...
...
Next Story

తమిళ మూలాలు.. పేదరికాన్ని జయించి నోబెల్ శాంతి విజేతగా నిలిచిన ‘నవి పిళ్లై’

వర్ణవివక్ష, తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొని అంతర్జాతీయ మానవ హక్కుల రక్షకురాలిగా ఎదిగిన తమిళ మూలాలున్న నవి పిళ్లైకి 2026 నోబెల్ శాంతి బహుమతి లభించింది. దక్షిణాఫ్రికా క్లేర్‌వుడ్ మురికివాడల నుంచి ఐక్యరాజ్యసమితి ఉన్నత వేదికల వరకు ఆమె సాగించిన అసాధారణ పోరాట కథనం.

Published on: Oct 9, 2026, 19:00:27 IST
Advertisement

దక్షిణాఫ్రికాలోని మురికివాడల్లో పుట్టి, వర్ణవివక్ష బారి నుంచి బయటపడి, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు తమిళ సంతతికి చెందిన నవనీతం "నవి" పిళ్లై. అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేస్తూ, నరమేధాలు, యుద్ధ నేరాలపై విచారణ జరిపించడంలో ఆమె చూపిన సాటిలేని ధైర్యానికి నోబెల్ కమిటీ అక్టోబర్ 9న ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది.

పుస్తకాలు కూడా లేని ఇల్లు.. కమ్యూనిటీ అందించిన ఆసరా

తమిళ మూలాలు.. పేదరికాన్ని జయించి నోబెల్ శాంతి విజేతగా నిలిచిన ‘నవి పిళ్లై’ (Daniel Karmann/DPA via AP)
తమిళ మూలాలు.. పేదరికాన్ని జయించి నోబెల్ శాంతి విజేతగా నిలిచిన ‘నవి పిళ్లై’ (Daniel Karmann/DPA via AP)

క్వాజులు-నటాల్‌లోని క్లేర్‌వుడ్ మురికివాడలో పేద కుటుంబంలో నవి పిళ్లై జన్మించారు. ఆ రోజుల్లో ఆమె ఇంట్లో కనీసం పుస్తకాలు, రేడియో లేదా వార్తాపత్రికలు కూడా ఉండేవి కావు. తండ్రి బస్సు డ్రైవర్, తల్లి చదువుకోలేదు. బ్రిటిష్ కాలంలో ఆమె తాతను చెరకు తోటల్లో వెట్టిచాకిరీ చేసేందుకు కూలీగా దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లారు.

చిన్నప్పుడు లాయర్ అవుతానని నవి పిళ్లై చెబితే, నల్లజాతి పేద పిల్ల న్యాయవాది కావడం ఏంటని చుట్టుపక్కల వారు నవ్వేవారు. బడి ఉపాధ్యాయులు కూడా కాలేజీ చదువులకు చాలా డబ్బులు కావాలంటూ నిరుత్సాహపరిచారు. అయితే, ఆమెలోని పట్టుదలను గుర్తించిన స్థానిక ప్రజలు చిల్లర నాణేలు, రెండు రాండ్ల నోట్లను చందాలుగా సేకరించి ఆమెను కాలేజీకి పంపించారు.

నెల్సన్ మండేలా ఎదుర్కొన్న అడ్డంకులే ఆమెకూ..

యూనివర్సిటీ ఆఫ్ నటాల్ నుంచి బీఏ ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన తర్వాత కూడా నవి పిళ్లైకి కష్టాలు తీరలేదు. 24 ఏళ్ల వయసులో లా ఫార్మ్‌లలో ప్రాక్టీస్ కోసం చేరేందుకు వెళ్తే తెల్లజాతి ప్రతినిధులు తీవ్ర వివక్ష చూపారు. నల్లజాతికి చెందిన మహిళ కావడం, పేదరికం, లింగ వివక్ష అనే మూడు రకాల అడ్డంకులను ఆమె ఒకేసారి ఎదుర్కొన్నారు.

అన్ని ఆటంకాలను అధిగమిస్తూ నవి పిళ్లై 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది రువాండా అంతర్జాతీయ నేర నిరూపణ ట్రిబ్యునల్‌కు ఎన్నికై ఎనిమిదేళ్ల పాటు సేవలు అందించారు. ఆ సమయంలో లైంగిక దాడిని (రేప్) నరమేధంలో భాగమైన నేరంగా గుర్తించేలా ఆమె ఇచ్చిన తీర్పు ప్రపంచ న్యాయ చరిత్రలోనే చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.

ఆ తర్వాత 2003 నుంచి 2008 వరకు ది హేగ్‌లోని అంతర్జాతీయ నేరాల కోర్టు (ఐసీసీ) న్యాయమూర్తిగా, ఆపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేసి అంతర్జాతీయ వేదికలపై మానవ హక్కుల ఐకాన్‌గా మారారు. ప్రస్తుతం 85 ఏళ్ల వయసులో కూడా ఐసీజేలో మయాన్మార్ నరమేధం కేసు విచారణలో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

విధి ఎదురుతిరిగినా, వ్యవస్థలు అడ్డుపడినా ఆత్మవిశ్వాసంతో పోరాడి విజయం సాధించవచ్చని నిరూపించిన నవి పిళ్లై ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON