8th Pay Commission : 'కనీస వేతనం రూ. 72వేలు ఉండాలి'- 8వ వేతన సంఘం ముందు భారీ డిమాండ్!
8వ కేంద్ర వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస నెలవారీ వేతనాన్ని రూ.72,000కు పెంచాలని భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (బీపీఎంఎస్) ప్రతిపాదించింది. ఇది సమూచితమేనని వ్యాఖ్యానించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో భారీ వేతన పెంపుపై చర్చ జోరందుకుంది. రక్షణ శాఖ ఉద్యోగుల సమాఖ్య అయిన 'భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్' (బీపీఎంఎస్).. 8వ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) సిఫార్సుల కోసం ఒక అత్యంత కీలకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఉన్న కనీస వేతనం రూ.18,000ను, ఏకంగా రూ.72,000కు పెంచాలని ఈ ఫెడరేషన్ సిఫార్సు చేసింది. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే, ప్రస్తుత బేసిక్ పేతో పోలిస్తే ఏకంగా 300 శాతం మేర భారీ పెంపు లభించినట్లవుతుంది!

గత ఏప్రిల్ 16న ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్‌ను అధికారికంగా విడుదల చేసినట్లు బీపీఎంఎస్ జనరల్ సెక్రటరీ రవీంద్ర కుమార్ మిశ్రా వెల్లడించారు. కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వార్షిక ఇంక్రిమెంట్లు, కొత్త పే మ్యాట్రిక్స్ వంటి సమగ్ర అంశాలను ఈ ప్రతిపాదనలో స్పష్టంగా పొందుపరిచినట్టు వివరించారు..
మూడంచెల శాస్త్రీయ ఫార్ములా ఆధారంగా ప్రతిపాదన..
వేతన సవరణను జాతీయ తలసరి ఆదాయ వృద్ధితో అనుసంధానిస్తూ, కుటుంబ సభ్యుల బాధ్యతలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రతిపాదన రూపొందించారు. ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా, అదే సమయంలో సామాజికంగా ఉద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా ఈ ఫార్ములాను రూపొందించినట్లు సమాఖ్య వివరించింది.
1. జాతీయ ఆదాయంతో వేతన అనుసంధానం..
గతంలో 5వ వేతన సంఘం అనుసరించిన శాస్త్రీయ పద్ధతిని ఇక్కడ ప్రాతిపదికగా తీసుకున్నారు. గణాంక- కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్పీఐ) అందించిన డేటా ప్రకారం, ప్రస్తుత ధరల వద్ద తలసరి నికర జాతీయ ఆదాయం 2016-17లో రూ.1,03,219 ఉండగా, 2024-25 నాటికి అది రూ.1,92,774కు పెరిగింది. అంటే ఈ కాలంలో సుమారు 86.76 శాతం వృద్ధి నమోదైంది. ఈ 86.76 శాతం వృద్ధిని ప్రస్తుత కనీస వేతనానికి అన్వయించి సవరించిన కనీస వేతనాన్ని రూ.53,114.54గా లెక్కగట్టారు.
దీనిని మరింత సరళంగా చెప్పాలంటే:
బేసిక్ పే: రూ.18,000
58 శాతం కరువు భత్యం (డీఏ): రూ.10,440
సబ్‌టోటల్: రూ.28,440
86.76 శాతం వృద్ధి ప్రకారం పెంపు: రూ.24,674.54
సవరించిన కనీస వేతనం: రూ.53,114.54
2. కుటుంబ సభ్యుల యూనిట్ల సంఖ్య పెంపు..
గతంలో 7వ వేతన సంఘం కనీస వేతన లెక్కల కోసం కేవలం 3 యూనిట్ల కుటుంబ నిర్మాణాన్ని (భార్యాభర్తలు, పిల్లలు) మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంది. అయితే.. "ఇది ప్రస్తుత భారతీయ సామాజిక-సాంస్కృతిక వాతావరణాన్ని ప్రతిబింబించడం లేదు" అని బీపీఎంఎస్ వాదించింది. ఎందుకంటే మన దేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, పిల్లలతో పాటు వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలను కూడా మోయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో కుటుంబ యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5కి పెంచాలని ప్రతిపాదించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగి 1 యూనిట్, భార్య/భర్త 1 యూనిట్, ఇద్దరు పిల్లలు 1.5 యూనిట్లు (ఒక్కొక్కరికి 0.75 చొప్పున), తల్లిదండ్రులు 1.5 యూనిట్లు (ఒక్కొక్కరికి 0.75 చొప్పున)గా నిర్ణయించారు. ఈ మార్పుతో సవరించిన కనీస వేతనం రూ.88,524.24 అవుతుందని లెక్కగట్టారు.
3. ఆర్థిక విచక్షణ..
గణించిన మొత్తం రూ.88,524.24 వరకు డిమాండ్ చేస్తే అది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర భారం మోపుతుందని సమాఖ్య గ్రహించింది. అందుకే మరింత సమతుల్యమైన మొత్తాన్ని సూచించింది. "పూర్తిగా లెక్కించిన మొత్తానికి బదులుగా ప్రత్యామ్నాయంగా రూ.72,000 నెలవారీ వేతనాన్ని పరిశీలించడం సముచితం" అని బీపీఎంఎస్ పేర్కొంది.
ఈ మొత్తం ద్వారా ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని బీపీఎంఎస్ స్పష్టం చేసింది. అవి..
- ద్రవ్యోల్బణ భారం నుంచి సార్థకమైన ఉపశమనం లభిస్తుంది.
- ప్రభుత్వ ఆర్థిక ఆస్తులపై అతిపెద్ద భారం పడకుండా జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.
- ప్రభుత్వ దీర్ఘకాలిక ఆర్థిక ఏకీకరణ లక్ష్యాలకు ఎలాంటి విఘాతం కలగదు.
మొత్తం మీద, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ఈ ప్రతిపాదన ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


