ఆటోమెటిక్ కారు కొంటే సరిపోదు.. ఇలా చేస్తే ట్రాన్స్‌మిషన్ దెబ్బతింటుంది- భారీ రిపేర్ ఖర్చులు తప్పవు!
ఆటోమెటిక్ కారు కొంటే సరిపోదు! మనం తెలియకుండనే చేసే కొన్ని తప్పులు ట్రాన్స్‌మిషన్ సిస్టెమ్ని దెబ్బతీస్తాయి. రిపేర్లకు భారీగా ఖర్చు అవుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ వాహనాల గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను ఇక్కడ చూసేయండి..
నగరాల్లో నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ఇప్పుడు చాలా మంది ఆటోమెటిక్ కార్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేయడంతో పాటు ఒత్తిడిని సైతం తగ్గిస్తాయి. అయితే ఆటోమెటిక్ కారు కొనే వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టెమ్ అనేది మీ కారులోని అత్యంత సున్నితమైన వ్యవస్థల్లో ఒకటి. సరిగ్గా నిర్వహించకపోవడం లేదా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల ట్రాన్స్‌మిషన్‌కి శాశ్వత నష్టం జరిగి, భారీ ఖర్చుతో కూడిన రిపేర్లు చేయించుకోవాల్సి వస్తుంది. మీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లైఫ్ స్పాన్‌ని రహస్యంగా తగ్గిస్తున్న 8 సాధారణ పొరపాట్లు, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

ఆటోమెటిక్ కార్లను ఇలా వాడితే భారీ నష్టం తప్పదు!
1. ఓవర్‌హీటింగ్ సంకేతాలను పట్టించుకోకపోవడం..
కార్లలోని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లు సుమారు 93−95 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పనిచేసేలా తయారు అవుతాయి. ఉష్ణోగ్రత ఈ పరిమితిని దాటిన వెంటనే, ట్రాన్స్‌మిషన్ లోపల నష్టం త్వరగా ప్రారంభమవుతుంది.
పరిమితి కంటే ప్రతి 10 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల, ట్రాన్స్‌మిషన్ జీవితకాలాన్ని సగానికి తగ్గిస్తుంది! ఉష్ణోగ్రత సుమారు 150 డిగ్రీల సెల్సియస్‌కి చేరితే, దాని జీవితకాలం సాధారణ స్థాయి కంటే 32వ వంతుకు తగ్గిపోయే ప్రమాదం ఉంది!
వేడెక్కడం వల్ల ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ తన లూబ్రికేటింగ్ లక్షణాలను కోల్పోతుంది. ఇది గేర్లు, బేరింగ్‌లను దెబ్బతీసే స్టికీ వార్నిష్లా మారుతుంది. వేడి వాతావరణంలో ఎక్కువ వేగంతో ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయకుండా ఉండండి. వేడెక్కడానికి కారణమయ్యే లీక్‌లు ఏమైనా ఉంటే వెంటనే తనిఖీ చేయించండి.
2. తక్కువ ఫ్లూయిడ్‌తో నడపడం..
ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ వ్యవస్థలోని అంతర్గత భాగాలను చల్లబరచడంలో, లూబ్రికేషన్‌గా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ ఫ్లూయిడ్ స్థాయిలతో వాహనం నడపడం వల్ల ఈ భాగాలు ఒకదానితో ఒకటి రాపిడికి గురై, వేడెక్కి, తీవ్రమైన యాంత్రిక వైఫల్యానికి దారితీయవచ్చు. మీ కారు ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేసి, వాహన తయారీదారు సిఫార్సుల ప్రకారం దాన్ని నింపండి (టాప్ అప్ చేయండి).
3. ఫ్లూయిడ్ మార్పిడిని ఆలస్యం చేయడం..
పాత ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ హీట్- ఫ్రిక్షన్ నుంచి లోపలి భాగాలను రక్షించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫ్లూయిడ్ మార్పిడిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలు వస్తాయి:
- సీల్స్, గాస్కెట్లు దెబ్బతినడం.
- గేర్లు జారిపోవడం (స్లిప్పింగ్ గేర్స్) , షిఫ్టింగ్‌లో ఆలస్యం జరగడం.
- అంతర్గత భాగాలలో అధిక అరుగుదల, వేడెక్కడం.
సాధారణంగా, మీ కారు ఓనర్ మాన్యువల్‌లో సూచించిన షెడ్యూల్ ప్రకారం, అంటే ప్రతి 40,000 నుంచి 60,000 కి.మీలకు ఫ్లూయిడ్‌ను మార్చడం మంచిది!
