ఒత్తిడి మంచిదేనా? దీని నుంచి ఎలా ప్రయోజనం పొందాలి?

స్ట్రెస్ కూడా మంచిదే అంటుంది సైకాలజీ. మనం సాధారణంగా స్ట్రెస్ ఒక నెగటివ్ విషయంగానే చూస్తాం. నిద్ర లేమి, ఆందోళన, ఆరోగ్యం దెబ్బతినడం వంటి దుష్ప్రభావాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. అంతర్జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం సందర్భంగా స్ట్రెస్ తో జరిగే మంచి ఏంటో తెలుసుకుందాం.

Published on: Nov 4, 2025, 16:40:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అప్పుడెప్పుడో ఓ డిటెర్జెంట్ పౌడర్ గురించి మరక మంచిదే అంటూ ఓ యాడ్ వచ్చింది గుర్తుందా?.. అలాగే స్ట్రెస్ కూడా మంచిదే అంటుంది సైకాలజీ. మనం సాధారణంగా స్ట్రెస్ ఒక నెగటివ్ విషయంగానే చూస్తాం. నిద్ర లేమి, ఆందోళన, ఆరోగ్యం దెబ్బతినడం వంటి దుష్ప్రభావాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. స్ట్రెస్ లో ఓ సానుకూల కోణం కూడా ఉంది. అన్ని రకాల స్ట్రెస్ లు మనకు హాని చేయవు, కొన్ని మంచి కూడా చేస్తాయి. ఇలా మంచి చేసే దాన్నే యూస్ట్రెస్ అంటారు. ఈ "మంచి ఒత్తిడి" మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఒత్తిడి మంచిదేనా? దీని నుంచి ఎలా ప్రయోజనం పొందాలి?
ఒత్తిడి మంచిదేనా? దీని నుంచి ఎలా ప్రయోజనం పొందాలి?

ఏటా నవంబర్ నెలలో మొదటి బుధవారాన్ని అంతర్జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం గా పరిగణిస్తారు. ఈ సందర్భంగా యూస్ట్రెస్ వల్ల జరిగే మంచి ఏంటో తెలుసుకుందాం.

యూస్ట్రెస్ అనేది సానుకూల ఒత్తిడి. ఇది మనల్ని ఉత్సాహపరుస్తుంది, ప్రేరేపిస్తుంది. మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి, కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి, ఒక సవాలును స్వీకరించడానికి సిద్ధమయ్యేటప్పుడు కలిగే అనుభూతి ఇది. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడం, పరీక్ష రాయడానికి సిద్ధమవడం, ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ ఇవ్వడం లాంటి పరిస్థితుల్లో కలిగే కొద్దిపాటి ఒత్తిడి మనల్ని అప్రమత్తం చేస్తుంది, ఫోకస్ పెంచుతుంది.

పాంచ్ పటాకా..

యూస్ట్రెస్ మనకు అనేక విధాలుగా సహాయపడుతుంది. అవి ఇలా ఉన్నాయి.

1. మెరుగైన పనితీరు, ప్రేరణ

నియంత్రిత స్థాయిలో ఉండే ఒత్తిడి మన ఏకాగ్రతను పెంచి, పనితీరును మెరుగుపరుస్తుంది. గడువు సమీపించేటప్పుడు, ఆ ఒత్తిడి కారణంగానే మనం త్వరగా, సమర్థవంతంగా పని పూర్తి చేయగలుగుతాం. ఇది మనలో సాధించాలనే తపనను పెంచుతుంది.

2. జ్ఞాపకశక్తి, మేధస్సు పెరుగుదల

తక్కువ కాల వ్యవధి గల ఒత్తిడి, మెదడులో కొత్త నరాల కణాలు ఏర్పడటానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది మన జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని తాత్కాలికంగా మెరుగుపరుస్తుంది.

