Air pollution : వాయు కాలుష్యంతో గుండె ఆగిపోతుందా? ఊపిరితిత్తులకే కాదు.. హృదయానికీ ప్రమాదమే!
పెరుగుతున్న వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులనే కాకుండా గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీఎం2.5 రేణువులు రక్తనాళాల్లో వాపును పెంచి గుండెపోటుకు దారితీసే అవకాశం ఉందంటున్నారు. నిపుణుల సలహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
పెరుగుతున్న వాయు కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా కాలుష్యం అనగానే ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఆయాసం మాత్రమే గుర్తుకొస్తాయి. అయితే, విషపూరిత గాలి ఊపిరితిత్తులనే కాకుండా నేరుగా గుండెను పిండేస్తుందని, ఉన్నట్టుండి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ దిల్లీ నుంచి మొదలుకొని హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పడిపోతోంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం గుండె వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుందో దిల్లీ సి.కె. బిర్లా హాస్పిటల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ అంశుల్ కుమార్ జైన్ వివరించారు.
రక్తనాళాల్లో అలజడి..
"మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలిలోని అతి సూక్ష్మమైన పీఎం2.5 రేణువులు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరుకుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి నేరుగా రక్తప్రవాహంలోకి కలిసిపోతాయి," అని డాక్టర్ జైన్ తెలిపారు.
ఈ సూక్ష్మ రేణువులు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, తీవ్రమైన మంటను కలిగిస్తాయి. దీనివల్ల రక్తనాళాల లోపలి పొర (ఎండోథెలియం) దెబ్బతింటుంది. రక్తప్రవాహాన్ని క్రమబద్ధీకరించడంలో, రక్తనాళాల స్థితిస్థాపకతను కాపాడటంలో ఎండోథెలియం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది దెబ్బతిన్నప్పుడు రక్తనాళాలు ముడుచుకుపోయి, రక్తం సజావుగా ప్రసరించడం కష్టమవుతుంది.
గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఎలా ఏర్పడతాయి?
వాయు కాలుష్యం మానసిక ఒత్తిడిని నియంత్రించే నరాల వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. "దీనివల్ల రక్తపోటు (బీపీ), గుండె స్పందనల వేగం పెరుగుతాయి. ఫలితంగా గుండెపై తీవ్రమైన భారం పడుతుంది," అని ఆయన పేర్కొన్నారు.
అప్పటికే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయిన వారికి కాలుష్యం వల్ల ఆ కొవ్వు పొరలు పగిలిపోయే ప్రమాదం ఉంది. కొవ్వు పొరలు పగిలినప్పుడు ఆ ప్రాంతంలో రక్తం గడ్డకడుతుంది. ఈ రక్తం గడ్డలు గుండెకు వెళ్లే రక్తప్రసరణను పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటాయి. ఇదే అకస్మాత్తుగా గుండెపోటుకు దారితీస్తుంది. దీనికితోడు కాలుష్య రేణువుల ప్రభావంతో రక్తం త్వరగా గడ్డకట్టే స్వభావం కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఎవరికి ముప్పు ఎక్కువ? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
వయోవృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహం, హై కొలెస్ట్రాల్, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ. అయితే, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ఆరోగ్యవంతులు కూడా కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు గుండె సంబంధిత తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పితో పాటు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడం, అకస్మాత్తుగా చల్లని చెమటలు పట్టడం, కళ్లు తిరగడం, నొప్పి ఎడమ చేయి, దవడ లేదా వీపు భాగానికి పాకడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. ఇవి గుండెపోటు సంకేతాలు కావచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి.
గుండెను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉండే వేళల్లో (ముఖ్యంగా ఉదయాన్నే) బయట తీవ్రమైన వ్యాయామాలు లేదా వాకింగ్ చేయడం తగ్గించాలి.
- బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సరిపోయే ఎన్95 మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
- ఇంట్లో గాలి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- గుండెజబ్బుల ముప్పు ఉన్నవారు క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేయించుకుంటూ వైద్యుల సలహాలు పాటించడం శ్రేయస్కరం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


