నొప్పి లేని ప్రతి గడ్డ సాధారణమైంది కాదు: క్యాన్సర్ ముప్పుపై డాక్టర్ హెచ్చరిక

శరీరంపై కనిపించే ప్రతి గడ్డ ప్రమాదకరం కాకపోయినా, నొప్పి లేదని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. సార్కోమా అనే అరుదైన క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ విధానాలు, ముందస్తు హెచ్చరికలపై హైదరాబాద్‌ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీకాంత్ అందించిన మార్గదర్శకాలు ఇవే.

Published on: Jul 20, 2026, 12:37:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శరీరంలో ఎక్కడైనా కొత్తగా గడ్డ కనిపిస్తే వెంటనే భయపడటం సహజం. అయితే, దేహంలో వచ్చే చాలా వరకు గడ్డలు క్యాన్సర్ కావు. ఇవి కొవ్వు గడ్డలు (లిపోమా), నీటి కణుతులు (సిస్ట్‌లు) లేదా లెంఫ్ నోడ్స్ వాపులు కావచ్చు. కానీ నొప్పి లేదనే ఒకే ఒక్క కారణంతో గడ్డలను పక్కన పడేస్తే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నొప్పి లేని ప్రతి గడ్డ సురక్షితమైనది కాదు. అరుదైన సందర్భాల్లో ఇది 'సార్కోమా' అనే ప్రమాదకర క్యాన్సర్ కావొచ్చు.

నొప్పి లేని ప్రతి గడ్డ సాధారణమైంది కాదు: క్యాన్సర్ ముప్పుపై డాక్టర్ హెచ్చరిక
నొప్పి లేని ప్రతి గడ్డ సాధారణమైంది కాదు: క్యాన్సర్ ముప్పుపై డాక్టర్ హెచ్చరిక

సార్కోమా అంటే ఏమిటి?

సార్కోమా అనేది శరీరాన్ని అనుసంధానించే కణజాలాలలో (కనెక్టివ్ టిష్యూస్) వచ్చే ఒక అరుదైన క్యాన్సర్. ఊపిరితిత్తులు లేదా రొమ్ము వంటి అవయవాలలో వచ్చే సాధారణ క్యాన్సర్ల కంటే ఇది పూర్తిగా భిన్నమైనది.

ఈ క్యాన్సర్ శరీరంలోని వివిధ కణజాలాలలో వస్తుంది:

  • కండరాలు
  • కొవ్వు కణాలు
  • స్నాయువులు (Tendons and Ligaments)
  • రక్తనాళాలు
  • నాడులు (Nerves)
  • ఎముకలు, మృదులాస్థి (Cartilage)

సార్కోమాలను ప్రధానంగా సాఫ్ట్ టిష్యూ సార్కోమాలు, బోన్ సార్కోమాలుగా వర్గీకరిస్తారు. ఇవి ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది.

నొప్పి లేకపోవడమే అతిపెద్ద మోసం

సార్కోమా ఆలస్యంగా బయటపడటానికి ప్రధాన కారణం ప్రారంభంలో నొప్పి లేకపోవడమే. చాలామంది దీనిని సాధారణ కండరాల వాపు, క్రీడా గాయం లేదా కొవ్వు గడ్డగా భావించి పొరబడతారు.

గడ్డ బాగా పెరిగి పక్కనే ఉన్న నాడులు, కండరాలపై ఒత్తిడి పెంచినప్పుడే నొప్పి మొదలవుతుంది. అప్పటికే పరిస్థితి క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. అందుకే 'నొప్పి లేదు కాబట్టి ప్రమాదం లేదు' అనే నిర్ధారణకు రాకూడదు.

ఏయే లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు?

శరీరంలో కనిపించే గడ్డల్లో ఈ క్రింది లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి:

  • కాలక్రమేణా పరిమాణం పెరుగుతున్న గడ్డ.
  • 5 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్న గడ్డ (దాదాపు గోల్ఫ్ బాల్ పరిమాణం).
  • చర్మం ఉపరితలంపై కాకుండా లోపలి భాగంలో ఉండే వాపు.
  • తాకినప్పుడు కదలకుండా గట్టిగా ఉండే గడ్డ.
  • శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తర్వాత కూడా మళ్లీ వచ్చే గడ్డ.
  • తిమ్మిరి, మంట, బలహీనత లేదా అవయవాల కదలికలో ఇబ్బందితో కూడిన వాపు.

ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని భయపడాల్సిన పనిలేదు, కానీ సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

శరీర భాగాలను బట్టి మారుతున్న లక్షణాలు

సార్కోమా అన్ని వేళలా ప్రత్యక్షంగా గడ్డ రూపంలోనే కనిపించదు. అది ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి.

చేతులు లేదా కాళ్ళపై వచ్చే సాఫ్ట్ టిష్యూ సార్కోమాలు నెమ్మదిగా పెరుగుతూ నొప్పి లేని గడ్డలా కనిపిస్తాయి. ఎముకల సార్కోమా వస్తే నిరంతరం ఎముకల్లో నొప్పి, వాపు లేదా చిన్న గాయాలకే ఎముకలు విరగడం జరుగుతుంది.

అలాగే, కడుపు భాగంలో వచ్చే సార్కోమాలు చాలా పెద్దవిగా మారే వరకు బయటపడవు. ఇవి కడుపు ఉబ్బరం, అసౌకర్యం, మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులకు కారణమవుతాయి. నాడులపై ఒత్తిడి తెచ్చే గడ్డల వల్ల తిమ్మిర్లు, బలహీనత ఏర్పడతాయి.

ప్రమాద కారకాలు ఏమిటి?

చాలామందిలో సార్కోమా రావడానికి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ, కొన్ని అంశాలు దీని ముప్పును పెంచుతాయి:

  • గతంలో రేడియేషన్ థెరపీ పొంది ఉండటం.
  • లీ-ఫ్రౌమెని సిండ్రోమ్, న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1 వంటి వంశపారంపర్య జన్యు సమస్యలు.
  • దీర్ఘకాలిక లింఫెడెమా (ద్రవాలు నిలిచిపోయి వచ్చే వాపు).
  • కొన్ని రకాల పారిశ్రామిక రసాయనాలకు గురికావడం.
  • ఎటువంటి ప్రమాద కారకాలు లేని వారికి కూడా సార్కోమా వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

నిర్ధారణ, చికిత్స విధానాలు

వైద్యులు మొదట శారీరక పరీక్ష చేసి, అవసరాన్ని బట్టి వివిధ పరీక్షలు సిఫార్సు చేస్తారు. చర్మంపై ఉన్న గడ్డలకు అల్ట్రాసౌండ్, మృదు కణజాలాలను స్పష్టంగా చూడటానికి MRI, లోపలి భాగాలను పరిశీలించడానికి CT స్కాన్ నిర్వహిస్తారు. అయితే క్యాన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించడానికి 'బయాప్సీ' (Biopsy) ఒక్కటే సరైన మార్గం.

క్యాన్సర్ పరిమాణం, స్థానం, రకం, దశను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ప్రారంభ దశలో ఉన్న సార్కోమాకు శస్త్రచికిత్స (Surgery) చేసి గడ్డను పూర్తిగా తొలగిస్తారు. పరిస్థితిని బట్టి సర్జరీకి ముందు లేదా తర్వాత రేడియోథెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యునోథెరపీ అందిస్తారు.

శరీరంలో వచ్చే చాలా వరకు గడ్డలు హాని చేయనివే, అందువల్ల కంగారు పడాల్సిన పనిలేదు. కానీ క్రమంగా పెరుగుతున్న, గట్టిగా ఉండే, వారాల తరబడి తగ్గని గడ్డలను నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స సాధ్యమవుతుంది.

వ్యాసకర్త:

డాక్టర్ కె. శ్రీకాంత్,

సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్,

యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.

డాక్టర్ కె. శ్రీకాంత్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.
డాక్టర్ కె. శ్రీకాంత్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More