...
...
Next Story

'ఎర'గా ఐదేళ్ల చిన్నారి.. అమెరికాలో వలసదారుల వేటలో అమానవీయ ఘటన!

అమెరికాలోని మిన్నెసోటాలో వలస అధికారుల తీరు తీవ్ర దుమారం రేపుతోంది. తన తండ్రిని పట్టుకోవడానికి ఐదేళ్ల లియామ్ అనే చిన్నారిని అధికారులు ఎరగా వాడుకున్నారని, ప్రస్తుతం ఆ బాలుడిని టెక్సాస్‌లోని డిటెన్షన్ సెంటర్‌లో బంధించారని పాఠశాల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published on: Jan 23, 2026, 09:55:32 IST
Advertisement

అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత చర్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మిన్నెసోటాలోని కొలంబియా హైట్స్ సబర్బ్‌లో ప్రీ-స్కూల్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఐదేళ్ల బాలుడు లియామ్ కోనెజో రామోస్‌ను ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లాడిని పట్టుకోవడమే కాకుండా, తన తండ్రిని బయటకు రప్పించేందుకు ఆ పసివాడిని 'ఎర'గా వాడుకున్నారని పాఠశాల అధికారులు, కుటుంబ న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు.

ఐదేళ్ల పసివాడు నేరస్థుడా?

అమెరికాలో అమానవీయ ఘటన!
అమెరికాలో అమానవీయ ఘటన!

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు కారులో ఉన్న లియామ్, అతని తండ్రిని ఏజెంట్లు చుట్టుముట్టారు. "లోపల ఎవరైనా ఉన్నారో లేదో చూడటానికి ఆ పసివాడిని ఇంటి తలుపు తట్టమని అధికారులు చెప్పారు. అంటే ఒక ఐదేళ్ల బాబును వారు ఎరగా వాడుకున్నారు," అని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపర్ టెండెంట్ జెనా స్టెన్విక్ మీడియాకు వివరించారు.

ఈ కుటుంబం 2024లో అమెరికాకు వచ్చిందని, వీరికి సంబంధించిన ఆశ్రయం (ఎసైలమ్​) కేసు ఇంకా విచారణలో ఉందని, దేశం విడిచి వెళ్లాలని వీరికి ఎలాంటి ఆదేశాలు లేవని ఆమె పేర్కొన్నారు.

"ఒక ఐదేళ్ల పిల్లాడిని ఎందుకు బంధిస్తారు? వాడు అతను ప్రమాదకరమైన నేరస్థుడా?" అని ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

అధికారుల మాటలు ఇలా..

ఈ ఆరోపణలపై హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ స్పందిస్తూ.. "ఐసీఈ ఏజెంట్లు పిల్లాడిని లక్ష్యంగా చేసుకోలేదు. అక్రమంగా దేశంలో ఉన్న బాలుడి తండ్రి అడ్రియన్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లారు. అయితే అతను పిల్లాడిని వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. పిల్లాడి భద్రత కోసమే ఒక అధికారి అతని వద్ద ఉండిపోయారు," అని తెలిపారు.

‘చుట్టుపక్కల వారు బతిమాలినా వినలేదు..’

ప్రస్తుతం ఆ సెంటర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 'చిల్డ్రన్స్ రైట్స్' సంస్థ ప్రతినిధి లీసియా వెల్ష్ మాట్లాడుతూ.. "అక్కడ పిల్లలు పౌష్టికాహారం లేక, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలామంది పిల్లలు 100 రోజులకు పైగా అక్కడే బందీలుగా ఉన్నారు," అని తెలిపారు.

రాజకీయ రంగు పులుముకున్న ఘటన..

ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పందిస్తూ.. "అధికారులు పిల్లాడిని అరెస్టు చేయలేదు, కేవలం భద్రత కోసమే ఉంచారు. ఒక ఐదేళ్ల పిల్లాడిని గడ్డకట్టే చలిలో వదిలేయమంటారా? లేక అక్రమ వలసదారులను అరెస్టు చేయవద్దంటారా?" అని ప్రశ్నించారు.

ఈ పూర్తి వ్యవహారంపై డెమోక్రటిక్ నేత కమలా హారిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "లియామ్ ఒక చిన్న పసిపాప. అతడు ఇంట్లో ఉండాలి కానీ, ఇలా టెక్సాస్ డిటెన్షన్ సెంటర్‌లో కాదు. అధికారులు ఒక పిల్లాడిని ఎరగా వాడటం అత్యంత హేయమైన చర్య," అని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.

గత ఆరు వారాల్లో మిన్నెసోటాలో సుమారు 3,000 మందిని వలస అధికారులు అరెస్టు చేశారు. సంబంధి స్కూల్​లోనే వారాల వ్యవధిలో నలుగురు పిల్లలను పోలీసులు డీటైన్​ చేశారు. పాఠశాలల వద్దే అధికారులు మాటు వేస్తుండటంతో వలస కుటుంబాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. లియామ్ చదివే స్కూల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గిపోయిందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks