చదువుకునే రోజులు, కెరీర్‌ను నిర్మించుకునే తరుణంలో హఠాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి, తరచూ విరేచనాలు వేధిస్తే ఆ వేదన వర్ణనాతీతం. టీనేజ్ లేదా యవ్వనంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఎంతోమందిని వేధించే ప్రధాన సమస్య ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ (IBD). ఇది కేవలం జీర్ణవ్యవస్థకు సంబంధించిన తాత్కాలిక అనారోగ్యం మాత్రమే కాదు. జీవిత గమనాన్ని, భవిష్యత్తును ప్రభావితం చేసే దీర్ఘకాలిక సమస్య.
చిన్నవయసులోనే బాధిస్తున్న ఐబీడీ

శరీర రోగనిరోధక వ్యవస్థ అసహజంగా స్పందించి జీర్ణవ్యవస్థలో నిరంతర మంట, వాపు (Inflammation) కలిగించినప్పుడు ఐబీడీ వస్తుంది. జన్యుపరమైన, రోగనిరోధక, పర్యావరణ అంశాలు దీనికి కారణమవుతాయి. ఐబీడీలో ప్రధానంగా రెండు రకాలుంటాయి.
క్రోన్స్ డిసీజ్ (Crohn's Disease): నోటి నుంచి పాయువు వరకు జీర్ణవ్యవస్థలో ఏ భాగాన్నైనా ఇది ప్రభావితం చేయవచ్చు.
అల్సరేటివ్ కొలైటిస్ (Ulcerative Colitis): ఇది కేవలం పెద్దపేగుకు మాత్రమే పరిమితమవుతుంది.
పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, తగ్గని విరేచనాలు, మలంలో రక్తం పడటం, వేగంగా బరువు తగ్గడం వంటివి దీని ముఖ్య లక్షణాలు. పిల్లలు, టీనేజర్లలో ఈ వ్యాధి లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి.
ఎదుగుదలపై తీవ్ర ప్రభావం
చిన్నపిల్లలు, టీనేజర్లలో ఐబీడీని సకాలంలో గుర్తించకపోతే వారి శారీరక వికాసం దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థలో నిరంతరం వాపు ఉండటం వల్ల తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అందవు. ఫలితంగా బరువు పెరగడం కష్టమవుతుంది. కొంతమంది పిల్లలలో యుక్తవయస్సు (Puberty) రావడం కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.
ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే శారీరక పెరుగుదల, ఆరోగ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.
దీర్ఘకాలికంగా ఎదురయ్యే శారీరక ముప్పులు
ఐబీడీ వల్ల కలిగే మంటను సకాలంలో అదుపు చేయకపోతే ప్రేగులు సన్నబడటం (Intestinal Narrowing), తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. కొన్ని తీవ్ర పరిస్థితుల్లో ప్రేగులకు శస్త్రచికిత్స (Surgery) చేయాల్సి వస్తుంది.
{{/usCountry}}ఐబీడీ వల్ల కలిగే మంటను సకాలంలో అదుపు చేయకపోతే ప్రేగులు సన్నబడటం (Intestinal Narrowing), తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. కొన్ని తీవ్ర పరిస్థితుల్లో ప్రేగులకు శస్త్రచికిత్స (Surgery) చేయాల్సి వస్తుంది.
{{/usCountry}}అంతేకాకుండా, సుదీర్ఘకాలం పాటు పెద్దపేగులో వాపు కొనసాగితే భవిష్యత్తులో కొలొరెక్టల్ క్యాన్సర్ (Colorectal Cancer) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, డాక్టర్ సలహా మేరకు కొలొనోస్కోపీ స్క్రీనింగ్ చేయించుకోవడం అత్యంత అవసరం.
మానసిక, సామాజిక ఒత్తిళ్లు
ఐబీడీ ప్రభావం కేవలం శారీరక ఆరోగ్యానికే పరిమితం కాదు. అకస్మాత్తుగా వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి రావడం, తరచుగా ఆసుపత్రుల చుట్టూ తిరగడం వల్ల యువతలో ఆత్మవిశ్వాసం సడలుతుంది. ఇది వారి చదువు, ఉద్యోగం, వ్యక్తిగత బంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
బయటకు కనిపించని వ్యాధి కావడంతో నలుగురిలోకెళ్లడానికి వెనుకాడటం, ఇతరులు ఏమనుకుంటారోననే భయం పెరుగుతాయి. ఫలితంగా మానసిక ఆందోళన (Anxiety), డిప్రెషన్‌కు గురయ్యే అవకాశముంది. ఈ సమయంలో కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి లభించే మానసిక మద్దతు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.
నిత్య జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రోజువారీ కార్యకలాపాల్లో ఇబ్బంది లేకుండా ఉండటానికి ముందస్తు ప్రణాళిక అవసరం:
- బయటకు వెళ్లేముందు వాష్‌రూమ్‌లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం.
- శరీరం అలసిపోయినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం.
- పాఠశాలలు లేదా పనిచేసే చోట ముందే తమ ఆరోగ్య పరిస్థితిని వివరించి వెసులుబాట్లు కోరడం.
- నమ్మకమైన స్నేహితులు, ఉపాధ్యాయులు, సహోద్యోగులతో పరిస్థితిని పంచుకోవడం వల్ల అపోహలు తొలగిపోతాయి.
ఆధునిక వైద్యం అందుబాటులో..
వారాల తరబడి విరేచనాలు కావడం, మలంలో రక్తం పడటం, బరువు తగ్గడం వంటి సమస్యలను సాధారణ కడుపు రుగ్మతలుగా లేదా ఫుడ్ ఇన్టోలరెన్స్ అని తేలిగ్గా తీసిపారేయకూడదు. రక్తం, మలం పరీక్షలతో పాటు ఎండోస్కోపీ, కొలొనోస్కోపీ ద్వారా వ్యాధి తీవ్రతను ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.
ప్రస్తుతం జీవసంబంధిత థెరపీలు (Biologic Therapies), ఆధునిక నోటి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పేగుల్లోని వాపును అదుపు చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చిన్న వయసులోనే ఐబీడీ బారిన పడినంత మాత్రాన జీవితం ఆగిపోయినట్లు కాదు. సరైన వైద్యం, జీవనశైలి మార్పులతో సాధారణ, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.
- వ్యాసకర్త:
డాక్టర్ కిరణ్ పెద్ది,
డైరెక్టర్ - సెంటర్ ఫర్ IBD,
సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్