...
...
Next Story

Maruti suzuki fronx : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఫేస్​లిఫ్ట్- త్వరలోనే లాంచ్! ఇవీ హైలైట్స్..

భారత మార్కెట్లో రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకుపోతున్న మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ సరికొత్త హంగులతో రాబోతోంది. 2027లో విడుదల కానున్న ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో లెవల్-2 అడాస్, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు 35 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ తీసుకురానున్నారు.

Published on: Nov 22, 2026, 10:07:22 IST
Advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి కొత్త ఊపు తెచ్చిన కారు ‘మారుతీ సుజుకీ ఫ్రాంక్స్’. 2023లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు, తన ఆకర్షణీయమైన కూపే-ఎస్‌యూవీ స్టైలింగ్, సమర్థవంతమైన ఇంజిన్లు, అందుబాటు ధరతో అనతికాలంలోనే కొనుగోలుదారుల మనసు గెలుచుకుంది. దేశవ్యాప్తంగా మారుతీకి ఉన్న విస్తృతమైన సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్ కూడా ఈ కారు విజయానికి తోడైంది. ఫలితంగా 2026 మే నాటికి దేశీయ మార్కెట్లో ఏకంగా 5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని ఫ్రాంక్స్ అధిగమించింది. ఇప్పుడు ఈ జోరును మరింత పెంచేందుకు మారుతీ సుజుకీ సిద్ధమవుతోంది. అధికారిక విడుదల తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, 2027లో ‘ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్’ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

అడాస్ భద్రత.. నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు!

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్..

ఇటీవల రోడ్లపై పరీక్షిస్తున్న కొత్త ఫ్రాంక్స్ కారు చిత్రాలు ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కారు ముందు భాగంలోని గ్రిల్‌లో రాడార్ మాడ్యూల్ అమర్చినట్లు ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని బట్టి కొత్త మోడల్‌లో లెవల్-2 అడాస్ టెక్నాలజీ రావడం ఖాయమని తెలుస్తోంది. ఈ వ్యవస్థలో భాగంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆటోమేటిక్ హై బీమ్ అసిస్ట్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు లభించనున్నాయి. బ్రేకింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు, ప్రస్తుతం ఉన్న వెనుక డ్రమ్ బ్రేక్‌ల స్థానంలో కొత్తగా రియర్ డిస్క్ బ్రేక్‌లను అమర్చనున్నారు.

కొత్త జెడ్12ఈ ఇంజిన్.. 35 కి.మీ మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ టెక్నాలజీ!

ఫ్రాంక్స్ ఇంజిన్ విభాగంలోనూ మారుతీ సుజుకీ కీలక మార్పు చేయనుంది. కొత్త బాలెనో తరహాలోనే, 2027 ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లోనూ ప్రస్తుతం ఉన్న నాలుగు సిలిండర్ల కే-సిరీస్ ఇంజిన్ స్థానంలో 1.2-లీటర్, మూడు సిలిండర్ల జెడ్12ఈ పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకురానున్నారు. ఈ కొత్త ఇంజిన్ దాదాపు 83 బీహెచ్​పీ పవర్​ని, 112 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ ప్రియుల కోసం కంపెనీ అందించే ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్ కూడా యథాతథంగా కొనసాగనుంది.

ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికొస్తే, 2027 ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త గ్రిల్, మార్పులు చేసిన ముందు, వెనుక బంపర్లు కనిపించనున్నాయి. అయితే కారుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన స్ల్పిట్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, వాలుగా ఉండే రూఫ్‌లైన్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్ సెటప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

కారు లోపలి భాగాన్ని మరింత విలాసవంతంగా తీర్చిదిద్దనున్నారు. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వేసవిలో ఎంతో ఊరటనిచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కొత్త సీట్ అప్‌హోల్‌స్టరీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కొత్త మోడల్‌లో జోడించనున్నారు.

మెరుగైన భద్రత, ఆధునిక ఫీచర్లు, అద్భుతమైన మైలేజీ కలగలిసి రానున్న 2027 మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్, కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks