అత్యధిక కేసులున్న 'సీఎం' లిస్ట్‌లో రేవంత్ రెడ్డి టాప్- ఏకంగా 89! చంద్రబాబుపై 19- షాకింగ్ రిపోర్టు..
Criminal cases against CMs : దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4 వేలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పలువురు ముఖ్యమంత్రులు కూడా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. వారిలో అధిక కేసులున్న సీఎం లిస్ట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాప్‌లో నిలిచారు.
దేశవ్యాప్తంగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఏకంగా 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తాజాగా అందిన ఒక నివేదిక సంచలనం సృష్టించింది. చట్టసభల్లో కూర్చుని చట్టాలను చేయాల్సిన నాయకులే నేరారోపణలు ఎదుర్కోవడం మన దేశ రాజకీయాల్లో మరోసారి చర్చాంశంగా మారింది.

దేశంలో ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ దాఖలైన పిల్ విచారణలో భాగంగా, కోర్టు నియమించిన అమికస్ క్యూరీ సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా ఈ రిపోర్టును సమర్పించారు. బీజేపీ నాయకుడు, లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన ఈ పిటిషన్ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే తీవ్ర కలకలం రేపింది. లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో సుమారు 251 మందిపై, రాజ్యసభలోని 233 మంది సభ్యులలో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే..
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 4,192 కేసుల్లో 519 కేసులు పదేళ్లకు పైగా కోర్టుల గడప దాటలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో 700 కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. అందులో 260 కేసులు మూడేళ్లుగా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఈ కేసుల్లో ఇంకా ఛార్జిషీట్లు కూడా దాఖలు కాలేదు.
ఏ రాష్ట్రంలో ఎక్కువ కేసులు ఉన్నాయి?
సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. కేరళకు చెందిన ఎంపీల్లో ఏకంగా 95 శాతం మందిపై నేరారోపణలు ఉన్నాయి. దేశంలోనే ఇది అత్యధికం అని 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది. కేరళ తర్వాత స్థానంలో తెలంగాణ (82 శాతం) నిలిచింది. ఆ తర్వాత ఒడిశా (76 శాతం) ఉంది. అత్యల్పంగా హరియాణా, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో ఎంపీ మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారు.
ఇక తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. పశ్చిమ బెంగాల్ (58 శాతం) మొదటి స్థానంలో ఉండగా, కేరళ (57 శాతం) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ (56 శాతం), తెలంగాణ (49 శాతం), ఒడిశా (45 శాతం) తర్వాతి స్థానాలను ఆక్రమించాయని 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' నివేదించింది.
ముఖ్యమంత్రులపై కేసులు..
ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి 29 పెండింగ్ కేసులతో తర్వాతి స్థానంలో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇద్దరూ చెరో 19 కేసులు ఎదుర్కొంటుండగా, కేరళకు చెందిన వీడీ సతీశన్ వద్ద 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
న్యాయస్థానం జోక్యం తప్పదా?
ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సిట్టింగ్, మాజీ శాసనసభ్యులపై ఉన్న ఈ కేసులను త్వరితగతిన విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని అమికస్ క్యూరీ కోర్టును అభ్యర్థించారు. అలాగే, ఈ కేసుల విచారణ పురోగతిని ఆయా హైకోర్టులు స్వయంగా పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


