ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. జూలై 22న బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేలు జమ కానున్నాయ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 22న తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనుంది. ఈ పథకానికి ఎవరు అనర్హులో చూడండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 22న తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన తల్లులు, సంరక్షకుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థిక సహాయం నేరుగా జమ చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,120.78 కోట్లు కేటాయించింది. దీని ద్వారా సుమారు 67.47 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

ఈ పథకం కింద గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, ప్రైవేట్, ప్రభుత్వేతర, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో ఇంటర్మీడియట్‌తో సహా విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ. 15,000 అందుకుంటారు.
అయితే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి విద్యార్థి నుండి రూ.2,000 చొప్పున మినహాయించనుంది ప్రభుత్వం. తత్ఫలితంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం ద్వారా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు రూ. 13,000 బదిలీ అవుతుంది. అయితే మినహాయించిన మొత్తాన్ని పాఠశాల, జూనియర్ కళాశాలల నిర్వహణ, పారిశుధ్యం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తారు.
మొదటి దశలో జూలై 22న.. 41,07,502 మంది తల్లులు, సంరక్షకుల్లో ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. 64,76,590 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్‌లో కొత్త ప్రవేశాలను చేర్చడం, పెండింగ్‌లో ఉన్న రికార్డులను సరిదిద్దిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య 42,70,802 మంది తల్లులకు పెరుగుతుందని అంచనా.
ప్రభుత్వం ఒకటో తరగతిలో సుమారు 59,500 కొత్త ప్రవేశాలు, జూనియర్ ఇంటర్మీడియట్‌లో 56,100 ప్రవేశాలు జరుగుతాయని అంచనా వేస్తోంది. దీనితో పాటు దాదాపు 1.55 లక్షల చెల్లని లేదా అసంపూర్ణ రికార్డులను సరిదిద్దనుంది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, ప్రైవేట్, ప్రభుత్వేతర, రెసిడెన్షియల్ సంస్థలలో చేరిన విద్యార్థులకు వర్తిస్తుంది. అయితే ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద ఉన్న ఐటీఐ, పాలిటెక్నిక్, ఆర్‌జీయూకేటీ (ఐఐఐటీ), ఇతర సంస్థలలో కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు కారు.
గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు. కుటుంబ సభ్యులలో కనీసం ఒకరికి రైస్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. మూడు ఎకరాలకు మించి తడి భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్న కుటుంబాలు, మున్సిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించిన నివాస ఆస్తి ఉన్నవారు అర్హులు కాదు..
నెలసరి సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు పైగా ఉన్న కుటుంబాలు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా మినహాయించారు. అయితే పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కొంతమంది తక్కువ ఆదాయం గల ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. ఒంటరి తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలలో వర్తించే చోట ఆ మొత్తం తండ్రి ఖాతాకు జమ చేస్తారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


