యువతలో పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పు: ముందస్తు సంకేతాలు, నివారణ మార్గాలు ఇవే
గుండె సమస్యలు కేవలం 50 ఏళ్లు దాటిన వారికే వస్తాయనుకోవడం పొరపాటని, యవ్వనంలోనే ధమనుల్లో మార్పులు మొదలవుతాయని రోబోటిక్ కార్డియాక్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్ జీటీ స్పష్టం చేస్తున్నారు. గుండె ఆరోగ్యంపై యువత అవగాహన పెంచుకోవాల్సిన లక్షణాలు, స్క్రీనింగ్ పరీక్షలు, నివారణ మార్గాలపై ఆయన అందించిన కథనం.
చాలామంది యువతకు గుండె ఆరోగ్యం అనేది వయసు పైబడిన తర్వాత ఆలోచించాల్సిన అంశంగానే కనిపిస్తుంది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఫిట్‌నెస్, ఆర్థిక లక్ష్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేనప్పుడు క్రమబద్ధమైన గుండె పరీక్షలు చేయించుకోవడం అనవసరమని భావిస్తుంటారు.

అయితే, గుండె ఆరోగ్యం అనేది 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఒక్కసారిగా ప్రాధాన్యం సంతరించుకునేది కాదు. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును పెంచే శారీరక మార్పులు చిన్న వయసులోనే ప్రారంభమవుతాయి. ధమనుల్లో మార్పులు యవ్వనంలోనే మొదలవుతాయని పరిశోధనలు సైతం స్పష్టం చేస్తున్నాయి. అందుకే తీవ్రమైన సమస్య తలెత్తక ముందే గుండె ఆరోగ్యంపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి.
హెచ్చరిక సంకేతాలను గుర్తిద్దాం
గుండె సంరక్షణలో తొలి అడుగు ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడమే. ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం అనేది ప్రధానమైన లక్షణమే అయినప్పటికీ, గుండె సమస్యలు అందరిలోనూ ఒకేలా కనిపించవు.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (ఆయాసం)
- అసహజమైన అలసట
- ఉన్నట్టుండి విపరీతంగా చెమటలు పట్టడం
- తలతిరగడం, కడుపులో తిప్పడం (వాంతులు వచ్చినట్లు ఉండటం)
- నొప్పి లేదా అసౌకర్యం భుజాలు, మెడ, దవడ, వీపు లేదా చేతులకు వ్యాపించడం
యువతలో ఈ లక్షణాలు కనిపిస్తే తరచుగా వర్క్ స్ట్రెస్, ఎసిడిటీ, నిద్రలేమి లేదా రోజంతా పడిన అలసటగా భావించి పొరపడుతుంటారు. దీనివల్ల వైద్యులను సంప్రదించడంలో ఆలస్యమై ప్రమాదం కొనితెచ్చుకుంటారు. వయసు చిన్నదే కదా అని కొత్తగా కనిపిస్తున్న లేదా తరచూ పునరావృతమయ్యే లక్షణాలను తేలిగ్గా తీసిపారేయకూడదు.
స్క్రీనింగ్ ప్రాధాన్యం.. హెల్త్ నంబర్లు తెలుసుకోండి
లక్షణాలు బయటపడే వరకు వేచి చూడకుండా ముందస్తుగా హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోవడం నివారణలో అత్యంత ముఖ్యం. రక్తపోటు (BP), కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI) వంటి ప్రాథమిక పరీక్షలు గుండె ఆరోగ్య స్థితిని స్పష్టంగా తెలియజేస్తాయి.
ముఖ్యంగా రక్తపోటు విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే అధిక రక్తపోటుకు ఎలాంటి స్పష్టమైన బాహ్య లక్షణాలు ఉండవు. అందుకే దీనిని 'సైలెంట్ కిల్లర్' అంటారు. కుటుంబంలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు లేదా హై కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నవారు చిన్న వయసు నుంచే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.
రోజువారీ జీవనశైలే శ్రీరామరక్ష
గుండె సంరక్షణ అంటే కేవలం వైద్య పరీక్షలు మాత్రమే కాదు. మనం రోజూ పాటించే జీవనశైలి అలవాట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.
- క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం
- పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవడం
- శరీర బరువును అదుపులో ఉంచుకోవడం
- పొగాకు, ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండటం
- తగినంత నిద్రపోవడం
ఈ అలవాట్లు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారికి కూడా గుండెను పటిష్టంగా ఉంచేందుకు తోడ్పడతాయి. కేవలం గుండెపైనే కాకుండా రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్, మూత్రపిండాల (కిడ్నీ) ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి కాబట్టి, వీటిని అదుపులో ఉంచుకుంటే దీర్ఘకాలంలో గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చు.
యువతకు ఉండే అతిపెద్ద ప్లస్ పాయింట్ సమయం. శరీరం ఇచ్చే ప్రతి చిన్న మార్పుకు భయపడాల్సిన పనిలేదు కానీ, ఆరోగ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం అవసరం. బ్లడ్ ప్రెజర్, షుగర్ వంటి హెల్త్ నంబర్లపై అవగాహన కలిగి ఉండటం, కుటుంబ ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం, ప్రమాద సంకేతాలను గుర్తించడం ద్వారా సమస్యలను ముందే అడ్డుకోవచ్చు. మొదటిసారి గుండెపోటు వచ్చాకే జాగ్రత్తలు పడటం కాకుండా, యవ్వనంలోనే అప్రమత్తమైతే రాబోయే రోజుల్లో గుండెను భద్రంగా కాపాడుకోవచ్చు.
వ్యాసకర్త:
డాక్టర్ సుదర్శన్ జీటీ,
డైరెక్టర్ - ఎంఐసీఎస్ & రోబోటిక్ కార్డియాక్ సర్జరీ,
ఫోర్టిస్ హాస్పిటల్, బన్నేరుఘట్ట రోడ్, బెంగళూరు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


