ఉదయాన్నే బ్లడ్ షుగర్ పెరుగుతోందా? డాక్టర్లు చెప్తున్న కీలక సలహాలు

ఉదయం పూట బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరగడానికి కారణాలు ఏంటి? తిన్న వెంటనే ఏం చేయాలి? అల్పాహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సీమా దాక్ష్ అందించిన మార్గదర్శకాలు ఇవే.

Published on: Nov 11, 2026, 08:58:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఉదయం లేవగానే ఆఫీసుకో, పనులకో పరిగెత్తే హడావుడిలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. సమయం లేకనో, అలవాటు కొద్దో ఉదయాన్నే తీపి టీ తాగి, దొరికిన టిఫిన్ తినేసి పనుల్లో పడిపోతుంటారు. అయితే హార్మోన్ల సమతుల్యత, ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిల (బ్లడ్ షుగర్) నియంత్రణ విషయంలో ఈ తరహా అలవాట్లు తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఉదయాన్నే బ్లడ్ షుగర్ పెరుగుతోందా? డాక్టర్లు చెప్తున్న కీలక సలహాలు
ఉదయాన్నే బ్లడ్ షుగర్ పెరుగుతోందా? డాక్టర్లు చెప్తున్న కీలక సలహాలు

ఉదయం వేళ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో గ్రేటర్ నోయిడాలోని కైలాష్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సీమా దాక్ష్ పలు కీలక విషయాలను వెల్లడించారు.

రాత్రి ఏమీ తినకపోయినా ఉదయాన్నే షుగర్ ఎందుకు పెరుగుతుంది?

మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారిలో రాత్రంతా ఏమీ తినకపోయినా, ఉదయాన్నే నిద్రలేచేసరికి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. దీనికి 'డాన్ ఫినామినా' (Dawn Phenomenon) ప్రధాన కారణమని డాక్టర్ సీమా తెలిపారు.

"ఉదయాన్నే మన శరీరం మేల్కొనేందుకు వీలుగా కార్టిసాల్, గ్రోత్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ల మార్పుల వల్ల కాలేయం గ్లూకోజ్ ఉత్పత్తిని పెంచుతుంది. అదే సమయంలో ఇన్సులిన్ సున్నితత్వం తాత్కాలికంగా తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి లేదా పనితీరు సరిగ్గా ఉండకపోవడం వల్ల పరగడుపున గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి" అని డాక్టర్ సీమా వివరించారు. ఉదయాన్నే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన రాత్రి తప్పుగా ఏదో తిన్నామని కంగారు పడాల్సిన పనిలేదని, ఇది శరీరంలో జరిగే సహజ హార్మోన్ల మార్పుల వల్ల కావచ్చునని ఆమె స్పష్టం చేశారు.

టీ, కాఫీలతో జాగ్రత్త

ఉదయం తాగే టీ లేదా కాఫీ కంటే, అందులో కలిపే చక్కర, వాటితో పాటు తినే పదార్థాలే అసలు సమస్య అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరగడుపున తీపి టీ, కాఫీలతో పాటు బిస్కెట్లు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. టీ, కాఫీలను పూర్తిగా మానాల్సిన అవసరం లేదు కానీ, వాటిలో చక్కెర పరిమాణాన్ని తగ్గించుకోవడం, ప్రాసెస్ చేసిన బిస్కెట్లకు దూరంగా ఉండటం మంచిది.

అల్పాహారంలో ఫైబర్, ప్రొటీన్లు పెంచండి

మన దేశంలో సాధారణంగా పరోటాలు, బ్రెడ్, పండ్ల రసాలు, తీపి తృణధాన్యాలు (Cereals) వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అల్పాహారంగా తీసుకుంటారు. అయితే అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారానికి బదులుగా ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

గుడ్లు, పన్నీరు, పెరుగు, మొలకెత్తిన విత్తనాలు, శనగపిండి లేదా పెసర చిల్లా, గ్రిల్ చేసిన కూరగాయలు, బాదం-జీడిపప్పు వంటి నట్స్, సరైన పరిమాణంలో తృణధాన్యాలను అల్పాహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కడుపు నిండిన భావనను ఇవ్వడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తాయి. అలాగే పండ్ల రసాలు (Juices) తాగే కంటే పండ్లను నేరుగా ముక్కలుగా కోసుకుని తినడమే శ్రేయస్కరం. పండ్లలో ఉండే పీచు పదార్థం (ఫైబర్) గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది.

టిఫిన్ చేసిన వెంటనే కూర్చోవద్దు

అల్పాహారం తిన్న తర్వాత కాసేపు నడవడం ఎంతో మేలు చేస్తుంది. "ఆహారం తిన్న తర్వాత ఎక్కువ సేపు కూర్చోకుండా కాసేపు నడవడం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి. దీనివల్ల తిన్న తర్వాత బ్లడ్ షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది" అని డాక్టర్ సీమా పేర్కొన్నారు. తిన్న వెంటనే కారులోనో, డెస్క్ ముందో లేదా సోఫాలోనో గంటల తరబడి కూర్చునే అలవాటు ఉంటే, మధ్యమధ్యలో కాసేపు నడిచేలా దినచర్యను మార్చుకోవాలి.

నిద్రలేమి, సోషల్ మీడియా 'హ్యాక్స్' ప్రమాదం

రాత్రి పూట సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా గ్లూకోజ్ నియంత్రణ తప్పి ఆకలి, జీవక్రియ దెబ్బతింటాయి. కాబట్టి ప్రశాంతమైన నిద్ర కూడా ఆరోగ్యకరమైన ఉదయానికి ఎంతో అవసరం.

"సోషల్ మీడియాలో వచ్చే రకరకాల ప్రయోగాలు, 'గ్లూకోజ్ హ్యాక్స్' వెంట పడకండి. సరిపడా నిద్ర, సమతుల్య అల్పాహారం, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు-తీపి పానీయాలు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వైద్యులు సూచించిన మందులు సరిగ్గా వాడటమే అసలైన మార్గం" అని డాక్టర్ సూచించారు.

(గమనిక: ఈ కథనం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య లేదా వైద్య సలహా కోసం తప్పనిసరిగా మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More