మెట్లు ఎక్కితే ఆయాసమా? వయసు ప్రభావమా లేక సీవోపీడీ ముప్పు పొంచి ఉందా?
వయసు పెరిగేకొద్దీ ఆయాసం రావడం సహజమని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ నిరంతరం వేధించే ఆయాసం సీవోపీడీ (COPD) వంటి తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధికి తొలి సంకేతం కావచ్చని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కే. యుగవీర్ గౌడ్ హెచ్చరిస్తున్నారు.
వయసు పైబడుతున్న కొద్దీ కొద్దిపాటి శారీరక శ్రమకే త్వరగా ఆయాసపడటం చాలామందిలో కనిపించే సాధారణ మార్పు. మెట్లు ఎక్కేటప్పుడు, ఎత్తు ప్రదేశాల్లో నడిచేటప్పుడు లేదా నిత్యావసర సరుకులు మోసేటప్పుడు మునుపటి కంటే ఎక్కువగా అలసిపోతుంటారు. వయసు పెరగడం వల్లే ఇలా జరుగుతోందని చాలామంది ఈ లక్షణాలను తేలికగా తీసుకుంటారు. అయితే, తగ్గకుండా వేధించే లేదా రోజురోజుకూ పెరుగుతున్న ఆయాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ - COPD) వ్యాధికి ప్రారంభ సంకేతం కావచ్చని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కే. యుగవీర్ గౌడ్ వివరిస్తున్నారు.

సీవోపీడీ (COPD) అంటే ఏమిటి?
సీవోపీడీ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక, క్రమంగా ముదిరే వ్యాధి. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇందులో ప్రధానంగా రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి క్రానిక్ బ్రాంకైటిస్ (Chronic Bronchitis) — దీనివల్ల శ్వాసనాళాల్లో దీర్ఘకాలిక వాపు ఏర్పడి, కఫం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రెండోది ఎంఫిసెమా (Emphysema) — ఇది ఊపిరితిత్తుల్లోని సూక్ష్మమైన గాలి గదులను దెబ్బతీస్తుంది.
ఫలితంగా ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లడం, బయటకు రావడానికి ఆటంకం ఏర్పడి శ్వాస తీసుకోవడం భారంగా మారుతుంది. సీవోపీడీ ఒక్కసారిగా కాకుండా కొన్ని సంవత్సరాల పాటు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధిని ఎక్కువగా గుర్తిస్తుంటారు.
వయసు ప్రభావానికి, తొలి దశ సీవోపీడీకి తేడా ఏంటి?
వయసు పెరిగేకొద్దీ కండరాల బలం తగ్గడం, స్టామినా కోల్పోవడం, శారీరక శ్రమ తర్వాత కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం వంటి మార్పులు సహజమే. కానీ రోజువారీ సాధారణ పనులు చేసేటప్పుడే ఊపిరి ఆడకపోవడాన్ని వయసుపై నెట్టేయకూడదు. సీవోపీడీ తొలి దశలో కనిపించే కొన్ని హెచ్చరిక సంకేతాలను గుర్తించడం చాలా అవసరం.
రోజువారీ పనుల్లో ఆయాసం: గతంలో సులభంగా చేసిన నడక, మెట్లు ఎక్కడం లేదా ఇంటి పనులు చేసేటప్పుడు ఇప్పుడు తీవ్రంగా ఆయాసం రావడం.
దీర్ఘకాలిక దగ్గు: కఫంతో కూడిన దగ్గు లేదా పొడి దగ్గు వారాల తరబడి తగ్గకుండా వేధిస్తుంటే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
అధికంగా కఫం రావడం: ప్రతిరోజూ, మరీ ముఖ్యంగా ఉదయం పూట దగ్గుతో పాటు ఎక్కువగా కఫం పడుతుంటే అది శ్వాసనాళాల వాపునకు సంకేతం కావచ్చు.
పిల్లికూతలు, ఛాతీ బిగుతుగా అనిపించడం: శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతల వంటి శబ్దం రావడం లేదా ఛాతీలో ఎప్పుడూ బిగుతుగా అనిపించడం శ్వాసనాళాలు కుంచించుకుపోయాయని సూచిస్తుంది.
అసాధారణ అలసట: శక్తి తగ్గిపోవడం, తరచూ నీరసంగా ఉండటం, శ్వాస ఇబ్బందుల కారణంగా క్రమంగా శారీరక, సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం.
తరచూ ఛాతీలో ఇన్ఫెక్షన్లు: శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం లేదా తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకోవడం కూడా ప్రమాద ఘంటికే.
ఎవరికి ఎక్కువ ముప్పు పొంచి ఉంది?
ధూమపానం (Smoking) సీవోపీడీ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. అయితే, సిగరెట్ తాగని వారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బయటి వాయు కాలుష్యం, వంటగదిలో పొగ, ఇతరులు వదిలే సిగరెట్ పొగ (సెకండ్ హ్యాండ్ స్మోక్) పీల్చడం, పనిచేసే చోట దుమ్ము, రసాయన పొగల బారిన దీర్ఘకాలం పడటం వల్ల ఈ వ్యాధి ముప్పు పెరుగుతుంది. వీటితో పాటు ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ లోపం వంటి కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా సీవోపీడీకి దారితీయవచ్చు.
ముందస్తు నిర్ధారణ ఎందుకు కీలకం?
సీవోపీడీ వల్ల ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని పూర్తిగా వెనక్కి తిప్పలేం. కానీ, సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే లక్షణాలను అదుపులో ఉంచడంతో పాటు వ్యాధి మరింత ముదరకుండా అడ్డుకోవచ్చు. వ్యాధి నిర్ధారణ కోసం సాధారణంగా 'స్పైరోమెట్రీ' (Spirometry) అనే శ్వాస పరీక్ష నిర్వహిస్తారు. ఒక వ్యక్తి ఎంత గాలిని, ఎంత వేగంగా బయటకు వదలగలరో ఈ పరీక్ష ద్వారా కొలుస్తారు.
వైద్యులు సూచించే ఇన్హేలర్లు, పల్మనరీ రిహాబిలిటేషన్, వ్యాక్సినేషన్లు, ధూమపానం మానేయడం, కాలుష్య కారకాలకు దూరంగా ఉండటం వంటి చర్యలతో మెరుగైన జీవనం సాగించవచ్చు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
కొత్తగా మొదలైన, తగ్గకుండా వేధిస్తున్న లేదా క్రమంగా పెరుగుతున్న ఆయాసాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయవద్దు. రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ అకస్మాత్తుగా తీవ్రమైన ఆయాసం రావడం, ఛాతీ నొప్పి, స్పృహ తప్పడం లేదా పెదాలు నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
వయసు పెరిగితే ఆయాసం రావడం తప్పనిసరి అని సరిపెట్టుకోకూడదు. హెచ్చరిక సంకేతాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరును కాపాడుకోవడంతో పాటు ఇతరులపై ఆధారపడకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


