హైదరాబాదీ బిర్యానీ బిల్లుతో మొదలై.. ఏకంగా రూ.70 వేల కోట్ల స్కామ్ బట్టబయలు
హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో చేసిన సాధారణ తనిఖీ.. ఏకంగా రూ.70 వేల కోట్ల స్కామ్‌ను బయటపెట్టింది. ఈ విషయం తెలిసి అధికారులు సైతం షాక్ అయ్యారు.
హైదరాబాద్ అనగానే మెుదటగా గుర్తొచ్చేది బిర్యానీ. ఈ బిర్యానీకి సంబంధించిన బిల్లు దేశంలో రూ.70 వేల కోట్ల స్కామ్‌ను బయపెట్టింది. దేశంలో రెస్టారెంట్లు ఎలా పన్ను ఎగవేస్తున్నాయో బయటకు వచ్చింది. పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారో చూద్దాం..

రూ.70 వేల కోట్ల పన్ను ఎగవేత
హైదరాబాద్‌లోని బిర్యానీ రెస్టారెంట్లపై ఒక సాధారణ తనిఖీ జరిగింది. ఈ చెకింగ్ భారతదేశం అంతటా ఉన్న రెస్టారెంట్లలో దాగి ఉన్న భారీ పన్ను ఎగవేత కుంభకోణాన్ని బయటపెట్టింది. చాలా రెస్టారెంట్లు డబ్బు సంపాదిస్తున్నాయని, కానీ చాలా తక్కువ సంపాదిస్తున్నట్లు చూపిస్తున్నాయని అధికారులు గుర్తించారు. తద్వారా పన్నులు చెల్లించకుండా ఉంటున్నారు. దీని వల్ల గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు రూ.70,000 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
బిల్లింగ్ సిస్టమ్ స్కామ్
రెస్టారెంట్లు బిల్లులు చేయడానికి ఒక పెద్ద కంప్యూటర్ ఉంటుందనే విషయం తెలిసిందే. అందులో నొక్కగానే బిల్లు వచ్చేస్తుంది. అది కాస్త కస్టమర్‌కు ఇస్తారు. కస్టమర్ బిల్లు చూసుకుని పే చేసి వెళ్లిపోతాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. కానీ ఈ వ్యవస్థను అధ్యయనం చేయడం ద్వారా పెద్ద స్కామ్ బయటకు వచ్చింది.
లక్షకుపైగా రెస్టారెంట్లు
దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఈ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. కంప్యూటర్ సాధనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి అధికారులు సుమారు 1.77 లక్షల రెస్టారెంట్ల నుండి బిల్లింగ్ రికార్డులను తనిఖీ చేశారు. దాదాపు 60 టెరాబైట్ల డేటాను పరిశీలించారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. కస్టమర్లు చెల్లించిన తర్వాత అనేక బిల్లులు కంప్యూటర్‌లోనే తొలగిపోతాయి, లేదంటే మార్పులు జరుగుతాయి. అంటే మెుత్తానికి బిల్లు ఉండదు, లేదంటే ఎక్కువ బిల్లు అయిన తక్కువగా చూపిస్తుంది. ఇదంతా కస్టమర్ బిల్లు చెల్లించి వెళ్లిపోయాక జరుగుతుందన్నమాట.
ఏపీ, తెలంగాణలోనూ భారీగానే
భారతదేశం అంతటా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే రెస్టారెంట్లు రూ.13,000 కోట్లకు పైగా విలువైన బిల్లులను తొలగించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే.. ఇలా కనిపించకుండా చేసిన బిల్లులు రూ.5,100 కోట్లకు పైగా జరిగాయి. రెండుసార్లు తనిఖీ చేయడానికి అధికారులు 40 రెస్టారెంట్‌లను స్వయంగా సందర్శించారు. నిజమైన అమ్మకాలను కంప్యూటర్ రికార్డులతో పోల్చారు. ఈ చిన్న తనిఖీ కూడా దాదాపు రూ.400 కోట్ల అమ్మకాలను మిస్ అయ్యాయని గుర్తించింది. మెుత్తానికి రూ.70 వేల కోట్ల వరకు స్కామ్ జరిగింది.
కర్ణాటక టాప్
కొన్ని రాష్ట్రాల కోట్ల రూపాయలు ఇలా కనిపించకుండా ఉన్నాయి. ఈ లిస్టులో కర్ణాటక ముందు వరుసలో ఉంది. అత్యధిక ఎగవేత కనిపించింది. తరువాత తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా కొన్ని రెస్టారెంట్లు బిల్లులను తొలగించడానికి కూడా ప్రయత్నించలేదు. వాస్తవానికి సంపాదించిన దానికంటే తక్కువ డబ్బు సంపాదించామని పన్ను శాఖకు చెప్పారు.
బిల్లులను తొలగించేస్తున్నారు
ఇప్పటివరకు అధ్యయనం చేసిన డేటా ప్రకారం.. అన్ని రెస్టారెంట్ అమ్మకాలలో నాలుగో వంతు దాచిపెట్టారని అధికారులు విశ్వసించారు. రెస్టారెంట్లు సాధారణంగా అన్ని చెల్లింపులు, నగదు, కార్డులు, యూపీఐలను బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తాయి. తద్వారా సిబ్బంది డబ్బును దొంగిలించలేరు. కానీ యజమానులు స్వయంగా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అధికారులు కనుగొన్నారు.
నగదును ట్రాక్ చేయడం కష్టం కాబట్టి.. నగదు బిల్లులను మాత్రమే తొలగించడం కొన్ని రెస్టారెంట్లు చేస్తున్నాయి. మరికొందరు కొన్ని రోజులు లేదా ఒక నెల మొత్తం బిల్లులన్నింటినీ తీసేస్తున్నారు. ఆ తర్వాత చాలా తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ తక్కువ పన్ను కడుతున్నారు.
దేశవ్యాప్తంగా పెద్ద స్కామ్
ఈ డేటా ఆరు సంవత్సరాలలో దాదాపు రూ.2.43 లక్షల కోట్ల రెస్టారెంట్ అమ్మకాలను కవర్ చేసింది. ప్రతిదీ విశ్లేషించడానికి, అధికారులు డిజిటల్ ల్యాబ్‌ల నుండి ఏఐ సాధనాలను ఉపయోగించి పనిచేశారు. ఇవి రెస్టారెంట్ రికార్డులను జీఎస్టీ నంబర్లు, పబ్లిక్ లిస్టింగ్‌ల వంటి ఆన్‌లైన్ సమాచారంతో సరిపోల్చాయి. మొదట హైదరాబాద్, విశాఖపట్నం, సమీప పట్టణాలలో దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కుంభకోణం ఎంత పెద్దదో అధికారులు గ్రహించిన తర్వాత, దర్యాప్తును దేశవ్యాప్తంగా విస్తరించారు.
అనేక ఇతర బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు ఉన్నాయి. అవి కూడా ఇలాంటి సీక్రెట్స్‌ను దాచిపెడుతూ ఉండవచ్చంటున్నారు. తనిఖీలు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


