ఓవైపు గ్యాస్ ఆందోళన జనాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏం వండాలి అనేది చాలా మంది మహిళలు ఆలోచించి.. ఆలోచించి.. అదో పెద్ద టాస్క్ అయిపోతుంది. సాంబార్, రసంలాంటివి తయారు చేసి రోజూ ఏం తింటారు. భోజనాన్ని త్వరగా ముగించాలనుకునే వారు ఈ టొమాటో పులావ్‌ను ప్రయత్నించవచ్చు. ఈ టొమాటో పులావ్ తయారు చేయడం చాలా సులభం, చాలా రుచికరంగా కూడా ఉంటుంది.

ఈ టమాటా పులావ్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. దీని రుచి అచ్చం బిర్యానీలాగే ఉంటుంది. మీ ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడతారు. బిర్యానీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే ఈ పులావ్‌ను తప్పకుండా ప్రయత్నించాలి. బిర్యానీ ఫ్లేవర్‌లో టొమాటో పులావ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు : బియ్యం - 1 కప్పు, టమాటాలు - 3 (తరిగినవి), నీళ్ళు - 1.5 కప్పు, చిన్న ఉల్లిపాయలు - 10 (తరిగినవి), వెల్లుల్లి - 5 రెబ్బలు, జీడిపప్పు - 5 (సన్నగా తరిగినవి), కారం - 1 చెంచా, పచ్చిమిర్చి - 2 (తరిగినవి), ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - 1 చెంచా, నూనె - 2 చెంచాలు, దాల్చినచెక్క - 1 అంగుళం, లవంగాలు - 5, బిర్యానీ ఆకులు - 2, స్టార్ పువ్వు - 2, యాలకులు - 5, అల్లం - 1 అంగుళం పరిమాణం, తరిగిన కొత్తిమీర - 2 చెంచాలు.
టొమాటో పులావ్ ఎలా చేయాలి?
- కొత్తిమీర ఆకులు, అల్లంను నీళ్లతో కలిపి 2 టేబుల్ స్పూన్ల పేస్ట్‌లా రుబ్బుకోండి. దానిని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా, జీడిపప్పును కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్‌లా రుబ్బి పక్కన పెట్టుకోండి.
- బియ్యాన్ని కడిగి అరగంట పాటు విడిగా నానబెట్టండి.
- గ్యాస్ మీద ఒక బాణలిలో నూనె వేడి చేసి, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వులు వేయండి. మసాలాలన్నీ వేసిన తర్వాత, తరిగిన ఉల్లిపాయ, తరిగిన వెల్లుల్లి వేయండి. ఉల్లిపాయ రంగు మారే వరకు వేయించండి.
- తరువాత తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం-కొత్తిమీర ఆకు పేస్ట్ కలపండి. ఒక నిమిషం పాటు వేయించి, ఆ తర్వాత రుబ్బిన జీడిపప్పు గుజ్జును వేసి బాగా కలపండి.
- అనంతరం దానికి కారం పొడి, తురిమిన టమాటా పేస్ట్ కలపండి. అన్నింటినీ బాగా కలిపి, అవసరమైనంత ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించండి. అది పూర్తిగా పొడిబారే వరకు వేయించండి.
- ఇప్పుడు నానబెట్టిన బియ్యం, అవసరమైనంత నీరు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం మొత్తాన్ని ప్రెషర్ కుక్కర్‌లోకి మార్చి, ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించండి.
- పొయ్యి మీద నుండి దించిన తర్వాత, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, కొత్తిమీర ఆకులు పైన చల్లితే.. రుచికరమైన టొమాటో పులావ్ రెడీ.