3. శక్తి, అప్రమత్తత

ఒత్తిడి ప్రతిస్పందనగా, శరీరం అడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది మన గుండె వేగాన్ని పెంచి, కండరాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వలన మనం మరింత శక్తివంతంగా, ఏ పనికైనా సిద్ధంగా ఉంటాం.

4. నిరోధక శక్తి పెంపు

తక్కువ సమయం ఉండే ఒత్తిడి, శరీరాన్ని గాయం లేదా ఇన్ఫెక్షన్ కోసం సిద్ధం చేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ రక్షణ యంత్రాంగాన్ని తాత్కాలికంగా మెరుగుపరుస్తుంది.

5. స్థైర్యం, ఎదుగుదల

సవాళ్లను అధిగమించడానికి యూస్ట్రెస్ సహాయపడుతుంది. ఒక ఒత్తిడితో కూడిన పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కొన్నప్పుడు, భవిష్యత్తులో వచ్చే కష్టాలను తట్టుకునే స్థైర్యాన్ని మనం పొందుతాం. ఇది వ్యక్తిగత ఎదుగుదలకు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించడానికి దారితీస్తుంది.

బలంగా మార్చుకోండి..

సాధారణంగా ఒత్తిడి మనల్ని బలహీనపరుస్తుంది అనుకుంటాం. కానీ, దాన్ని సరైన పద్ధతిలో చూసినట్లయితే, అదే మనకు శక్తిగా, ప్రేరణగా మారుతుంది. స్ట్రెస్ ని స్ట్రెంగ్త్ గా మార్చు కోవడానికి ఇలా చేయండి.

  • ఒత్తిడిని 'నన్ను అణచివేసే సమస్య'గా కాకుండా, 'నేను ఎదుర్కోగల సవాలు' గా చూడండి. ఒత్తిడి మీ శరీరాన్ని ఏదో ఒక ముఖ్యమైన పని కోసం సిద్ధం చేస్తోందని గుర్తించండి. ఆ భావనను శక్తిగా ఉపయోగించండి.
  • ఒత్తిడికి కారణమవుతున్న పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి, ఒక్కో పనిపై దృష్టి పెట్టండి. దీనివల్ల పరిస్థితి మీ నియంత్రణలో ఉన్నట్లు అనిపిస్తుంది. సమయపాలన, పనులకు సరైన గడువు పెట్టుకోవడం, సమయాన్ని సక్రమంగా వినియోగించడం ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఒత్తిడి హార్మోన్లు తగ్గి, సంతోషాన్నిచ్చే ఎండార్ఫిన్స్ (Endorphins) విడుదల అవుతాయి.
  • డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ మనస్సును శాంతపరుస్తాయి. తగినంత నిద్ర (7-9 గంటలు) ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని మెదడుకు ఇస్తుంది.
  • గతంలో మీరు విజయవంతంగా అధిగమించిన ఒత్తిడితో కూడిన పరిస్థితులను గుర్తు చేసుకోండి. ఆ అనుభవాన్ని బలంగా భావించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం ద్వారా మీ స్థైర్యం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో వచ్చే పెద్ద సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
  • ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యకరమైన, స్వల్పకాలిక ఒత్తిడి (యూస్ట్రెస్) మాత్రమే బలంగా మారుతుంది. యూస్ట్రెస్, డిస్ట్రెస్ మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం. దీర్ఘకాలికంగా, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒత్తిడి (డిస్ట్రెస్) ఉంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.

- బి.కృష్ణభరత్, సైకాలజిస్ట్

నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్,

అడ్వాన్స్‌డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ ( ఏపీఏ ఇండియా)

బి. కృష్ణభరత్
సైకాలజిస్ట్, జాతీయ నిర్వాహక అధ్యక్షుడు, ఏపీఏ ఇండియా
బి. కృష్ణభరత్ సైకాలజిస్ట్, జాతీయ నిర్వాహక అధ్యక్షుడు, ఏపీఏ ఇండియా
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More