వివాహం, సంతాన, ఆర్థిక సమస్యలా? శక్తివంతమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సమస్యలన్నీ తీరిపోవచ్చు!

కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రఖ్యాత కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. రెండవది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, మూడవది నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడు క్షేత్రాలకు కూడా నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయాలకు వెళుతూ ఉంటారు. 

Published on: Nov 25, 2025 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం పూజలు చేయడం, పరిహారాలను పాటించడం, ఆలయాలను సందర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. నాగ, సర్ప దోషాలతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ దోషాల నుంచి బయటపడడానికి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రఖ్యాత కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం.

కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (pinterest)
కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (pinterest)

రెండవది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, మూడవది నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడు క్షేత్రాలకు కూడా నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయాలకు వెళుతూ ఉంటారు. ఇవి మూడు కూడా కర్ణాటకలో వెలసిన అద్భుతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు. మరో విషయం ఏంటంటే, ఈ మూడు ఆలయాలని కలిపితే సర్పాకారం వస్తుంది. ఇక ఈరోజు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

కుజదోష పూజలు

కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సర్ప దోష పూజల్లో ముఖ్యమైన ఆశ్లేష బలి, సర్ప సంస్కారాలు వంటివి చేస్తే నాగ దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాల నుంచి బయటపడొచ్చు. ప్రతి ఏటా శ్రావణ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉంటుంది. విశేషమైన రోజుల్లో మాత్రం భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది.

అద్భుతమైన సుబ్రహ్మణ్య విగ్రహం

గరుడ స్తంభం మొట్టమొదట ఉంటుంది. ఆ తర్వాత బాహ్య, అంతరాల సుబ్రహ్మణ్య మండపాలు ఉంటాయి. ఆలయం మధ్యలో ఒక ఎత్తైన పీఠం ఉంటుంది. ఆ పీఠం పైభాగంలో సుబ్రహ్మణ్య, వాసుకిల విగ్రహాలు ఉంటాయి. కింద భాగంలో ఆరు తలలు ఉన్న శేషనాగ విగ్రహం కనబడుతుంది. రోజూ ఇక్కడ శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు.

షణ్ముఖుడు తారకాసుర, పద్మాసుర అనే రాక్షసులను సంహరించిన తర్వాత సోదరుడైన వినాయకుడితో పాటు ఈ కుమార పర్వతాన్ని చేరుకుంటారని, రాక్షస సంహారం కారణంగా సంతోషంలో ఉన్న ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి ఈ ఆలయ ప్రాంతంలో మార్గశిర మాసం శుద్ధ షష్టి నాడు వివాహం జరిపించినట్లు స్కాంద పురాణం ప్రకారం తెలుస్తోంది.

ఆలయానికి వెళ్లినట్లయితే ఇలా దర్శించండి

సుబ్రహ్మణ్య దర్శనానికి ముందు పవిత్ర ధారా నదిలో స్నానం చేయాలి. ఆ తర్వాత దర్శనానికి వెళ్లాలి. స్వామి దర్శనానికి ఆలయ వెనుక తలుపు నుంచి ఆలయంలోకి చేరుకుని మూలవిరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.

ఆలయం ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి?

ఈ ఆలయం పశ్చిమ కనుమల్లో, దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం ధారా నది తీరాన ఉంది. ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగిపోతాయని నమ్మకం. స్వామి పడగ విప్పి కాపు కాస్తున్న ఆరు సర్పకాల నాగుల్లాగా దర్శనమిస్తారు. ఈ కుక్కే గ్రామంలో ఉన్న పురాతన ఆలయాన్ని బెంగళూరు, చిక్ మంగుళూరు నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో రావచ్చు.

ఈ ఆలయానికి వెళ్తే ఈ సమస్యలు తీరిపోతాయి

కొంత మందికి పెళ్లి ఆలస్యం అవ్వడం, సంతానం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, సర్ప దోషాలు వంటివి ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది.

News/Rasi Phalalu/వివాహం, సంతాన, ఆర్థిక సమస్యలా? శక్తివంతమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సమస్యలన్నీ తీరిపోవచ్చు!
News/Rasi Phalalu/వివాహం, సంతాన, ఆర్థిక సమస్యలా? శక్తివంతమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సమస్యలన్నీ తీరిపోవచ్చు!