Crime news : తోటి భారతీయులను ముంచేసిన ఐదుగురు! థాయ్‌లాండ్‌కి తీసుకెళ్లి కిడ్నాప్, హింస..
ఐదుగురు భారతీయులు.. మరో ముగ్గురు భారతీయులను థాయ్‌లాండ్‌కి తీసుకెళ్లి, కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం ఇంత చేసిన ఆ ఐదుగురిని పోలసులు అరెస్ట్ చేశారు.
తక్కువ ధరకే బ్యాంకాక్ టూర్ అని నమ్మించి ముగ్గురు భారతీయ పర్యాటకులను థాయ్‌లాండ్‌లో కిడ్నాప్ చేసిన ఐదుగురు భారతీయులను బ్యాంకాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.40 లక్షల పరిహారం కోరుతూ బాధితులను చిత్రహింసలు పెట్టిన వైనం కలకలం రేపింది.

దేశం విడిచి పారిపోయేందుకు బ్యాంకాక్‌లోని క్లాంగ్ తాన్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో వేచి చూస్తుండగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పత్రిక 'బ్యాంకాక్ పోస్ట్' వెల్లడించింది.
అరెస్టయిన నిందితులను అవతార్ సింగ్ (38), జగ్జీత్ సింగ్ (38), రాంబాలక్ కుమార్ (24), సుఖ్‌బీర్ సింగ్ (37), కుల్రా సింగ్ (27)గా పోలీసులు గుర్తించారు.
దుబాయ్ డోర్-కీ.. పాకిస్థానీ మాస్టర్ మైండ్!
పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి! నెల క్రితం ఒక చాటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ పాకిస్థానీ పౌరుడి ఆదేశాల మేరకే తాము ఈ ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేశామని నిందితులు ఒప్పుకున్నారు. ఈ ముఠాకు అసలు సూత్రధారి (మాస్టర్‌మైండ్) దుబాయ్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాడని, బాధితుల కుటుంబాల నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో భారీగా డబ్బు వసూలు చేయాలని పథకం వేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ పని పూర్తి చేసినందుకు గాను బాధితుల వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువులతో పాటు థాయ్‌లాండ్ నుంచి పారిపోవడానికి విమాన టిక్కెట్లు ఇస్తామని ఆ మాస్టర్‌మైండ్ తమకు ఆశ చూపినట్లు నిందితులు చెప్పారు.
రెస్క్యూ ఆపరేషన్.. బయటపడ్డ ఘోరాలు!
సీసీటీవీ ఫుటేజ్, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా సోమవారం సాయంత్రం పట్టాయాలోని ఆ ఇంటిపై పోలీసులు మెరుపు దాడి చేశారు. నిందితుల బంధీలుగా ఉన్న మోహిత్ (23), ఆశిష్ (24), హిమాంశు (20) అనే ముగ్గురు యువకులను సురక్షితంగా రక్షించారు. ఇంట్లోని పైఅంతస్తులో కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్లు వేసి ఉన్న స్థితిలో బాధితులు కనిపించారు. వారి శరీరంపై తీవ్రమైన గాయాల గుర్తులు ఉన్నాయి.
ఘటనా స్థలం నుంచి పోలీసులు ప్లాస్టర్ టేపులు, బాధితులపై దాడికి ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, రెడ్ స్ప్రే పెయింట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు తీవ్ర రక్తస్రావం అయినట్లు ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించి కుటుంబ సభ్యులను భయపెట్టేందుకే ఈ స్ప్రే పెయింట్‌ను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
తమకంటే ముందు మరొక భారతీయుడిని కూడా అదే ఇంట్లో బంధించారని, అతడి కుటుంబం రూ. 30 లక్షలు చెల్లించిన తర్వాతే విడుదల చేశారని బాధితులు పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన సూత్రధారుల కోసం థాయ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


