8th Pay Commission : బేసిక్​ పేలో డీఏని విలీనం చేస్తారా? ప్రభుత్వ స్పందన ఇది..

8th Pay Commission : బేసిక్​ పేలో డీఏని విలీనం చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై పార్లమెంట్​ వేదికగా ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏవీ లేవని స్పషటం చేసింది.

Published on: Dec 2, 2025, 10:00:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (డీఏ- డియర్​నెస్​ అలొవెన్స్​) లేదా అందులోని ఏ భాగాన్ని కూడా వారి మూల వేతనం (బేసిక్​ పే)లో విలీనం చేసే ప్రణాళికను ప్రస్తుతం పరిశీలించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​ వేదికగా స్పష్టం చేసింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఒక ప్రశ్నకు ఈ మేరకు స్పందించింది.

బేసిక్​ పేలో డీఏని విలీనంపై ప్రభుత్వ స్పందన.. (Sansad TV/ANI Video Grab)
బేసిక్​ పేలో డీఏని విలీనంపై ప్రభుత్వ స్పందన.. (Sansad TV/ANI Video Grab)

8వ వేతన సంఘం విధివిధానాలను (టీఓఆర్​- టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ ప్రభుత్వం జారీ చేసిన కొద్ది రోజులకే ఈ వివరణ కూడా వచ్చింది.

"ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని మూల వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు," అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో శీతాకాల సమావేశాల సందర్భంగా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

"జీవన వ్యయాన్ని సర్దుబాటు చేయడానికి, ద్రవ్యోల్బణం కారణంగా అసలు విలువలో కోత పడకుండా మూల వేతనం/పెన్షన్‌ను రక్షించడానికి, ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ/డీఆర్ రేట్లను సవరిస్తారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో విడుదల చేసే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా ఈ సవరణ జరుగుతుంది," అని ఆ సమాధానంలో పంకజ్​ చౌదరి పేర్కొన్నారు.

ఉద్యోగుల డిమాండ్లు, 8వ వేతన సంఘం స్థితి..

ఇటీవలి కాలంలో, అనేక ఉద్యోగుల సంఘాలు 50 శాతం డీఏను తక్షణమే మూల వేతనంలో విలీనం చేయాలని కేంద్రాన్ని కోరాయి! 8వ వేతన సంఘం 2027 తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఉన్నందున, డీఏను త్వరగా మూల వేతనంలో విలీనం చేయడం ద్వారా ప్రాథమిక జీతం పెరుగుతుందని, భవిష్యత్తులో డీఏ లెక్కలు సవరించిన మొత్తంపై జరుగుతాయని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.

దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించనున్న 8వ వేతన సంఘం విధివిధానాలకు (టీఓఆర్​) కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 29న ఆమోదం తెలిపింది.

ఈ కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహించనున్నారు.

ఈ 8వ వేతన సంఘం 18 నెలల్లో తన సిఫార్సులను సమర్పించనుందని, ఇది జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గత మీడియా సమావేశంలో తెలిపారు.

8వ వేతన సంఘం- కేంద్ర ఉద్యోగుల జీతాలు ఎంత పెరగవచ్చు?

కొత్త వేతన నిర్మాణంలో జీతాలు, పెన్షన్లు ఎంత లెక్కిస్తారు? అనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్​ నిర్ణయిస్తుంది. 8వ వేతన సంఘంలో అత్యంత చర్చనీయాంశమయ్యేది ఇదే.

7వ వేతన సంఘంలో (2016లో అమలు): అప్పుడు 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఉద్యోగులకు 157% పెరుగుదల లభించింది.

కనీస మూల వేతనం రూ. 7,000 నుంచి రూ. 18,000కి పెరిగింది.

ఒకవేళ అదే 2.57 ఫ్యాక్టర్‌ను తిరిగి ఇప్పుడు కూడా వర్తింపజేస్తే:

కనీస వేతనం రూ. 18,000 నుంచి ఏకంగా రూ. 46,260కి పెరగవచ్చు.

కనీస పెన్షన్ రూ. 9,000 నుంచి రూ. 23,130కి పెరగవచ్చు.

అయితే, ఈ పెరుగుదల వాస్తవానికి చాలా ఎక్కువ అవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ, కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92కి దగ్గరగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అప్పుడు కనీస మూల వేతనం రూ. 34,560కి చేరుకుంటుందని అంచనా. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More