డయాబెటిస్: శరీరంలో ఈ మార్పులే ప్రమాదానికి సంకేతమా? విజయవాడ డాక్టర్ హెచ్చరిక
మధుమేహం ముంచుకొచ్చే ముందు శరీరం కొన్ని 'సైలెంట్' సంకేతాలను ఇస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని, ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నిపుణులు డాక్టర్ భాను ప్రవీణ్ నాయుడు హెచ్చరిస్తున్నారు.
చాలా మందికి తమకు మధుమేహం (Diabetes) ఉందనే విషయం వ్యాధి ముదిరే వరకు తెలియదు. ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అందుకే వైద్యులు డయాబెటిస్‌ను ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తుంటారు. శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు మన శరీరం ఇచ్చే ఆ చిన్న చిన్న సంకేతాలను గుర్తించకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ భాను ప్రవీణ్ నాయుడు, మధుమేహం ఎందుకు ఆలస్యంగా బయటపడుతుంది? మనం గమనించాల్సిన ఆ ముందస్తు హెచ్చరికలు ఏంటి? అనే విషయాలపై కీలక విశ్లేషణ చేశారు.
ప్రీ-డయాబెటిస్: ఆరేళ్ల ముందే మొదలయ్యే ముప్పు
"ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మధుమేహం కేసుల్లో 90 శాతం కంటే ఎక్కువ టైప్-2 డయాబెటిస్ (T2DM) రకానికి చెందినవే. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు. రక్తంలో చక్కెర స్థాయిలు స్వల్పంగా పెరిగే 'ప్రీ-డయాబెటిస్' దశతో ఇది మొదలవుతుంది. ఈ దశలో పెద్దగా లక్షణాలు కనిపించవు, అందుకే చాలామంది దీనిని గుర్తించలేరు" అని డాక్టర్ భాను వివరించారు.
మెటబాలిక్ మార్పులు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యల వల్ల శరీరం గ్లూకోజ్, కొవ్వును సరిగ్గా నియంత్రించలేదని, ఈ పరిస్థితి సాధారణ రక్త పరీక్షల్లో బయటపడటానికి దాదాపు ఆరేళ్ల సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.
నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు
మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. అందుకే వీటిని పని ఒత్తిడి వల్ల వచ్చే అలసటగా పొరబడుతుంటారు.
- అసాధారణమైన అలసట
- అప్పుడప్పుడు విపరీతమైన దాహం వేయడం
- తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం
- చర్మంపై తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం (ముఖ్యంగా థ్రష్ వంటివి)
"ఈ సంకేతాలను చాలామంది లైఫ్ స్టైల్ సమస్యలుగా భావించి వదిలేస్తుంటారు. కానీ ఇవే మెటబాలిక్ డిజార్డర్‌కు మొదటి హెచ్చరికలు" అని డాక్టర్ నాయుడు హెచ్చరించారు.
భారతదేశంలో ఆలస్యంగా ఎందుకు గుర్తిస్తున్నారు?
మన దేశంలో మధుమేహం ముదిరిన తర్వాతే బయటపడటానికి ప్రధానంగా అవగాహన లోపం, ఆరోగ్య పరీక్షల పట్ల నిర్లక్ష్యం కారణమని డాక్టర్ భాను అభిప్రాయపడ్డారు.
"భారతదేశంలో వైద్య సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులో లేకపోవడం, క్రమం తప్పకుండా చెకప్ చేయించుకునే అలవాటు లేకపోవడం వల్ల వ్యాధిని ప్రాథమిక దశలో పట్టుకోలేకపోతున్నాం. గ్లూకోజ్ స్థాయిలు బాగా పెరిగినప్పుడు.. అకస్మాత్తుగా బరువు తగ్గడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం వంటి స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో అయితే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ లేదా కంటి చూపు దెబ్బతిన్న తర్వాతే తమకు డయాబెటిస్ ఉందన్న చేదు నిజం తెలుస్తోంది" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముందస్తు గుర్తింపుతోనే రక్షణ
ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఇది ప్రమాదకరమైన పరిణామమని వైద్యులు చెబుతున్నారు.
"జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారం, వ్యాయామం ద్వారా టైప్-2 డయాబెటిస్‌ను అడ్డుకోవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే ప్రాణాంతక సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఈ 'సైలెంట్ మహమ్మారి'పై పోరాటంలో అప్రమత్తతే మనకున్న అతిపెద్ద ఆయుధం" అని డాక్టర్ భాను ప్రవీణ్ నాయుడు స్పష్టం చేశారు.
(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా నిపుణులైన వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.)
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


