ఒక వ్యక్తి వేసుకునే బట్టలు లేదా వాడే కారును చూసి వారి ఆర్థిక స్థోమతను అంచనా వేయడం సమాజంలో సాధారణంగా జరుగుతుంటుంది. అయితే బయటికి కనిపించే ఆడంబరాల కంటే భవిష్యత్తు కోసం చేసే పొదుపే అసలైన సంపద అని చాటిచెప్పే ఒక ఆసక్తికర సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
పాత సాంత్రో కారు.. సహోద్యోగుల హేళన

అభిషేక్ సింగ్ అనే యువకుడు తన 22 ఏళ్ల వయసులో 'హిటాచీ' (Hitachi) కంపెనీలో తొలి ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో తమ కార్యాలయంలో పనిచేసే మహిళా మేనేజర్ ప్రతిరోజూ 12 ఏళ్లకు పైగా పాతదైన బూడిద రంగు సాంత్రో కారులో ఆఫీసుకు వచ్చేవారు. ఆ కారు సస్పెన్షన్ సమస్య వల్ల స్టార్ట్ చేసినప్పుడు ఒక వింత శబ్దం వచ్చేది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ కారు శబ్దం వినబడగానే, "ఈ పాత కారును ఎప్పుడు పారేస్తుందో ఏంటో!" అంటూ ఆఫీసులోని ఉద్యోగులంతా నవ్వుకునేవారని, ఆమెను పిసినారిగా జమకట్టేవారని అభిషేక్ గుర్తుచేసుకున్నారు.
46 ఏళ్లకే రిటైర్మెంట్.. ఊహించని ట్విస్ట్
"కానీ అసలు జోక్ మాపైనే పడిందని కొన్నేళ్ల తర్వాత అర్థమైంది" అంటూ అభిషేక్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో రాసుకొచ్చారు. ఆ మేనేజర్ కేవలం 46 ఏళ్ల వయసులోనే ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించారని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆడంబరాల కోసం డబ్బు దండగ చేయకుండా, కుటుంబ భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, సరైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం వల్లే ఆమె అంత చిన్న వయసులోనే ఆర్థిక స్వాతంత్య్రం సాధించారని గ్రహించారు. "ఎవరైనా బయటికి ఏం చూపిస్తున్నారనే దానికంటే.. వారు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారనేదే ముఖ్యం. ఆ సంఘటన తర్వాత కారును చూసి మనుషులను అంచనా వేయడం మానేశాను" అని అభిషేక్ వెల్లడించారు.
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
అభిషేక్ పంచుకున్న ఈ అనుభవం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోస్టుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "నేను కూడా 16 ఏళ్లుగా ఒకే కారు వాడుతున్నాను, ప్రస్తుతం నా వయసు 50 ఏళ్లు" అని ఒకరు కామెంట్ చేయగా.. "కొంచెం మంచి కారు కొనుక్కుని 48 ఏళ్లకు రిటైర్ అయినా జీవితాన్ని ఆస్వాదించవచ్చు కదా" అని మరొకరు భిన్నంగా స్పందించారు. "జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అనడమే వారి పని" అనే ప్రముఖ హిందీ సామెతను మరికొందరు గుర్తుచేసుకున్నారు.
{{/usCountry}}అభిషేక్ పంచుకున్న ఈ అనుభవం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోస్టుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "నేను కూడా 16 ఏళ్లుగా ఒకే కారు వాడుతున్నాను, ప్రస్తుతం నా వయసు 50 ఏళ్లు" అని ఒకరు కామెంట్ చేయగా.. "కొంచెం మంచి కారు కొనుక్కుని 48 ఏళ్లకు రిటైర్ అయినా జీవితాన్ని ఆస్వాదించవచ్చు కదా" అని మరొకరు భిన్నంగా స్పందించారు. "జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అనడమే వారి పని" అనే ప్రముఖ హిందీ సామెతను మరికొందరు గుర్తుచేసుకున్నారు.
{{/usCountry}}