...
...
Next Story

Raw onions : వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పచ్చి ఉల్లిపాయ తినాలా? నిజాలు ఇవే..

తరతరాలుగా భారతీయ గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో వేసవి కాలంలో ప్రతి భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయ ముక్కలను నంజుకు తినడం ఒక అలవాటుగా వస్తోంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఉల్లిపాయను వెంట ఉంచుకుంటే వడదెబ్బ తగలదని పెద్దలు చెబుతుంటారు. దీనికి సంబంధించి న్యూట్రిషన్ నిపుణులు, వైద్యులు చెబుతున్న ఆసక్తికర విషయాలు ఇవీ

Published on: May 31, 2026 09:59 AM IST
Advertisement

raw onions health benefits : భారతదేశంలో ఎండలు, వడగాల్పులు తీవ్రంగా ఉన్న వేళ.. శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ప్రజలు మళ్లీ పాతకాలపు సాంప్రదాయ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఆమ్ పన్నా, మజ్జిగ, సబ్జా గింజలతో పాటు ఈ జాబితాలో ‘ఉల్లిపాయ’ ప్రధానంగా కనిపిస్తోది. వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తింటే వడదెబ్బ తగలదని కొందరు బలంగా నమ్మితే, మరికొందరు మాత్రం దీనివల్ల అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయని దూరంగా ఉంటారు. అసలు తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు పచ్చి ఉల్లిపాయలు తినొచ్చా? తినకూడదా? తింటే ఏం జరుగుతుంది? అనే విషయాలపై నిపుణులు చెబుతున్న శాస్త్రీయ నిజాలు ఇక్కడ చూద్దాము..

డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం..

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఉల్లిపాయ తినాలా?
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఉల్లిపాయ తినాలా?

కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా ప్రకారం, ఉల్లిపాయలు వేసవిలో శరీరానికి మేలు చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి:

అధిక నీటి శాతం: పచ్చి ఉల్లిపాయలలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండల వల్ల శరీరం చెమట రూపంలో నిరంతరం నీటిని కోల్పోతుంది. కాబట్టి, ఉల్లిపాయలు తినడం వల్ల శరీరానికి అవసరమైన హైడ్రేషన్ లభిస్తుంది.

ఆయుర్వేద కోణం, పోషకాలు: సాంప్రదాయ వైద్యం ప్రకారం ఉల్లిపాయ శరీరానికి చలవ చేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన ‘క్వెర్సిటిన్’, జీర్ణక్రియకు మేలు చేసే ప్రిబయోటిక్స్, విటమిన్లు ఉంటాయి.

రాజస్థాన్ వింత సాంప్రదాయం: ఎండలు తీవ్రంగా ఉండే రాజస్థాన్‌లో ఒక వింత సాంప్రదాయం ఉంది. అక్కడ వడదెబ్బ తగలకుండా, శరీరాన్ని చల్లబరచడానికి ఉల్లిపాయ పేస్ట్‌ను గుండె భాగంలో (ఛాతిపై), చెవుల వెనుక రుద్దుకుంటారు. అయితే, ఉల్లిపాయలు వడదెబ్బకు పూర్తి విరుగుడు కాదని, అవి కేవలం శరీరానికి అవసరమైన పోషకాలను అందించి కొంతవరకు సహకరిస్తాయని రూపాలి దత్తా స్పష్టం చేశారు.

పచ్చి ఉల్లిపాయలు ఎక్కువ తింటే ఏమవుతుంది?

పచ్చి ఉల్లిపాయలు అందరి శరీరతత్వానికి పడవు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇవి సమస్యలను తెచ్చిపెడతాయి. మెడికవర్ హాస్పిటల్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉల్లిపాయలను అమితంగా తినడం వల్ల కింది ఇబ్బందులు రావచ్చు:

అసిడిటీ, గుండెల్లో మంట : ఎవరైతే ఇప్పటికే అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడుతున్నారో, వారు పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే గుండెల్లో మంట, పుల్లటి తేన్పులు ఎక్కువవుతాయి. దీనికి తోడు నోటి దుర్వాసన కూడా వస్తుంది.

ఎండ వేడిలో అదనపు ఒత్తిడి: వేసవి ఉష్ణోగ్రతల వల్ల శరీరం ఇప్పటికే అలసిపోయి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఉల్లిపాయల వల్ల కడుపులో అశాంతి, వికారం, లేదా అసిడిటీ తలెత్తితే అది వడదెబ్బ కంటే ఎక్కువ నీరసాన్ని కలిగిస్తుంది.

ఎండల్లో పచ్చి ఉల్లిపాయ తినాలా? వద్దా?

పచ్చి ఉల్లిపాయలు నేరుగా వడదెబ్బను కలిగిస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి, మీకు ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకపోతే.. వేసవిలో పరిమిత పరిమాణంలో పచ్చి ఉల్లిపాయలను హ్యాపీగా తినవచ్చు. కానీ, మీకు అసిడిటీ లేదా గ్యాస్ సమస్యలు ఉంటే మాత్రం వీటిని కాస్త తగ్గించుకోవడం లేదా వండుకుని తినడం మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా, వడదెబ్బ నుంచి బ్రతకడానికి కేవలం ఉల్లిపాయలపైనే ఆధారపడకుండా ఓఆర్‌ఎస్, కొబ్బరినీళ్లు, మజ్జిగ, మంచి నీళ్లను పుష్కలంగా తాగడం మరువకండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON