Bank strike : బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె సైరన్! ఈ డేట్స్‌లో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం
Bank strike news : ఐదు రోజుల పనివారంతో పాటు సవరించిన పీఎల్ఐ విధానాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు సమ్మె డేట్స్‌ని ప్రకటించారు. ఆ వివరాలు..
ప్రధాన బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) రెండు కీలక డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా వరుస సమ్మెలకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లతో యూఎఫ్‌బీయూ బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చింది.

దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె తేదీలు..
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ నెలలో మూడు విడతలుగా ఆందోళన కార్యక్రమాలను బ్యాంకు ఉద్యోగులు ప్రకటించారు.
- సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మె
- సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె
- అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె
ఐదు రోజుల పనివారానికి సంబంధించి 2024 మార్చిలో కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందం, 9వ జాయింట్ నోట్ నిబంధనలను యూఎఫ్‌బీయూ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ ప్రతిపాదన వచ్చి రెండేళ్లకు పైగా గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వ ఆమోదించలేదని యూనియన్ పేర్కొంది. ఐదు రోజుల బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టేందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ 40 నిమిషాలు అదనంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ సిఫార్సును ప్రభుత్వానికి పంపామని యూఎఫ్‌బీయూ తన నోటీసులో స్పష్టం చేసింది.
పీఎల్ఐ పథకంపై తీవ్ర వ్యతిరేకత..
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించిన పీఎల్ఐ ఫ్రేమ్‌వర్క్‌ను యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
యూనియన్ సర్క్యులర్ ఈ అంశంపై స్పందిస్తూ, "స్కేల్ IV, అంతకంటే పైస్థాయి అధికారులకు వారి వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఏడాది బేసిక్ పే లో 365 రోజుల వరకు పీఎల్ఐ చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ/డీఎఫ్‌ఎస్ బ్యాంక్‌లను ఆదేశించింది. కానీ సాధారణ ఉద్యోగులకు, స్కేల్ III వరకు ఉన్న అధికారులకు మాత్రం గరిష్టంగా కేవలం 15 రోజుల బేసిక్ పే ప్లస్ డీఏ మాత్రమే చెల్లిస్తారు," అని పేర్కొంది. ఇది యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య కుదిరిన ఒప్పందానికి స్పష్టమైన ఉల్లంఘన అని వారు ఆరోపించారు.
బ్యాంక్ మొత్తం పనితీరు ఆధారంగానే పీఎల్ఐ పథకం ఉండాలని, స్కేల్ VII వరకు ఉన్న ఉద్యోగులు, అధికారులందరికీ సమానమైన రోజులతో కూడిన విధానం అమలు చేయాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేసింది.
పెన్షన్, ఇతర డిమాండ్లు..
ఈ కీలక డిమాండ్లతో పాటు యూనియన్ల చర్చల ద్వారా పీఎల్ఐ పథకాన్ని సవరించాలని, పెన్షన్ పెంపు- మెరుగుదల, పింఛనుదారులందరికీ ఒకే రకమైన డీఏ ఫార్ములా, ఎన్‌పీఎస్ పరిధిలోని ఉద్యోగులకు ఓపీఎస్‌కి మారే అవకాశం వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని బ్యాంక యూనియన్లు గట్టిగా కోరాయి. ప్రస్తుతం ఈ పీఎల్ఐ వివాదం చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ) వద్ద సయోధ్య దశలో ఉందని, అలాగే దిల్లీ హైకోర్టులో కూడా దీనిపై విచారణ జరుగుతోందని సర్క్యులర్ వెల్లడించింది.
కొన్ని రోజుల క్రితం, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను టాప్-డౌన్, మార్కెట్-కేంద్రీకృత పద్ధతిలో పునర్వ్యవస్థీకరించడాన్ని యూఎఫ్‌బీయూ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజా ప్రయోజన బ్యాంకింగ్‌ను పునరుద్ధరించాలని, చిన్న డిపాజిట్లపై ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించేలా సరసమైన రాబడులు ఇవ్వాలని, చిన్న రుణగ్రహీతలకు నేరుగా బ్రాంచ్ ఆధారిత రుణాలను విస్తరించాలని ఫోరమ్ డిమాండ్ చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


