ఎన్‌పీఎస్ స్కీమ్‌ల్లో కొత్త వర్గీకరణ: మీ రిటైర్మెంట్ నిధిపై ప్రభావం
జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్‌ల వర్గీకరణలో పీఎఫ్‌ఆర్‌డీఏ కీలక మార్పులు చేసింది. ఈక్విటీ కేటాయింపుల (మార్కెట్ రిస్క్) ఆధారంగా పథకాలను ఐదు కేటగిరీలుగా విభజించింది. తాజా నిర్ణయంతో చందాదారులు రిస్క్, రాబడులను బేరీజు వేసుకుని తమకు సరిపోయే బెస్ట్ స్కీమ్‌ను సులభంగా ఎంచుకోవచ్చు.
రిటైర్మెంట్ కోసం జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే మీకు శుభవార్త. ఎన్‌పీఎస్ చందాదారులకు మరింత పారదర్శకతను అందించే లక్ష్యంతో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కీలక అడుగు వేసింది. పెట్టుబడి పథకాల వర్గీకరణ, నామకరణం, కేటాయింపుల విషయంలో ఒక ప్రామాణిక విధానాన్ని (Standardised framework) తీసుకొస్తూ ఆగస్టు 28న ఓ సర్క్యులర్ జారీ చేసింది.

తాజా మార్పులతో ఎన్‌పీఎస్ ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న అనేక స్కీమ్‌లను సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు, ఏ పెన్షన్ ఫండ్ ఎలాంటి రాబడులు ఇస్తుందో చందాదారులు స్పష్టంగా పోల్చి చూసుకోవచ్చు.
ఐదు విభాగాలుగా ఎన్‌పీఎస్ స్కీమ్‌లు
కొత్త నిబంధనల ప్రకారం ఎన్‌పీఎస్ స్కీమ్‌లను ప్రధానంగా ఐదు రకాలుగా వర్గీకరించారు.
లైఫ్‌సైకిల్ ఆధారిత స్కీమ్‌లు: చందాదారుడి వయసును బట్టి ఈక్విటీ (E), కార్పొరేట్ బాండ్లు (C), ప్రభుత్వ సెక్యూరిటీల్లో (G) పెట్టుబడులను ఇవి ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తాయి. ఇందులో అగ్రెసివ్, హై (75), మోడరేట్ (50), లో (25) అనే ఆప్షన్లు ఉంటాయి.
యాక్టివ్ ఛాయిస్: పీఎఫ్‌ఆర్‌డీఏ నిబంధనల పరిధిలో తమ పెట్టుబడిని ఎక్కడ, ఎంత శాతం కేటాయించాలన్నది నేరుగా చందాదారుడే నిర్ణయించుకోవచ్చు.
ఎన్‌పీఎస్ సంచయ్: అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకంలో ముందుగానే నిర్ణయించిన విధానంలో పెట్టుబడులు కొనసాగుతాయి.
మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎంఎస్‌ఎఫ్): తాజా విధానం ప్రకారం.. పాత, కొత్త ఎంఎస్‌ఎఫ్ స్కీమ్‌లన్నింటినీ వాటి ఈక్విటీ మార్కెట్ పెట్టుబడుల (Equity exposure) ఆధారంగా నిర్దిష్ట కేటగిరీలుగా విభజిస్తారు. సాధారణ స్కీమ్‌లకు, ఎంఎస్‌ఎఫ్ స్కీమ్‌లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పీఎఫ్‌ఆర్‌డీఏ రద్దు చేసింది.
4A స్కీమ్‌లు: ఎన్‌పీఎస్ వాత్సల్య, ఎన్‌పీఎస్ స్వాస్థ్య, ఎన్‌పీఎస్ ఎంఎస్‌ఎంఈ వంటి థీమాటిక్ పథకాలను రెగ్యులేషన్ 4A కిందకు తీసుకువచ్చారు.
ఎంఎస్‌ఎఫ్ కేటగిరీల విభజన ఇలా..
స్కీమ్‌లు ఈక్విటీ మార్కెట్లలో ఎంత శాతం పెట్టుబడి పెడుతున్నాయనే దాని ఆధారంగా ఎంఎస్‌ఎఫ్ స్కీమ్‌లను ఐదు రకాలుగా విభజించారు. దీంతో ఏ స్కీమ్‌లో ఎంత రిస్క్ ఉందన్నది పెట్టుబడిదారులకు స్పష్టంగా అర్థమవుతుంది.
