యూట్యూబ్ లో 5 బిలియన్ వ్యూస్ తో రికార్డు.. ఏకైక ఇండియన్ సాంగ్ ఏదో తెలుసా? సినిమా పాట కాదు.. 14 ఏళ్ల క్రితం రిలీజ్
లెహంగా, రౌడీ బేబీ, దిల్బర్ వంటి యూట్యూబ్ వీడియోలకు అత్యధిక వ్యూస్ ఉన్నప్పటికీ, ఈ పాట వీడియో 5 బిలియన్ వ్యూస్ మార్కును అధిగమించింది. దీని వెనుక ఉన్న కథేంటి?
ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో అగ్రస్థానంలో నిలిచే వీడియో లేదా పాట ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు 14 ఏళ్ల నాటి ఒక వీడియో భారతదేశం నుండి యూట్యూబ్‌లో 5 బిలియన్ వ్యూస్‌ను దాటిన ఏకైక వీడియోగా అవతరించింది. ఇతర వీడియోలు 2 బిలియన్ కంటే తక్కువ వ్యూస్‌తో వెనుకబడి ఉన్నాయి. దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

5 బిలియన్ వ్యూస్
టీ-సిరీస్‌కు చెందిన దివంగత గుల్షన్ కుమార్ నటించిన 'శ్రీ హనుమాన్ చాలీసా' వీడియో మే 10, 2011న యూట్యూబ్‌లో విడుదలైంది. విడుదలైన 14 ఏళ్లలో 5 బిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది. ఇది ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ వీడియోగా నిలిచింది. యూట్యూబ్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన వీడియోలలో ఒకటిగా స్థానం సంపాదించింది. ఈ వీడియో కోసం చాలీసాను హరిహరణ్ పాడారు. లలిత్ సేన్ సంగీతం అందించారు.
భూషణ్ థ్యాంక్స్
హనుమాన్ చాలీసా 5 బిలియన్ వ్యూస్ దాటడంతో టీ సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తన కృతజ్ఞతలు తెలిపారు. "హనుమాన్ చాలీసా లక్షలాది మంది హృదయాలలో, నా హృదయంలో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. నా తండ్రి గుల్షన్ కుమార్ జీ ఆధ్యాత్మిక సంగీతాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. 5 బిలియన్ వ్యూస్‌ను దాటడం, యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 వీడియోలలో ఒకటిగా నిలవడం కేవలం డిజిటల్ విజయం కాదు .ఇది ఈ దేశ ప్రజల అచంచలమైన భక్తిని ప్రతిబింబిస్తుంది" అని భూషణ్ పేర్కొన్నారు.
ఈ పాటలు
శ్రీ హనుమాన్ చాలీసాకు భారతదేశంలో విడుదలైన ఏ సాంగ్ కూడా దగ్గరగా రాలేదు. దీని తర్వాత స్థానంలో ఉన్న వీడియో పంజాబీ పాట ‘లెహంగా’. దీనికి 1.8 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. హర్యానవీ పాట '52 గజ్ కా డమన్'కు 1.7 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. 'రౌడీ బేబీ'కి కూడా 1.7 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. 'జరూరి థా', 'వాస్తే', 'లాంగ్ లాచీ', 'లుట్ గే', ‘దిల్బర్’, 'బమ్ బమ్ బోలే' కూడా భారతదేశంలో ఎక్కువ వ్యూస్ పొందిన పాటలుగా ఉన్నాయి.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 'బేబీ షార్క్ డాన్స్' 16.38 బిలియన్ వ్యూస్‌తో, 'డెస్పాసిటో' 8.85 బిలియన్, 'వీల్స్ ఆన్ ది బస్' 8.16 బిలియన్, 'బాత్ సాంగ్' 7.28 బిలియన్, 'జానీ జానీ ఎస్ పాపా' 7.12 బిలియన్ వ్యూస్ తో వరుసగా టాప్ లో ఉన్నాయి.













