30, 40 ఏళ్ల వయసువారిలో గుండెపోటు లక్షణాలు: ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?
30, 40 ఏళ్ల వయసు ఉన్నవారు గుండె సంబంధిత ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆ నిర్లక్ష్యం ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో బెంగళూరులోని ఫోర్టిస్ హాస్పిటల్ (యశ్వంతపూర్) అడిషనల్ డైరెక్టర్ - కార్డియాలజీ డాక్టర్ ప్రసాద్ ఎం భట్ సవివరంగా విశ్లేషించారు.
ఒకప్పుడు గుండె సమస్యలంటే 60, 70 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారాయి. 30, 40 ఏళ్ల వయసు ఉన్న యువత కూడా గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.

మన జీవనశైలిలో వచ్చిన తీవ్రమైన మార్పులే దీనికి ప్రధాన కారణం. పనివేళలు పెరిగిపోవడం, శారీరక శ్రమ బొత్తిగా లేకపోవడం, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వీటితో పాటు అధిక రక్తపోటు (High BP), అధిక కొలెస్ట్రాల్, మధుమేహం (Diabetes) వంటి సమస్యలు చిన్న వయసులోనే గుండెజబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి.
నాకింకా వయసుందిలే అనే ప్రమాదకర భావన
శరీరంలో గుండెజబ్బు లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, యువత వాటిని గుండె సమస్యగా గుర్తించకపోవడం మరొక పెద్ద సవాలుగా మారింది. "నాకింకా చిన్న వయసే కదా, నాకేం గుండె సమస్యలు వస్తాయి?" అనే అపోహలోనే చాలామంది కాలం గడిపేస్తున్నారు. ఈ ఆలోచనే లక్షణాలను నిర్లక్ష్యం చేయడానికి, ఉచిత సలహాలతో కాలయాపన చేసి వైద్యుడి వద్దకు వెళ్లడంలో తీవ్ర జాప్యానికి దారితీస్తోంది.
సాధారణ లక్షణాలను తేలిగ్గా తీసిపారేయకండి
ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి గుండె సమస్యలకు ప్రధాన హెచ్చరిక సంకేతం. అయితే, ఇది ఒక్కటే లక్షణం కాదు.
- ఆయాసం రావడం
- తీవ్రమైన లేదా అకస్మాత్తుగా వచ్చే అలసట
- విపరీతంగా చెమటలు పట్టడం
- చేతులు, భుజాలు, మెడ, దవడ లేదా వీపు భాగంలో నొప్పి లేదా అసౌకర్యం
ఉద్యోగాలు చేసేవారు ఈ లక్షణాలు కనిపించినప్పుడు రోజంతా పడ్డ కష్టం వల్లో లేదా శారీరక అలసట వల్లో ఇలా జరుగుతోందని భావిస్తుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని సరిపెట్టుకుంటారు. కానీ, ముఖ్యంగా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు వచ్చే కొత్త లేదా విచిత్రమైన లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
చిన్న వయసు ఉన్నంత మాత్రాన భరోసా లేదు
వయసు చిన్నగా ఉన్నంత మాత్రాన గుండె ఆరోగ్యంగా ఉంటుందనే హామీ ఏమీ లేదు. జీవనశైలి సరిగ్గా లేకపోతే ఏ వయసు వారికైనా గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. చాలా సందర్భాల్లో అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎలాంటి ముందస్తు లక్షణాలు చూపించకుండానే శరీరాన్ని లోలోపలే దెబ్బతీస్తాయి. అందుకే క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా ఇటువంటి సమస్యలను ప్రారంభంలోనే గుర్తించవచ్చు.
అలసట, అసిడిటీ అని పొరపడకండి
30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారిపై ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ భారాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో సొంత ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గిపోతుంది. లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పుడు తమంతట తామే తగ్గిపోతాయని వేచి చూస్తారు. కొందరు అసిడిటీ లేదా సాధారణ అలసట అనుకుని అప్పటికప్పుడు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ, పెద్ద గుండె సమస్యలు కూడా మొదట్లో స్వల్ప లక్షణాలతోనే ప్రారంభమవుతాయని గుర్తుంచుకోవాలి. వ్యాధి తీవ్రమయ్యే వరకు వేచి చూడటం వల్ల చికిత్స ఆలస్యమై ప్రాణాలకే ప్రమాదం రావచ్చు.
ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష
లక్షణాలు తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా ముందస్తుగా జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం. 30, 40 ఏళ్ల వయసు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె సమస్యలను ఆరంభంలోనే పసిగట్టవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, తగినంత నిద్రపోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి
వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా రోజువారీ పనులు చేస్తున్నప్పుడు శరీరంలో ఏ చిన్న మార్పు అనిపించినా వయసును సాకుగా చూపి వదిలేయకండి. హెచ్చరిక సంకేతాలను గుర్తించి, ప్రమాద తీవ్రతను అర్థం చేసుకుని సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం కలగకుండా చూసుకోవచ్చు.
వ్యాసకర్త:
డాక్టర్ ప్రసాద్ ఎం భట్
అడిషనల్ డైరెక్టర్ - కార్డియాలజీ,
ఫోర్టిస్ హాస్పిటల్, యశ్వంతపూర్, బెంగళూరు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