కేటగిరీ A: 80% నుంచి 100% ఈక్విటీ (అగ్రెసివ్ గ్రోత్, అత్యధిక రిస్క్)
కేటగిరీ B: 60% నుంచి 80% ఈక్విటీ (హై గ్రోత్, అధిక రిస్క్)
కేటగిరీ C: 35% నుంచి 60% ఈక్విటీ (బ్యాలెన్స్‌డ్ గ్రోత్, ఓ మోస్తరు రిస్క్)
కేటగిరీ D: 10% నుంచి 35% ఈక్విటీ (కన్జర్వేటివ్)
కేటగిరీ E: 0% నుంచి 10% ఈక్విటీ (డెట్-ఓరియెంటెడ్ / అత్యల్ప రిస్క్)
పాత స్కీమ్‌లలో రాబోయే మార్పులివే..
ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ ఈక్విటీ కేటగిరీల్లో ఉన్న ఎంఎస్‌ఎఫ్ స్కీమ్‌లను కచ్చితంగా ఏదో ఒక సింగిల్ కేటగిరీలోకి మార్చాలి లేదా పునర్నిర్మించాలి. పెన్షన్ ఫండ్స్ అన్నీ 30 రోజుల్లోగా తమ ఎంఎస్‌ఎఫ్ స్కీమ్‌ల పేర్లను కొత్త ఫార్మాట్ (పెన్షన్ ఫండ్ పేరు + ఎన్‌పీఎస్ + కేటగిరీ కోడ్ + స్కీమ్ పేరు) ప్రకారం మార్చాల్సిందే. టైర్-2 స్కీమ్‌ల పేర్ల చివర తప్పనిసరిగా 'Tier 2' అని ఉండాలి.
ఒకవేళ ఏదైనా కేటగిరీలో రెండు కంటే ఎక్కువ స్కీమ్‌లు ఉంటే, వాటిని 45 రోజుల్లోగా విలీనం చేయాలి లేదా పునర్నిర్మించాలి. ఈ విషయాన్ని చందాదారులకు ముందస్తుగా తెలియజేయాలి. ఒకవేళ ఏదైనా ఎంఎస్‌ఎఫ్ స్కీమ్ మూసివేస్తే, వేరొక స్కీమ్‌కు మారే ఆప్షన్ ఇస్తారు. చందాదారుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, ఆ పెట్టుబడిని ఆటోమేటిక్‌గా టైర్-1 కింద ఉన్న లైఫ్‌సైకిల్ 50 (మోడరేట్) స్కీమ్‌లోకి మారుస్తారు.
ఆన్‌లైన్‌లో సులభంగా పోలిక
కొత్త విధానం అమలులోకి వస్తే సీఆర్‌ఏ ప్లాట్‌ఫామ్‌లలో (CRA platforms) స్కీమ్‌ల ఎంపిక విధానం పూర్తిగా మారుతుంది. చందాదారులు ముందుగా స్కీమ్ రకాన్ని, ఆ తర్వాత కేటగిరీని, చివరగా పెన్షన్ ఫండ్‌ను ఎంచుకునేలా ఆప్షన్లు ఇస్తారు. ఒకే కేటగిరీకి చెందిన వేర్వేరు పెన్షన్ ఫండ్స్‌ను.. వాటి లాంచ్ తేదీ, పాత రాబడులు, రిస్క్-ఓ-మీటర్, ఏయూఎం (AUM) వంటి వివరాలతో బేరీజు వేసుకొని అత్యుత్తమ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు.
ఖాతా మార్పు.. విలీన నిబంధనలు
ఒక ప్రాణ్ (PRAN) ఖాతా కింద ఒకేసారి కేవలం ఒక లైఫ్‌సైకిల్ లేదా యాక్టివ్ ఛాయిస్ స్కీమ్‌ను మాత్రమే కలిగి ఉండాలి. కానీ, ఎంఎస్‌ఎఫ్ స్కీమ్‌లను మాత్రం ఎన్నింటినైనా ఒకేసారి ఎంచుకోవచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రెండుసార్లు ఫండ్ లేదా స్కీమ్ మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఒక స్కీమ్ నుంచి మరొక స్కీమ్‌కు మారితే (Switching) పాత వెస్టింగ్ పీరియడ్, ఖాతా నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. కానీ, రెండు స్కీమ్‌లను విలీనం (Merging) చేస్తే మాత్రం, టార్గెట్ స్కీమ్ (ఏ స్కీమ్‌లో అయితే కలుపుతున్నారో) నిబంధనలు, విత్‌డ్రాయల్ లిమిట్స్ వర్తిస్తాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


