ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.
8వ వేతన సంఘం.. 73 అంశాలతో ఉద్యోగ సంఘాల డిమాండ్ల పత్రం
8వ కేంద్ర వేతన సంఘం ముందు ఉద్యోగ సంఘాలు 73 డిమాండ్లను ఉంచాయి. 6 శాతం వార్షిక ఇంక్రిమెంట్, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, 45 రోజుల పితృత్వ సెలవు, బీమా పెంపు వంటి కీలక ప్రతిపాదనలను భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ సమర్పించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, భత్యాలు, సెలవులు, పదోన్నతులపై 8వ కేంద్ర వేతన సంఘం త్వరలో పరిశీలన జరపనుంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు అనేక ప్రతిపాదనలను సంఘం ముందు ఉంచుతున్నాయి. ఇందులో భాగంగా భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (బీపీఎంఎస్) తాజాగా 73 ప్రతిపాదనలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని అందజేసింది. ఉద్యోగుల ఆర్థిక, సర్వీసు ప్రయోజనాలను మెరుగుపరచాలని ఈ నివేదికలో కోరింది.

2026 నవంబర్ 18 తేదీన ఇచ్చిన ఈ వినతిపత్రంలో వార్షిక ఇంక్రిమెంట్‌ను 3 శాతం నుంచి 6 శాతానికి పెంచాలని బీపీఎంఎస్ కోరింది. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ, 45 రోజుల పితృత్వ సెలవు, 30 ఏళ్ల సర్వీసులో కనీసం ఐదు ఆర్థిక ఉన్నతీకరణలు (ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్లు) కల్పించాలని ప్రతిపాదించింది.
బీమా కవరేజీ పెంపు, మెరుగైన వైద్య సదుపాయాలు, మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు, పదోన్నతుల విధానంలో మార్పులను కూడా ఈ నివేదికలో చేర్చారు. వీటిలో కొన్ని డిమాండ్లు పౌర రక్షణ ఉద్యోగులకు సంబంధించినవి కాగా, మరికొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సర్వీసు నిబంధనల్లో విస్తృత మార్పుల కోసం చేసినవి.
వేతనాలు, పెన్షన్లపై బీపీఎంఎస్ డిమాండ్లు ఇవీ..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్‌ను ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి బేసిక్ పేలో 6 శాతానికి రెట్టింపు చేయాలన్నది ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటి. సర్వీసు కాలంలో ఉద్యోగుల ఆదాయం పెరగడానికి, పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకోవడానికి ఎక్కువ ఇంక్రిమెంట్ ఉపయోగపడుతుందని బీపీఎంఎస్ వాదించింది.
సవరించిన వేతన, పెన్షన్ నిర్మాణాలను ఖరారు చేసే ముందే, ప్రస్తుతం ఉన్న కరువు భత్యంలో (డీఏ) 50 శాతాన్ని బేసిక్ పే, పెన్షన్‌తో కలపాలని కూడా ఈ సమాఖ్య కోరింది. కనీస వేతనం విషయంలో నిత్యావసర సరుకుల ప్రస్తుత మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుంటూ, వాస్తవ కుటుంబ వినియోగ అవసరాలు, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిబంధనలు, ఆక్రోయిడ్ ఫార్ములాను ఉపయోగించాలని సిఫార్సు చేసింది.
కొత్త వేతన సంఘం కింద ఉన్న బేసిక్ పేను ఎలా సవరిస్తారనేది నిర్ణయించే 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్'పై కూడా కీలక డిమాండ్ చేసింది. ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేయడానికి తగిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను నిర్ణయించాలని, అత్యధిక వేతనం, అత్యల్ప వేతనాల మధ్య నిష్పత్తి 1:10 మించకుండా చూడాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లను నిలిపివేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.
బోనస్, బీమా, పీఎఫ్ ప్రయోజనాల పెంపు
ఉద్యోగుల చేతికి అందే ప్రయోజనాలు, ఆర్థిక భద్రతపై ప్రభావం చూపేలా బోనస్, బీమా నిబంధనల్లో మార్పులను ఈ నివేదిక ప్రతిపాదించింది. ఎవరినీ మినహాయించకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అడ్-హాక్ బోనస్, ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) వర్తింపజేయాలని బీపీఎంఎస్ కోరింది. సంబంధిత పే లెవెల్ కనీస వేతనం ఆధారంగా బోనస్‌ను లెక్కించాలని, కనీస అర్హత 30 రోజుల వేతనం ప్లస్ డీఏకు సమానంగా ఉండాలని సూచించింది.
ఉద్యోగుల బీమా విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (సీజీఈజీఐఎస్) కింద కవరేజీని రూ.30,000 నుంచి కనీసం రూ.15 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. మరణించిన ఉద్యోగి కుటుంబానికి మరింత ఆర్థిక రక్షణ కల్పించేందుకు డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని రూ.10 లక్షలకు పెంచాలని విడిగా ప్రతిపాదించింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)పై వడ్డీ రేటు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)కు వర్తించే రేటు కంటే తక్కువగా ఉండకూడదని కూడా కోరింది.
