స్వగ్రామం పూవర్తికి హిడ్మా డెడ్‌బాడీ.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి!

మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం ఆయన సొంత ఊరు పూవర్తికి చేరుకుంది. ఆయన మృతదేహాన్ని చూసి తల్లి పుంజి కన్నీరు మున్నీరుగా విలపించారు.

Published on: Nov 20, 2025, 12:10:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం చత్తీస్‌ఘడ్‌లోని ఆయన స్వగ్రామం అయిన పూవర్తికి చేరుకుంది. హిడ్మా తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహం వద్దకు భారీగా చేరుకున్నారు. ఓ వ్యానులో నుంచి మృతదేహాన్ని కిందకు దించారు. స్థానికులు మృతదేహానికి ముట్టుకుని మెుక్కుతున్నట్టుగా ఓ వీడియోలో కనిపించింది.

స్వగ్రామానికి హిడ్మా మృతదేహం
స్వగ్రామానికి హిడ్మా మృతదేహం

పూవర్తి గ్రామం మెుత్తం హిడ్మా ఇంటి దగ్గరకే చేరుకుంది. మహిళలంతా బోరున విలపిస్తున్నారు. లోంగిపో అని చెప్పాం కదా బాబు అంటూ ఏడుస్తున్నారు.

మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మరేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మృతి చెందారు. హిడ్మాతోపాటుగా ఆయన భార్య రాజే కూడా చనిపోయారు. పోస్టుమార్టం ప్రక్రియలో కాస్త జాప్యం జరిగింది. మంగళవారం ఉదయం చనిపోగా.. బుధవారం రాత్రి వరకు హిడ్మా మృతదేహానికి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు.

హిడ్మా ఉన్నాడనే ధైర్యంతో పూవర్తి గ్రామం మావోయిస్టు పార్టీకి రాజధానిలా ఉండేదని పలువురు చెబుతున్నారు. కానీ ఇప్పుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. 1981లో సుక్మాలో పూవర్తి గ్రామంలో జన్మించిన హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడయ్యారు. బస్తర్ ప్రాంతం నుండి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు ఆయన. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, తెలుగు, గోండి, బెంగాలీ, కోయ భాషతోపాటుగా మరికొన్నింటిలో ప్రావీణ్యం ఉంది.

దండకారణ్యంలో హిడ్మాకు చాలా పట్టు ఉంది. పార్టీ శ్రేణులను ముందు ఉండి నడిపించేవారు. హిడ్మా ప్లాన్ వేస్తే పక్కాగా జరుగుతుందనే పేరు ఉంది. గెరిల్లా దాడులు చేయడంలో దిట్ట. భారీ దాడులకు వ్యూహం వేయాలంటే హిడ్మా అక్కడ ఉండేవాట. ఈ క్రమంలోనే మిలటరీ దాడులకు మారు పేరైన పీఎల్‌జీఏలో ఒకటో బెటాలియన్‌కు హిడ్మా సారథ్యం వహించారు.

ఏడో తరగతి వరకే హిడ్మా చదువుకున్నారు. 17 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీలో చేరారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 1వ బెటాలియన్‌కు కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యుడిలాంటి కీలక బాధ్యతలు హిడ్మా చేతిలో ఉండేవి. మావోయిస్టుల టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేసేది. ఇప్పుడు హిడ్మా మరణంతో పూవర్తి గ్రామంతోపాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More