ఈయన రోజుకు రూ.7.1 కోట్ల విరాళంగా ఇచ్చేస్తున్నారు

దేశంలోని కుబేరులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.11,554 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా-2026లో హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ కుటుంబ విరాళాలు 127 శాతం పెరిగి రెండో స్థానానికి ఎగబాకాయి.

Updated on: Nov 21, 2026, 15:27:56 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలోని అత్యంత సంపన్నులు సేవా కార్యక్రమాలకు భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కుబేరులు ఏకంగా రూ. 11,554 కోట్లు విరాళంగా అందించారు. అంతకుముందు ఏడాది నమోదైన రూ. 10,380 కోట్లతో పోలిస్తే దాతృత్వ విరాళాలు 11 శాతం పెరిగాయి. నవంబర్ 20న విడుదలైన 'ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్-2026' ఈ ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది.

దాతృత్వంలో మళ్లీ శివ్ నాడార్ టాప్.. రోజుకు రూ.7.1 కోట్ల విరాళం
దాతృత్వంలో మళ్లీ శివ్ నాడార్ టాప్.. రోజుకు రూ.7.1 కోట్ల విరాళం

దేశంలో సంపద సృష్టితో పాటు సామాజిక బాధ్యతగా తిరిగి సమాజానికి ఇచ్చే సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది. తాజా జాబితాలో మొత్తం 219 మంది దాతలు చోటు దక్కించుకున్నారు. గత ఏడాది జాబితాలో కేవలం 12 మంది కొత్త దాతలు చేరగా, ఈసారి ఏకంగా 45 మంది కొత్తగా జాబితాలోకి రావడం విశేషం.

రోజుకు రూ.7.1 కోట్లు.. అగ్రస్థానంలో శివ్ నాడార్

ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజ్ ఛైర్మన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ మరోసారి దేశంలోనే అత్యంత ఉదార దాతగా నిలిచారు. ఆయన కుటుంబం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,593 కోట్లు విరాళంగా ఇచ్చింది. వార్షిక ప్రాతిపదికన ఆయన విరాళాలు 4 శాతం తగ్గినప్పటికీ, సగటున రోజుకు రూ.7.1 కోట్ల చొప్పున సేవా కార్యక్రమాలకు ఖర్చు చేశారు. వరుసగా ఐదో ఏడాది శివ్ నాడార్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. మొదటి స్థానంలో ఉన్న శివ్ నాడార్‌కు, రెండో స్థానంలో ఉన్న దాతకు మధ్య రూ.1,716 కోట్ల భారీ వ్యత్యాసం ఉండటం ఆయన దాతృత్వ స్థాయిని చాటుతోంది.

రెట్టింపైన అదానీ విరాళాలు.. టాప్-10 దాతలు వీరే

ఈసారి జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కుటుంబం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాది రూ. 386 కోట్లు ఇచ్చిన అదానీ కుటుంబం, ఈసారి విరాళాలను 127 శాతం పెంచి ఏకంగా రూ. 877 కోట్లు అందించింది. తద్వారా మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. బజాజ్ కుటుంబం విరాళాలను 42 శాతం పెంచి రూ. 632 కోట్లతో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం రూ. 620 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని రూ. 380 కోట్లతో ఐదో స్థానం దక్కించుకోగా, కుమార మంగళం బిర్లా కుటుంబం రూ. 366 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా, ఆదార్ పూనావాలా రూ. 336 కోట్లతో ఏడో స్థానం పొందారు. టోరెంట్ గ్రూప్‌నకు చెందిన సుధీర్ మెహతా, సమీర్ మెహతా రూ. 334 కోట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. మణిపాల్ గ్రూప్‌నకు చెందిన రంజన్ పాయ్ కుటుంబం రూ. 219 కోట్లతో తొమ్మిదో స్థానంలో టాప్-10లోకి ప్రవేశించగా, రోహిణి నీలేకని రూ. 215 కోట్లతో పదో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ టాప్-10 దాతలు కలిసి మొత్తం రూ.6,572 కోట్లు విరాళంగా ఇచ్చారు. దేశంలోని మొత్తం విరాళాల్లో ఇది 57 శాతానికి సమానం.

19 మంది నుంచే 68 శాతం విరాళాలు

దేశంలో దాతృత్వ విరాళాలు పెరుగుతున్నప్పటికీ, సింహభాగం నిధులు కొద్దిమంది కుబేరుల నుంచే వస్తున్నాయి. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వారు జాబితాలో కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా కలిసి రూ. 7,838 కోట్లు అందించారు. మొత్తం విరాళాల్లో వీరి వాటానే 68 శాతంగా ఉంది.

మరోవైపు స్వశక్తితో ఎదిగిన (సెల్ఫ్-మేడ్) దాతల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది జాబితాలో 101 మంది ఉండగా, ఈసారి ఆ సంఖ్య 125కు చేరింది. మొత్తం విరాళాల్లో 65 శాతం వీరి నుంచే వచ్చాయి. మహిళా దాతల ప్రాతినిధ్యం కూడా 24 నుంచి 29కి పెరిగింది. మహిళల్లో రోహిణి నీలేకని అత్యధిక విరాళాలతో అగ్రస్థానంలో కొనసాగగా, బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షా ఆ తర్వాతి స్థానంలో నిలిచారు.

విద్య, వైద్య రంగాలకే పెద్దపీట.. నగరాల్లో ఢిల్లీ టాప్

సంపన్నులు తమ విరాళాల్లో అత్యధిక ప్రాధాన్యం విద్య, వైద్య రంగాలకే ఇస్తున్నారు. విద్యా రంగానికి అత్యధికంగా 200 మంది దాతల నుంచి రూ.4,188 కోట్లు అందాయి. వైద్య రంగానికి విరాళాలు 82 శాతం పెరిగి రూ.1,768 కోట్లకు చేరాయి.

నగరాల వారీగా పరిశీలిస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నుంచి అత్యధికంగా 64 మంది దాతలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి 41 మంది, బెంగళూరు నుంచి 20 మంది నిలిచారు. అయితే విరాళాల విలువ పరంగా చూస్తే న్యూఢిల్లీ రూ.3,168 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో ఒకవైపు అగ్రశ్రేణి దాతల నుంచే భారీ నిధులు వస్తూనే, మరోవైపు కొత్త దాతల భాగస్వామ్యం పెరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.