సెలవులు, వైద్య సదుపాయాలపై ప్రతిపాదనలు
ఉద్యోగుల పని-జీవిత సమతూకం, సంక్షేమానికి సంబంధించి పలు ప్రతిపాదనలను ఇందులో పొందుపరిచారు. పితృత్వ సెలవును 45 రోజులకు పెంచాలని, పిల్లలను దత్తత తీసుకునే సందర్భాల్లోనూ ఈ ప్రయోజనం వర్తింపజేయాలని బీపీఎంఎస్ కోరింది. నిర్దేశిత షరతులకు లోబడి పూర్తి వేతనంతో గరిష్ఠంగా రెండేళ్ల పాటు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదించింది.
ఏడాదికి సాధారణ సెలవులను (క్యాజువల్ లీవ్) 12 రోజులకు పెంచడం, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వడం వంటి డిమాండ్లు కూడా ఇందులో ఉన్నాయి. అర్హత కలిగిన ప్రతి లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) సందర్భంగా 20 రోజుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కల్పించాలని, కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రవేశపెట్టిన ఎల్టీసీ స్పెషల్ క్యాష్ ప్యాకేజీని మళ్లీ తీసుకురావాలని కోరింది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయి వరకు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ (సీఈఏ)ను విస్తరించాలని మరో ప్రతిపాదన చేసింది.
వైద్య సదుపాయాల విషయంలో సమానమైన ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేని ఉద్యోగులు, పెన్షనర్లకు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ పెంచాలని బీపీఎంఎస్ కోరింది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్)కు ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూర్చాలని, ఉద్యోగులు, పెన్షనర్లు చెల్లించే చందాలను తొలగించాలని కోరింది. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే ఉద్యోగులకు రిస్క్ అలవెన్స్‌ను నెలకు గరిష్ఠంగా రూ.10,000 వరకు పెంచాలని ప్రతిపాదించింది. అధికారిక విధుల్లో ఉండగా ప్రమాదాల్లో మరణించే ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పరిహారాన్ని రూ.1 కోటికి పెంచాలని కూడా డిమాండ్ చేసింది.
పదోన్నతుల నిబంధనలు
కెరీర్ పురోగతి అనేది ఈ నివేదికలోని మరో ప్రధాన అంశం. ప్రస్తుతం ఉన్న ఖాళీల ఆధారిత పదోన్నతుల విధానం స్థానంలో 'డైనమిక్ ప్రమోషన్ స్కీమ్'ను తీసుకురావాలని బీపీఎంఎస్ ప్రతిపాదించింది. దీని ద్వారా ఉద్యోగి సర్వీసు కాలం, ప్రతిభ, సామర్థ్యం, అనుభవంతో కెరీర్ పురోగతిని అనుసంధానం చేయాలని కోరింది.
మాడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (ఎంఏసీపీ) పథకం కింద 30 ఏళ్ల సర్వీసు కాలంలో కనీసం ఐదుసార్లు ఆర్థిక ఎదుగుదల కల్పించాలని డిమాండ్ చేసింది. పరిమిత ఖాళీల వల్ల క్రమబద్ధమైన పదోన్నతులు పొందని ఉద్యోగుల్లో కెరీర్ స్తబ్దతను తొలగించడమే దీని లక్ష్యం. ఫీడర్ పోస్టు, పదోన్నతి పోస్టు మధ్య నిరీక్షణ కాలాన్ని ఐదేళ్లకు పరిమితం చేయాలని ప్రతిపాదించింది.
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) కోసం లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ సిబ్బంది, స్టెనోగ్రాఫర్, రాజ్‌భాషా కేడర్లలో పదోన్నతి ఖాళీల్లో 50 శాతం అర్హులైన ఉద్యోగులకు రిజర్వ్ చేయాలని కోరింది. టెక్నికల్ వర్క్‌షాప్ సిబ్బంది, ఫార్మసిస్టులు, మెడికల్ సపోర్ట్ సిబ్బందికి మెరుగైన పే స్కేళ్లు, ఫైర్-ఇంజిన్ డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బందికి మెరుగైన కెరీర్ పురోగతి వంటి రక్షణ రంగానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఇందులో చేర్చారు.
ఈ డిమాండ్లు అమలవుతాయా?
8వ వేతన సంఘం తన సిఫార్సులను ఖరారు చేసే ముందు ఉద్యోగ సంఘాలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించాల్సి ఉంటుంది. రక్షణ సిబ్బంది సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, పెన్షన్లు, ఇతర సర్వీసు నిబంధనలు ఈ సంఘం పరిధిలోకి వస్తాయి. దేశ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక క్రమశిక్షణ, సిఫార్సుల ఆర్థిక ప్రభావాలను కూడా సంఘం పరిగణనలోకి తీసుకోవాలి.
వేతనాలు, పెన్షన్లు, భత్యాలు లేదా సర్వీసు ప్రయోజనాల్లో ఏ మార్పు చేయాలన్నా ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. అందువల్ల ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో బీపీఎంఎస్ నివేదిక అనేది 8వ వేతన సంఘం నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలను సూచిస్తుంది. అయితే ఈ 73 ప్రతిపాదనలు కేవలం డిమాండ్లు మాత్రమే.. ఖరారైన మార్పులు కావు.

E-Paper
