'విజయవాడలోనే పట్టుకున్నారు.. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ బూటకం' - మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ
మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లపై మావోయిస్టు పార్టీ స్పందించింది. కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ అగ్రనేత హిడ్మాతో పాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపించారు. అందుకు నిరసనగా నవంబర్ 23వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.
ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపించింది. మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకుని… క్రూరంగా హత్య చేశారని ఓ ప్రకటనలో పేర్కొంది.

బంద్ కు పిలుపు….
మారేడుమిల్ల ఎన్ కౌంటర్లకు నిరసనగా నవంబర్ 23వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఓ లేఖ విడుదలైంది. పోలీసుల చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్ కౌంటర్ జరిగిందని కట్టుకథను అల్లారని వివరించారు. ఈ క్రూరమై హత్యకాండకు వ్యతిరేకంగా ‘నవంబర్ 23’న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.
క్రూరంగా హత్య చేశారు…
“దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్రకమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా మరియు అతని సహచరి కామ్రేడ్ రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోం మినిస్ట్రీ డైరెక్షన్ లో ఆంధ్ర ఎస్ ఐబీ నవంబర్ 15వ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారు. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలు” అని మావోయిస్టు పార్టీ స్పష్టం చేశారు.
తమ ఆమూల్యమైన ప్రాణాలను అర్పించి, ఉద్యమ స్పూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్ శంకర్ (ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు), కామ్రేడ్ రాజే (రీజినల్ కమిటీ సభ్యురాలు ) లకు సీపీఐ (మావోయిస్టు) నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. వారు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్ర కమిటీ శపథం చేస్తోందని స్పష్టం చేశారు.
భగత్ సింగ్, కొమురం భీం, గూండాదూర్, గేంద్ సింగ్, అల్లూరి సీతారామరాజుల చరిత్ర లాగానే హిడ్మా చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్ర వేస్తుందని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదు, పీడిత ప్రజల నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడని కొనియాడింది. ఈ చరిత్రను భవిష్యత్ తరాలు చదివి ప్రేరణ పొందుతాయని పేర్కొంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











