26th August holiday : రేపు బ్యాంకులకు సెలవు- ఎందుకు? మరి స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?
Eid Milad 2026 : ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకుని ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబి పండుగ వాతావరణం దేశమంతటా నెలకొంది. ఈ సందర్భంగా ఆగస్టు 26న తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు అధికారిక సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయి, ఏవి బంద్ అవుతాయో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే 'ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబి' (మౌలిద్) వేడుకలకు దేశవ్యాప్తంగా సర్వం సిద్ధమైంది. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 25 సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ఈ పవిత్ర ఉత్సవాలు ఆగస్టు 26న ముగుస్తాయి. పండుగ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం బుధవారం నాడు తెలంగాణ సహా 14కు పైగా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ విశిష్టత.. ప్రేమ, కరుణా సందేశం!
ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మూడో నెల అయిన రబీ-ఉల్-అవ్వల్ 12వ రోజున ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబి వేడుకలను నిర్వహిస్తారు. మానవాళికి ప్రేమ, కరుణ, న్యాయం, సమానత్వం వంటి ఉన్నత విలువలను అందించిన మహమ్మద్ ప్రవక్త క్రీస్తుశకం 570 ప్రాంతంలో మక్కా నగరంలో జన్మించారు. ఆయన జన్మించిన రోజే పరమపదించడంతో, ముస్లిం సమాజం ఈ దినాన్ని ఆధ్యాత్మిక చింతనతో గడుపుతుంది. మసీదులు, వీధులను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి, ప్రవక్త దివ్య సందేశాలను స్మరిస్తూ మిలాద్ జులూస్ (శాంతియుత ఊరేగింపులు) నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పరిస్థితి ఏంటి?
ఆర్బీఐ విడుదల చేసిన బ్యాంక్ సెలవుల జాబితా ప్రకారం ఆగస్టు 26న తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, దిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో బ్యాంక్ శాఖలు మూతపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సాధారణ పనిదినంగానే సాగే అవకాశం ఉన్నప్పటికీ, స్థానిక శాఖల పనివేళలు, ఆర్బీఐ ప్రాంతీయ నిబంధనలను బట్టి కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. ఆర్థిక లావాదేవీల ప్రణాళిక ఉన్నవారు ఈ మార్పులను గమనించడం అవసరం.
ఏయే సేవలు పనిచేస్తాయి? ఏవి బంద్?
ఆగస్టు 26న అనేక బ్యాంక్ శాఖలు మూసివేసినప్పటికీ, డిజిటల్ యుగంలో వినియోగదారులకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు. పలు ఆన్‌లైన్ సేవలు నిరంతరాయంగా లభిస్తాయి.
అందుబాటులో ఉండే సేవలు : నగదు విత్‌డ్రా కోసం ఏటీఎమ్‌లు యథావిధిగా పనిచేస్తాయి. వీటితో పాటు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ (గూగుల్ పే, ఫేన్పే, పేటీఎం) లావాదేవీలు నిరంతరాయంగా సాగుతాయి.
పనిచేయని సేవలు : బ్యాంక్ కౌంటర్ల వద్ద నేరుగా నగదు జమ చేయడం, విత్‌డ్రా చేసుకోవడం, చెక్కుల క్లియరెన్స్, కొత్త ఖాతాల తెరవడం, పాస్‌బుక్ ప్రింటింగ్ వంటి సేవలు లభించవు. కాబట్టి నేరుగా బ్యాంక్‌తో పని ఉన్నవారు ఈ గురువారం వరకు వేచి చూడాల్సిందే.
మరి స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?
ఈద్ -ఏ -మిలాద్ -ఉన్ -నబీ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు ఉన్నప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం బుధవారం ఓపెన్లోనే ఉంటాయి. వీటికి సెలవు లేదు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఎప్పటిలాగే యథావిథిగా పనిచేస్తాయి.
మరోవైపు రాఖీ పౌర్ణమి నేపథ్యంలో ఆగస్టు 28న బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ, ఆరోజు కూడా స్టాక్ మార్కెట్లు యథావిథిగా పనిచేస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


