మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఛత్తీస్‌గఢ్‌లో 41 మంది లొంగుబాటు!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం 41 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వారిలో 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉందని అధికారులు తెలిపారు.

Published on: Nov 26, 2025, 15:48:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం 41 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. బుధవారం బీజాపూర్ జిల్లాలో 41 మంది నక్సలైట్లు సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారని అధికారులు నిర్ధారించారు. మొత్తం 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉంది. కొన్ని రోజులుగా వరుసగా మావోయిస్టులు లొంగుబాటు అవుతున్నారు.

లొంగిపోయిన మావోయిస్టులు
లొంగిపోయిన మావోయిస్టులు

ప్రభుత్వం తీసుకొచ్చిన లొంగుబాటు, పునరావాస విధానం తమను ఆకట్టుకుందని మావోయిస్టులు తెలిపారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. సీనియర్ పోలీసు అధికారుల ముందు 41 మంది లొంగిపోయారని బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

41 మందిలో 39 మంది మావోయిస్టుల దక్షిణ సబ్-జోనల్ బ్యూరోలో భాగమని, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ధమ్తారి-గరియాబంద్-నువాపాడ డివిజన్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టులు అందరూ.. రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ధృవీకరించారని పోలీసులు అధికారులు తెలిపారు. ప్రజలతో గౌరవప్రదమైన, సురక్షితమైన జీవితాన్ని గడపాలనే కోరికను వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రతి ఒక్కరికీ తక్షణ ఆర్థిక సహాయంగా రూ.50,000 అందించారు.

లొంగిపోయిన వారిలో నలుగురు పీఎల్‌జీఏ బెటాలియన్ నంబర్ 1, మావోయిస్టుల వివిధ కంపెనీల సభ్యులు, ముగ్గురు ఏరియా కమిటీ, 11 ప్లాటూన్ మరియు ఏరియా కమిటీ పార్టీ సభ్యులు, ఇద్దరు పీఎల్‌జీఏ సభ్యులు, నలుగురు మిలీషియా ప్లాటూన్ కమాండర్లు, ఒక డిప్యూటీ కమాండర్, ఆరుగురు మిలీషియా ప్లాటూన్ సభ్యులు, మిగిలిన వారు నిషేధిత సీపీఐ(మావోయిస్ట్) ఫ్రంటల్ సంస్థలకు చెందినవారని ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు.

లొంగిపోయిన వారిలో అనేక మంది అధిక రివార్డ్ క్యాడర్‌ వారు కూడా ఉన్నారు. పాండ్రు హప్కా అలియాస్ మోహన్ (37), బండి హప్కా (35), లక్కు కోర్సా (37), బద్రు పూనెం (35), సుఖ్‌రామ్ హేమ్లా (27), మంజుల హేమ్లా (25), మంగళి మద్వి అలియాస్ శాంతి (29), జైరాం కడియం (28), పండో మడ్కం అలియాస్ చాందినీపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉంది. ముగ్గురిపై రూ.5 లక్షలు, పన్నెండు మంది క్యాడర్‌పై రూ.2 లక్షలు, ఎనిమిది మంది తలపై రూ.1 లక్ష రివార్డు ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం వినియోగించుకోవాలని, హింసను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావాలని ఎస్పీ యాదవ్ అన్నారు. ఈ లొంగుబాటుతో జనవరి 2024 నుండి మొత్తం 790 మంది మావోయిస్టులు జిల్లాలో ప్రధాన స్రవంతిలో చేరారని ఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో జిల్లాలో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 202 మంది నక్సలైట్లు హతమయ్యారని, 1,031 మంది క్యాడర్లను అరెస్టు చేసినట్టుగా చెప్పారు. గత 23 నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో టాప్ క్యాడర్‌లతో సహా 2,200 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని పోలీసులు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More