అప్పుడప్పుడు తాగితే ఏమవుతుందిలే అనుకుంటున్నారా? ఈ 28 ఏళ్ల యువకుడి కాలేయం చూస్తే?

అప్పుడప్పుడు మద్యం తాగడం వల్ల పెద్దగా నష్టం ఉండదని భావిస్తున్నారా? అయితే వడోదరకు చెందిన రేడియాలజిస్ట్ షేర్ చేసిన ఈ అల్ట్రాసౌండ్ నివేదిక మీ కళ్లు తెరిపిస్తుంది. కేవలం 28 ఏళ్లకే ఒక యువకుడి కాలేయం ఏ స్థాయిలో దెబ్బతిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Published on: Dec 31, 2025, 06:53:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మద్యం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ, "ఎప్పుడో ఒకసారి తాగితే ఏమవుతుంది? మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదే కదా!" అనే అపోహ చాలా మందిలో ఉంది. సోషల్ డ్రింకింగ్ లేదా అప్పుడప్పుడు తాగడం వల్ల ప్రాణాపాయం ఉండదని భావించే వారిని హెచ్చరిస్తూ గుజరాత్‌కు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

అప్పుడప్పుడు తాగితే ఏమవుతుందిలే అనుకుంటున్నారా? ఈ 28 ఏళ్ల యువకుడి కాలేయం చూస్తే? (Shutterstock)
అప్పుడప్పుడు తాగితే ఏమవుతుందిలే అనుకుంటున్నారా? ఈ 28 ఏళ్ల యువకుడి కాలేయం చూస్తే? (Shutterstock)

వడోదరకు చెందిన ప్రివెంటివ్ అండ్ డయాగ్నోస్టిక్ రేడియాలజిస్ట్ డాక్టర్ హర్ష్ వ్యాస్, ఒక 28 ఏళ్ల యువకుడి కాలేయానికి (Liver) సంబంధించిన అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌ను పంచుకున్నారు. ఆ నివేదిక చూసిన వైద్యులే విస్తుపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మృత్యువు అంచున 28 ఏళ్ల యువకుడు

డాక్టర్ వ్యాస్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక షాకింగ్ ఇమేజ్‌ను షేర్ చేస్తూ.. "ఇది కేవలం అప్పుడప్పుడు మాత్రమే మద్యం తాగుతానని చెప్పే ఒక 28 ఏళ్ల యువకుడి కాలేయం అల్ట్రాసౌండ్ చిత్రం. మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఎవరికైనా ఈ ఫొటో చూడగానే అర్థమవుతుంది.. ఇది లివర్ సిర్రోసిస్ (Liver Cirrhosis) అనే ప్రమాదకర స్థితికి చేరుకుందని. ఇది క్యాన్సర్‌కు ముందు వచ్చే దశ, దీనిని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాలేం" అని వివరించారు.

"నా కొడుకు కోలుకుంటాడు కదా డాక్టర్?"

ఆ యువకుడి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని డాక్టర్ వ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. "రోగి పొత్తికడుపులో విపరీతంగా నీరు (Ascites) చేరిపోయింది. దానివల్లే అతను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. అతని తల్లి నా దగ్గరకు వచ్చి.. 'డాక్టర్, నా కొడుకు కోలుకుంటాడు కదా? తనకేం కాదు కదా?' అని అడిగారు. కానీ పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయిందని నాకు, ఆ రోగికి తెలుసు. అది ముదిరిపోయిన దశ" అని ఆయన పేర్కొన్నారు.

లివర్ సిరోసిస్ వంటి పరిస్థితుల్లో వైద్యులకు కూడా పరిమితమైన అవకాశాలే ఉంటాయని ఆయన వివరించారు. ఇలాంటి స్థితిలో 'లివర్ ట్రాన్స్‌ప్లాంట్' (కాలేయ మార్పిడి) ఒక్కటే మార్గమని, కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

విషంతో ప్రయోగాలు వద్దు

మద్యం అలవాటు ఉన్నవారు లేదా తమ సన్నిహితుల్లో ఎవరైనా తాగుతుంటే వారికి ఈ సమాచారాన్ని చేరవేయాలని డాక్టర్ వ్యాస్ కోరారు. "మద్యం క్రమం తప్పకుండా తాగుతూ కూడా ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నామంటే, మీకు ఏమీ కాదని అర్థం కాదు. ఆ విషం ఇంకా మీ శరీరంపై ప్రభావం చూపడం మొదలుపెట్టలేదని మాత్రమే అర్థం. విషంతో ఎవరూ ప్రయోగాలు చేయకూడదు" అని ఆయన హెచ్చరించారు.

సమాజంలో ఉన్న "లిమిటెడ్ డ్రింకింగ్" అనే భ్రమను వీడి, ప్రాణాల మీదకు రాకముందే మేల్కోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More