఉండవు కాబట్టి పాప్ స్మియర్ (Pap smear) లేదా హెచ్‌పీవీ టెస్ట్ ద్వారా మాత్రమే దీనిని గుర్తించగలం. ప్రతి మహిళా క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి.
- వ్యాక్సినేషన్: హెచ్‌పీవీ వ్యాక్సిన్లు సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. పైగా ఇవి ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి.
తల్లిదండ్రులు కావాలనుకునే వారు తమ ఆరోగ్యంతో పాటు హెచ్‌పీవీ వంటి నిశ్శబ్ద శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండటం నేటి కాలంలో అత్యంత అవసరం.
- డాక్టర్ శ్రీనివాస వరలక్ష్మి యాకసిరి, MBBS, DGO
రీజినల్ మెడికల్ హెడ్ & ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
ఒయాసిస్ ఫర్టిలిటీ

ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


