CIBIL score : మంచి వడ్డీ, వేగంగా లోన్లు పొందాలా? మీ సిబిల్ స్కోర్​ని ఇలా పెంచుకోండి..

ఇల్లు, కారు లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వారికి సిబిల్ స్కోర్ అత్యంత కీలకం. తక్కువ స్కోర్ ఉంటే బ్యాంకులు రుణాలను నిరాకరించడం లేదా ఎక్కువ వడ్డీ వసూలు చేయడం చేస్తాయి. సరైన ఆర్థిక అలవాట్లతో సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవచ్చో ఈ కథనంలో చూద్దాము.

Published on: Oct 5, 2026, 05:22:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అవసరానికి బ్యాంక్ నుంచి లోన్ పొందాలన్నా, క్రెడిట్ కార్డు కావాలన్నా బ్యాంకర్లు మొదట చూసేది మీ ‘సిబిల్ స్కోర్’! మీరు తీసుకున్న అప్పులను సమయానికి తిరిగి చెల్లిస్తున్నారా లేదా అనే దానికి ఈ స్కోరే ప్రామాణికం. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు మిమ్మల్ని రిస్కీ కస్టమర్‌గా భావిస్తాయి. దీనివల్ల లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురవ్వడం లేదా అధిక వడ్డీ రేట్లకు లోన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది.

మీ సిబిల్ స్కోర్​ని ఇలా పెంచుకోండి.. (AI image)
మీ సిబిల్ స్కోర్​ని ఇలా పెంచుకోండి.. (AI image)

అయితే సిబిల్ స్కోర్ ఒక్కరోజులోనే పెరిగిపోదు. దీనికి క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లు అవసరం. ఈ నేపథ్యంలోనే మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బలోపేతం చేసుకోవడానికి పాటించాల్సిన 5 ముఖ్యమైన సూత్రాలు ఇవే:

ప్రతీ బిల్లును సమయానికి చెల్లించండి..

సిబిల్ స్కోర్ పడిపోవడానికి ప్రధాన కారణం ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులను ఆలస్యంగా చెల్లించడం. ప్రతీ నెల బిల్లులను నిర్దేశిత తేదీ కంటే ముందే చెల్లించడం అలవాటు చేసుకోవాలి. క్రెడిట్ కార్డుల విషయంలో కేవలం ‘మినిమమ్ అమౌంట్’ మాత్రమే చెల్లించి సరిపెట్టుకోకుండా, మొత్తం బిల్లును చెల్లించడం మంచిది. లోన్ కాలపరిమితిని ఎంచుకునేటప్పుడు కూడా మీ నెలవారీ ఆదాయానికి తగినట్లుగా ఈఎంఐ ఉండేలా చూసుకోవాలి.

క్రెడిట్ వినియోగాన్ని 30 శాతానికే పరిమితం చేయండి..

మీకు లభించే మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 30 శాతం కంటే ఎక్కువ వాడకపోవడం శ్రేయస్కరం. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ.1 లక్ష ఉంటే, నెలలో రూ.30,000 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. పరిమితికి మించి వాడితే మీరు అప్పులపైనే తీవ్రంగా ఆధారపడుతున్నారని బ్యాంకులు భావిస్తాయి. పరిమితిని పెంచుకోవడం ద్వారా ఈ శాతాన్ని తగ్గించుకోవచ్చు, కానీ లిమిట్ పెరిగిందని ఖర్చులు పెంచకూడదు.

పదే పదే లోన్ అప్లికేషన్లు పెట్టవద్దు..

తక్కువ సమయంలో ఎక్కువ బ్యాంకులు లేదా ఫైనాన్స్ యాప్‌లలో లోన్లు, క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయడం వల్ల మీ క్రెడిట్ ప్రొఫైల్ దెబ్బతింటుంది. మీరు ప్రతిసారి అప్లై చేసినప్పుడు బ్యాంకులు మీ సిబిల్ నివేదికను సేకరిస్తాయి. ఇది మీ స్కోర్‌ను కొంతమేర తగ్గిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే సంకేతాన్ని ఇస్తుంది కాబట్టి అనవసరమైన దరఖాస్తులకు దూరంగా ఉండాలి.

క్రెడిట్ రిపోర్టును నిశితంగా పరిశీలించండి..

ఏడాదికి కనీసం ఒకసారైనా మీ సిబిల్ నివేదికను తనిఖీ చేయడం చాలా అవసరం. కొన్నిసార్లు బ్యాంకుల పొరపాటు వల్ల లేదా మీరు చేయని లావాదేవీల వల్ల కూడా స్కోర్ తగ్గే ప్రమాదం ఉంది. మీ ఖాతాలో ఏవైనా తప్పులు ఉన్నట్లు గమనిస్తే తక్షణమే సిబిల్ సంస్థకు లేదా సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేసి సరిదిద్దుకోవాలి.

ఇతరుల రుణాలకు గ్యారెంటర్‌గా ఉండకండి..

స్నేహితులు లేదా బంధువులు తీసుకునే లోన్లకు హామీదారుగా సంతకం చేసేటప్పుడు తీవ్ర జాగ్రత్త వహించాలి. అసలు రుణం తీసుకున్న వ్యక్తి ఈఎంఐలు చెల్లించడంలో విఫలమైతే, ఆ ప్రభావం నేరుగా మీ సిబిల్ స్కోర్‌పైనే పడుతుంది. మీరు మీ సొంత బిల్లులు సమయానికి కట్టినా, ఇతరుల డిఫాల్ట్ వల్ల మీ స్కోర్ పడిపోతుంది.

సిబిల్ స్కోర్ పెరగడానికి ఎంత సమయం పడుతుంది?

గతంలో చేసిన పొరపాట్లు, చెల్లింపుల తీరును బట్టి సిబిల్ స్కోర్ మెరుగుపడటానికి సాధారణంగా 4 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఒకవేళ తీవ్రమైన లోన్ డిఫాల్ట్‌‌లు ఉంటే స్కోర్ కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు.

750 నుంచి 900 మధ్య ఉండే సిబిల్ స్కోర్‌ను అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ స్థాయి స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు ఇవ్వడమే కాకుండా, ఎక్కువ రుణం జారీ చేయడం, ప్రాసెసింగ్ వేగంగా పూర్తి చేయడం వంటి ప్రయోజనాలను కల్పిస్తాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. లోన్లు తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More