...
...
Next Story

9 to 5 ఉద్యోగం.. రాత్రి పూట చదువు: 5వ ప్రయత్నంలో IPS సాధించిన జన్‌దీప్

పగలు ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు.. రాత్రి పూట ఆన్‌లైన్ సెల్ఫ్ స్టడీ. ఓటమి ఎదురైనా వెనకడుగు వేయకుండా UPSCలో 147వ ర్యాంక్ సాధించి IPS సాధించారు పంజాబ్‌కు చెందిన జన్‌దీప్ కౌర్. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఇదిగో..

Published on: Jul 27, 2026, 10:57:02 IST
Advertisement

ఉద్యోగం చేస్తూ సివిల్స్ సాధించడం సాధారణ విషయం కాదు. అందునా రోజుకు 8 గంటలు ఆఫీసులోనే గడిపి, ఆపై పుస్తకాలు పట్టుకోవడం మరింత కష్టం. కానీ, పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన లక్ష్యాన్నైనా ముద్దాడవచ్చని నిరూపించారు పంజాబ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన జన్‌దీప్ కౌర్. పగటిపూట ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, రాత్రి వేళల్లో స్వయంగా చదువుకుని UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో మెరిసారు. తన 5వ ప్రయత్నంలో ఆల్ ఇండియా 147వ ర్యాంకు సాధించి, ప్రతిష్టాత్మక ఐపీఎస్ (IPS) అధికారిగా ఎంపికయ్యారు.

B.Tech నుంచి SSC CGL వైపు..

9 to 5 ఉద్యోగం.. రాత్రి పూట చదువు: 5వ ప్రయత్నంలో IPS సాధించిన జన్‌దీప్ (Instagram -@ jandeeptiwanaa_ips)
9 to 5 ఉద్యోగం.. రాత్రి పూట చదువు: 5వ ప్రయత్నంలో IPS సాధించిన జన్‌దీప్ (Instagram -@ jandeeptiwanaa_ips)

పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా చనార్థల్ ఖుర్ద్ గ్రామానికి చెందిన జన్‌దీప్ కౌర్ చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు. పటియాలాలోని ప్రముఖ థాపర్ విశ్వవిద్యాలయం నుంచి 'ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్' విభాగంలో బి.టెక్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే కార్పొరేట్ ఉద్యోగాల వైపు వెళ్లకుండా ప్రభుత్వ సర్వీసు సాధించాలని నిర్ణయించుకున్నారు. 2018లో రాసిన SSC CGL పరీక్షలో దేశవ్యాప్తంగా 68వ ర్యాంకు సాధించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఫలితంతో ఆమెకు ఆదాయపు పన్ను శాఖలో (Income Tax Department) ఇన్‌స్పెక్టర్‌గా తొలి ఉద్యోగం లభించింది.

సివిల్స్ వైపు మళ్లించిన ఐఆర్‌ఎస్ అధికారులు

పటియాలాలోని ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసులో బాధ్యతలు చేపట్టిన జన్‌దీప్‌కు రోజూ సీనియర్ ఐఆర్‌ఎస్ (IRS) అధికారులతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారి పనితీరు, నిర్ణయాలు తీసుకునే తీరు, సమాజంపై వారు చూపే ప్రభావం ఆమెను ఎంతగానో ఆకర్షించాయి. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి సివిల్ సర్వీసెస్ అత్యుత్తమ వేదిక అని ఆమె బలంగా నమ్మారు. ఈ ఆలోచనే ఆమెను ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలనే దిశగా అడుగులు వేయించింది.

9 to 5 జాబ్.. రాత్రి వేళల్లో సెల్ఫ్ స్టడీ

సిలబస్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నారు. యూట్యూబ్, ఇంటర్నెట్ లోని ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్‌ను విస్తృతంగా వినియోగించుకున్నారు. రోజూ ఆఫీస్ పనులు పూర్తయ్యాక రాత్రి వేళల్లో చదువుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. వారాంతాల్లో దొరికే సెలవులను పూర్తిగా రివిజన్, మోక్ టెస్టులు రాయడానికి కేటాయించారు.

నాలుగు ఓటములు.. ఐదో ప్రయత్నంలో తిరుగులేని విజయం

జన్‌దీప్ UPSC ప్రయాణం సులువుగా సాగలేదు. వరుసగా నాలుగు ప్రయత్నాల్లో ఆశించిన ఫలితం రాకపోయినా ఆమె నిరాశ చెందలేదు. ప్రతి ప్రయత్నం నుంచి పాఠాలు నేర్చుకుంటూ తన లోపాలను దిద్దుకున్నారు. సమయ నిర్వహణను మరింత పదును పెట్టారు. చివరికి తన 5వ ప్రయత్నంలో (UPSC CSE) ఆల్ ఇండియా 147వ ర్యాంకు సాధించి, ఐపీఎస్‌గా కల నెరవేర్చుకున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని 'సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ' (SVPNPA) లో జన్‌దీప్ కౌర్ కఠిన శిక్షణ పొందుతున్నారు. ఉద్యోగం చేస్తూ సివిల్స్ సాధించాలనుకునే వేలాది మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్, యువతకు జన్‌దీప్ విజయగాథ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON