లంగ్ క్యాన్సర్ అవగాహన: అపోహలు దూరం చేసి, ప్రాణాలు కాపాడుదాం: డాక్టర్ శ్రవణ్
లంగ్ క్యాన్సర్ అవగాహనా మాసం సందర్భంగా దీనిపై అవగాహన పెంచుకుని, అపోహలు దూరం చేసుకుని ప్రాణాలు కాపాడుకోవాలని విజయవాడ మణిపాల్ హాస్పిటల్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్, మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ బోడేపూడి పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా నమోదయ్యే క్యాన్సర్లలో లంగ్ క్యాన్సర్ ఒకటి. కానీ దురదృష్టవశాత్తూ, చాలా కేసులు ముదిరిన దశల్లో తప్ప గుర్తించలేకపోతున్నారు. అవగాహన పెరిగి, ముందుగా గుర్తించడం, నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు.

భారతదేశంలో లంగ్ క్యాన్సర్, క్యాన్సర్ మరణాలకు కారణమయ్యే ముఖ్యమైన వ్యాధుల్లో ఒకటిగా నిలుస్తోంది. 2025 నాటికి పురుషుల్లో సుమారు 81,219 కొత్త కేసులు, స్త్రీల్లో 30,000 పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
లంగ్ క్యాన్సర్ అనగానే స్మోకింగ్‌తో లింక్ ఉన్న వ్యాధి అనే భావన ఇప్పటికీ ఉంది కానీ, ఇప్పుడు పొగ త్రాగని వాళ్లలోనూ ఈ వ్యాధి పెరుగుతోందని తెలుసా? మరీ ముఖ్యంగా భారతీయ స్త్రీలల్లో. కారణం? వాయు కాలుష్యం, గ్యాస్ స్టౌ, చెక్కలు, బొగ్గు వంటి ఇండోర్ ఫ్యూయల్ ద్వారా వచ్చే పొగకి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవడం.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో రోగ నిర్ధారణలో సగటు వయస్సు, పాశ్చాత్య దేశాల కంటే ఒక దశాబ్దం తక్కువ, కానీ చాలాసార్లు వ్యాధిని కనుగొనేసరికి, వ్యాధి ముదిరిన దశకి చేరిపోతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా సగటున చూస్తే, మన దేశంలో సర్వైవల్ రేట్ తక్కువగా ఉంది.
ప్రాథమిక సూచనలు – చిన్నవే అయినా కీలకమైనవి
లంగ్ క్యాన్సర్ మొదట్లో వచ్చే లక్షణాలు చాలా సైలెంట్‌గా ఉంటాయి. ఆగని దగ్గు, ఊపిరి అందకపోవడం, ఛాతిలో నొప్పి, గొంతు బొంగురుపోవడం, లేదా అనూహ్యంగా బరువు తగ్గడం లాంటివి. చాలా మందికి, ఇవన్నీ చిన్న సమస్యలుగా అనిపిస్తాయి, లేదా వయసురీత్యా వచ్చే మార్పులేలే అనిపిస్తాయి - కానీ నిర్లక్ష్యం చేయవద్దు. డాక్టర్ దగ్గరకు ఆలస్యంగా వెళ్లడం వల్ల చాలా సమయం వృథా అవుతుంది.
ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం, దగ్గు లేదా శ్వాసకోశ సమస్యలు, దీర్ఘకాలంగా ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు.
ఎల్డీసీటీ స్కాన్ – లంగ్ క్యాన్సర్‌ని ముందే గుర్తించే టెక్నాలజీ
ఇప్పుడు Low-Dose CT (LDCT) స్కాన్ అనే పరీక్ష, లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ విషయంలో విప్లవాత్మక మార్పు తెచ్చింది. పొగ త్రాగేవారికి, లేదా రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. X-ray లాగా పాత పద్ధతి కాకుండా LDCT, చిన్న నోడ్యూల్స్ ని (గడ్డలు) కూడా, లక్షణాలు చూపించేలోపే, చాలా ముందుగానే కనిపెడుతుంది.
అందుకే చాలా దేశాల్లో ఈ పరీక్షను స్క్రీనింగ్ టూల్‌గా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల లంగ్ క్యాన్సర్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు రీసెర్చ్ చెబుతోంది.
కానీ దురదృష్టవశాత్తూ, మన దేశంలో, ముఖ్యంగా హై రిస్క్ గ్రూప్‌లలో, ఇంకా ఈ పరీక్ష గురించి చాలామందికి తెలీదు.
చికిత్స:
గత దశాబ్దంలో లంగ్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కీమోథెరపీ ఒక్కటే ఆప్షన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ వల్ల ప్రతీ పేషెంట్‌కి జెనెటిక్ ప్రొఫైల్‌కి తగ్గ టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యమైంది.
ఇంకా ముందుకు వెళ్లి, ఇమ్యూనోథెరపీ వల్ల, బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ నే క్యాన్సర్‌తో పోరాడేలా ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ కలిపి, రోగులు ఇప్పుడు ఎక్కువ కాలం, మెరుగైన జీవన నాణ్యతతో జీవిస్తున్నారు.
నివారణే అసలు ఆయుధం:
అన్ని వైద్య ప్రగతులకన్నా ముఖ్యమైంది ప్రివెన్షన్ (నివారణ). లంగ్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి స్మోకింగ్ ఆపడం అన్నది అత్యంత ప్రభావవంతమైన అడుగు.
ఏళ్ల తరబడి పొగ తాగినవాళ్లల్లో కూడా, ఆపిన వెంటనే ప్రయోజనం మొదలవుతుంది. అదే సమయంలో, ప్రభుత్వాలు, ప్రజలు కలిసి టొబాకో అందుబాటును తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం, ఇండోర్ ఎయిర్ క్వాలిటీని మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాలి.
అవగాహన: లంగ్ క్యాన్సర్ గురించి అవగాహన కేవలం గణాంకాలకే పరిమితమవకుండా, నిజంగా ప్రతీ ఒక్కరికీ చేరాలి.
ప్రతీ సంభాషణ, వ్యాధి లక్షణాలని గుర్తించడంలోనో, ఎవరో ఒకరిని స్మోకింగ్ ఆపడానికో లేదా స్క్రీనింగ్ చేయించుకునేలానో ప్రేరేపిస్తే, అదే ప్రాణరక్షణకి మొదటి అడుగు.
- డాక్టర్ శ్రవణ్ కుమార్ బోడేపూడి
కన్సల్టెంట్ - మెడికల్ ఆంకాలజీ,
బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్,
మణిపాల్ హాస్పిటల్, విజయవాడ
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


