సైబర్ నేరగాళ్ల గుప్పిట్లో భారతీయులు.. ఆరేళ్లలో రూ. 52,976,00,00,000 హాంఫట్

గడిచిన ఆరేళ్లలో భారతీయులు సైబర్ మోసాల వల్ల ఏకంగా రూ. 52,976 కోట్లకు పైగా నష్టపోయారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తాజా గణాంకాల ప్రకారం.. పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో కేవలం 2025లోనే రూ. 19,812 కోట్లు దోచుకున్నారు.

Published on: Jan 3, 2026, 11:25:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో సైబర్ నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన ఆరేళ్ల కాలంలో వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలు, సైబర్ చీటింగ్ కేసుల వల్ల భారతీయులు ఏకంగా రూ. 52,976 కోట్ల కంటే ఎక్కువ సొమ్మును పోగొట్టుకున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' రిపోర్టు చేసిన తాజా గణాంకాలు ఈ విస్తుపోయే నిజాలను వెల్లడించాయి.

భారత్‌లో సైబర్ మోసాల గణాంకాలు..
భారత్‌లో సైబర్ మోసాల గణాంకాలు..

పెట్టుబడి ఉచ్చు, డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ స్కామ్‌లు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, సైబర్ ఫిషింగ్ వంటి నేరాలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయాయని ఈ నివేదిక హైలైట్​ చేసింది.

2025లో పరిస్థితి అత్యంత దారుణం..

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం.. కేవలం 2025 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 21,77,524 ఫిర్యాదులు అందాయి. వీటి ద్వారా ప్రజలు సుమారు రూ. 19,812.96 కోట్లు నష్టపోయారు.

నేరగాళ్లు దోచుకున్నది ఇలా (2025 గణాంకాలు)..

ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు: అత్యధికంగా 77 శాతం మంది పెట్టుబడి పథకాల పేరుతో మోసపోయారు.

డిజిటల్ అరెస్ట్: 8 శాతం మందిని ఈ కొత్త రకం భయంతో దోచుకున్నారు.

క్రెడిట్ కార్డ్ మోసాలు: 7 శాతం వాటా.

సెక్స్‌టార్షన్: 4 శాతం మంది దీని బారిన పడ్డారు.

ఈ-కామర్స్ మోసాలు: 3 శాతం వాటా.

యాప్/మాల్‌వేర్ మోసాలు: 1 శాతం మంది బాధితులు ఉన్నారు.

ఏటేటా పెరుగుతున్న నష్టాలు..

నివేదిక ప్రకారం, ఏటా బాధితుల సంఖ్యతో పాటు నష్టపోయే మొత్తం కూడా భారీగా పెరుగుతోంది!

2024: రూ. 22,849.49 కోట్లు (19.18 లక్షల ఫిర్యాదులు)

2023: రూ. 7,463.2 కోట్లు (13.10 లక్షల ఫిర్యాదులు)

2022: రూ. 2,290.23 కోట్లు (6.94 లక్షల ఫిర్యాదులు)

2021: రూ. 551.65 కోట్లు (2.62 లక్షల ఫిర్యాదులు)

2020: రూ. 8.56 కోట్లు (1.27 లక్షల ఫిర్యాదులు)

మహారాష్ట్ర టాప్.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే..

సైబర్ మోసాల వల్ల సంభవించిన నష్టంలో.. దేశంలోనే ప్రథమ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. గతేడాది అక్కడ రూ. 3,203 కోట్ల నష్టం వాటిల్లగా, 2.83 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. దీని తర్వాత కర్ణాటక రూ. 2,413 కోట్లు, తమిళనాడు రూ. 1,897 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ. 1,443 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

తెలంగాణలో గతేడాది 95,000 సైబర్ మోసం కేసులు నమోదు కాగా, సుమారు రూ. 1,372 కోట్లు ప్రజలు పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం ఆర్థిక నష్టంలో ఈ ఐదు రాష్ట్రాల వాటానే 50 శాతానికి పైగా ఉండటం గమనార్హం. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కూడా రూ. 16.74 కోట్ల మేర మోసాలు జరిగాయి.

సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సిటిజెన్​ ఫైనాన్షియల్​ సైబర్​ ఫ్రాడ్​ రిపోర్టింగ్​ అండ్​ మేనేజ్​మెంట్​ సిస్టెమ్​ రిపోర్టును ఉటంకిస్తూ.. 2025లో ప్రపంచంలో 21 కోట్ల సైబర్​ ఫ్రాండ్​ ఫిర్యాదులు నమోదయ్యాయని, వీటిల్లో దక్షిణాది దేశాల వాటానే 45శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More