ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు - 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా… ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Published on: Dec 4, 2025, 07:36:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ముగ్గురు జవాన్లు కూడా మృతి చెందారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. జిల్లాలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు.

బీజాపూర్‌లో ఎదురుకాల్పులు ( ప్రతీకాత్మక చిత్రం)
బీజాపూర్‌లో ఎదురుకాల్పులు ( ప్రతీకాత్మక చిత్రం)

బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు వెంబడి ఉన్న అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ ఐజీ తెలిపారు. దంతెవాడ, బీజాపూర్ కు చెందిన డీఆర్జీ సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు విభాగాలు, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్- సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్) ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని చెప్పారు.

12 మంది మావోయిస్టులు మృతి…

ఎన్ కౌంటర్ ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు 12 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒకరిని మోడియం వెల్లాగా గుర్తించామని, మిగిలిన మృతుల గుర్తింపు ఇంకా తెలియరాలేదని ఆయన తెలిపారు.

వెల్లా మావోయిస్టుల పిఎల్జిఎ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) కంపెనీ నెం.2 కమాండర్ గా చురుకుగా ఉన్నాడు. 2020లో సుక్మాలో భద్రతా దళాలపై జరిగిన దాడులో కూడా పాల్గొన్నాడు. ఇందులో 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో 22 మంది భద్రతా సిబ్బంది మరణించిన టెకల్గూడెం (బీజాపూర్) దాడితో సహా అనేక సంఘటనలలో పాల్గొన్నాడు.

ఘటనా స్థలం నుంచి ఒక లైట్ మెషిన్ గన్, సింగిల్ లోడింగ్ రైఫిల్స్ (ఎస్ఎల్ఆర్), ఇన్సాస్ రైఫిల్స్, .303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో బీజాపూర్ డీఆర్జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోను వడాడి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోధి మృతి చెందారు.

గాయపడిన జవాన్లకు వెంటనే ప్రథమ చికిత్స అందించామని… వారు ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారని ఐజీ తెలిపారు. పశ్చిమ బస్తర్ డివిజన్ పరిధిలోని ఎన్ కౌంటర్ స్థలానికి మరికొన్ని బృందాలను పంపామని… ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతోందని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు.

భద్రతా బలగాల తాజా చర్యతో ఈ ఏడాది ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో 275 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో బీజాపూర్, దంతెవాడ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్ లో 246 మందిని చనిపోగా…. రాయ్ పూర్ డివిజన్ పరిధిలోని గరియాబంద్ జిల్లాలో మరో 27 మంది మృతి చెందారు. దుర్గ్ డివిజన్ లోని మొహ్లా-మన్పూర్-అంబాగఢ్ చౌకీ జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. ఈ సంఘటనతో ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ కౌంటర్లతో సహా మావోయిస్టు హింసలో 23 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు 2026 మార్చి 31 వరకు కేంద్రం గడువును నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More