4. తప్పుడు ఫ్లూయిడ్ రకాన్ని ఉపయోగించడం..
ప్రతి ట్రాన్స్‌మిషన్ ఒక నిర్దిష్ట రకం ఫ్లూయిడ్ కోసం తయారువుతుంది. తప్పు రకం లేదా వేరే ఫ్లూయిడ్‌ను కలిపి ఉపయోగించడం వల్ల అంతర్గత సీల్స్, క్లచ్‌లు దెబ్బతింటాయి. ఇది గేర్ షిఫ్టింగ్‌లో అవాంతరాలకు లేదా మొత్తం సిస్టమ్ వైఫల్యానికి దారితీయవచ్చు. ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్‌ను నింపే లేదా మార్చే ముందు ఎల్లప్పుడూ ఓనర్ మాన్యువల్‌ను చూడటం తప్పనిసరి.
5. సిగ్నల్ దగ్గర పదేపదే స్పీడ్ పెంచడం..
పదేపదే గట్టిగా యాక్సిలరేట్ చేయడం లేదా వేగంగా బ్రేకులు వేసి, 'జాక్‌రాబిట్ స్టార్ట్స్' లాగా బయలుదేరడం వల్ల టార్క్ కన్వర్టర్‌లో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ అదనపు వేడి ట్రాన్స్‌మిషన్‌ను ఉష్ణోగ్రత పరిమితులను దాటిపోయేలా చేసి, లోపలి భాగాలను దెబ్బతీస్తుంది. మీ కారు అధిక-పనితీరు కోసం రూపొందించకపోతే, తరచుగా ఇలాంటి వేగవంతమైన ప్రారంభాలను మానుకోవడం ఉత్తమం.
6. పూర్తిగా ఆగకుండా గేర్లు మార్చడం..
కారును పూర్తిగా ఆపకుండా రివర్స్ నుంచి డ్రైవ్‌కు లేదా దీనికి విరుద్ధంగా మార్చడం వల్ల ట్రాన్స్‌మిషన్‌పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. కారు కదలిక శక్తిని గ్రహించడానికి ఈ వ్యవస్థ రూపొందించలేదు. కాలక్రమేణా.. ఈ అలవాటు క్లచ్‌లు, బ్యాండ్‌లు, గేర్‌సెట్‌లను త్వరగా పాడు చేస్తుంది.
7. హ్యాండ్‌బ్రేక్‌ను నిర్లక్ష్యం చేయడం..
హ్యాండ్‌బ్రేక్ (పార్కింగ్ బ్రేక్) వేయకుండా కారును కేవలం ‘పార్క్’లో ఉంచడం వల్ల మొత్తం భారం ట్రాన్స్‌మిషన్ లోపల ఉండే పార్కింగ్ పావల్ అనే చిన్న పిన్‌పై పడుతుంది. పక్కన ఉన్న కారు కొంచెం తగిలినా ఈ పిన్ విరిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మీ వాహనం రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాలక్రమేణా, ఈ పద్ధతి అంతర్గత లింకేజ్‌లను కూడా పాడు చేస్తుంది. దీన్ని నివారించడానికి, ముఖ్యంగా వాలుగా లేదా ఎత్తుపల్లాలుగా ఉన్న ప్రదేశాలలో, ముందుగా హ్యాండ్‌బ్రేక్ వేసి, ఆ తర్వాతే గేర్‌ను 'పార్క్' మోడ్‌లోకి మార్చండి.
8. సక్రమంగా టోయింగ్ చేయకపోవడం- డ్రైవ్‌ట్రైన్ దుర్వినియోగం..
ఫ్రెంట్ వీల్ డ్రైవ్ కారును దాని ముందు చక్రాలు నేలపై ఉంచి లాగడం వంటి తప్పు పద్ధతుల్లో టోయింగ్, చేయడం వల్ల తీవ్రమైన అంతర్గత నష్టం జరగవచ్చు. అదేవిధంగా, బురదలో లేదా మంచులో చిక్కుకున్న కారును రివర్స్, డ్రైవ్ మధ్య త్వరత్వరగా మార్చడం ద్వారా బయటకు తీయడానికి ప్రయత్నించడం (రాక్ చేయడం) ట్రాన్స్‌మిషన్‌ను వేడెక్కించి, క్లచ్‌లను పాడు చేస్తుంది. తయారీదారు అందించిన టోయింగ్ మార్గదర్శకాలను పాటించడం అత్యంత సురక్షితమైన పద్ధతి.

E-Paper












