CJP protest : పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే, ఇతర సీజేపీ సభ్యులు- విమానంలోనే..
దిల్లీ నిరసనల వేళ సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు దిల్లీవ్యాప్తంగా హైఅలర్ట్ నడుస్తోంది. దేశ రాజధాని ఆంక్షల వలయంలోకి జారుకుంది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) శనివారం తలపెట్టిన నిరసనల వేళ దేశ రాజధాని దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనల్లో పాల్గొనేందుకు దిల్లీ వచ్చిన సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే, విమానం లోపలికి వెళ్లిన మహిళా పోలీసులు.. దీప్కేని డీటైన్ చేస్తున్నట్టు తెలిపారు.

ఈ పూర్తి వ్యవహారాన్ని అభిజీత్ దీప్కే తన కెమెరాలో రికార్డు చేశారు. ‘కనీసం బయటకు వచ్చేంత వరకు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారు?’ అని పోలీసులను దీప్కే ప్రశ్నించడం వీడియోలో వినిపిస్తోంది.
వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. “నేను అరెస్ట్ అవ్వడానికే ఇక్కడికి వచ్చాను. మీకు నేను బయపడను. నన్ను అరెస్ట్ చేయండి,” అని దీప్కే చెబుతుండగా.. ‘ఇది అరెస్ట్ కాదు, దయచేసి సహకరించండి,’ అని మహిళా పోలీసులు ఆయన్ని అభ్యర్థించారు.
కాగా దీప్కేతో పాటు మరో ఇద్దరు సీజేపీ ప్రతినిథులను సైతం పోలీసులు విమానంలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు గుర్తింపు తెచ్చుకున్న అనేకమంది సీజేపీ సభ్యులందరూ ఇప్పటికే డిటెన్షన్‌లోనే ఉన్నట్టు సమాచారం.
దిల్లీ నిరసనల్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని గురుగ్రామ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న కొద్ది గంటలకే ఈ ఘటన చోటుచేసుకుంది.
ధ్రువ్ రాఠీ డిటెన్షన్ని సీజేపీ ఖండించింది. “శాంతియుత నిరసనలతో కూడా నియంత భయపడుతున్నారు,” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పరోక్షంగా విమర్శించింది.
దిగ్భంధనంలో దేశ రాజధాని..
ఈ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించడమే కాకుండా, నగరంలో ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా దిల్లీని ఉక్కు పిడికిట్లోకి తీసుకున్నారు! శనివారం ఉదయం నుంచే జంతర్ మంతర్ పరిసరాలు, కన్నాట్ ప్లేస్, పటేల్ చౌక్ మార్గాలు ఖాకీమయంగా మారిపోయాయి. మైకుల్లో హెచ్చరికలు చెబుతూ, కిలోమీటర్ల మేర బహుళ అంచెల బారికేడ్లు, కవాతు చేస్తున్న సైనిక బలగాలతో సెంట్రల్ దిల్లీ ఒక మిలిటరీ జోన్‌ను తలపిస్తోంది.
పటేల్ చౌక్ వద్ద పారామిలటరీ పహారా..
ప్రశాంతంగా ఉండే జంతర్ మంతర్ నిరసన ప్రాంతం చుట్టూ భారీ భద్రతా వలయాన్ని పోలీసులు నిర్మించారు. పటేల్ చౌక్ రౌండ్ ఎబౌట్ వద్ద వందలాది మంది పోలీసులు నిరంతరం ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆకుపచ్చ, ఖాకీ యూనిఫాంలలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలు భుజాన భారీ ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కవాతు నిర్వహించాయి. జంతర్ మంతర్‌ను ఆనుకుని ఉన్న పార్లమెంట్ స్ట్రీట్, అశోకా రోడ్‌లు పోలీస్ వాహనాలు, మీడియా వ్యాన్‌లతో కిక్కిరిసిపోయాయి.
"భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. ఎవరూ ఒకచోట గుమిగూడకూడదు," అంటూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని మైకుల నుంచి నిరంతరం ప్రకటనలు చేస్తున్నారు. ఎన్‌డీఎంసీ పాలికా కేంద్ర ముందు అత్యంత కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు. కన్నాట్ ప్లేస్, టాల్‌స్టాయ్ మార్గ్ వైపు వెళ్లే సంసద్ మార్గ్‌ను ఐరన్ బారికేడ్లతో పూర్తిగా మూసివేశారు.
పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాల ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు కూడా పోలీసులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. బాటసారులు, ఉద్యోగులు తమ గుర్తింపు కార్డులను చూపిస్తేనే లోపలికి అనుమతిస్తున్నారు. నిరసనకారులు ఎవరైనా వస్తే వెంటనే వెనక్కి పంపిస్తున్నారు.
పోలీసులకు బాడీ కెమెరాలు.. పింక్ ఫోర్స్ మోహరింపు!
గత నిరసనల సమయంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈసారి దిల్లీ పోలీసులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్న అనేకమంది పోలీస్ సిబ్బందికి బాడీ కెమెరాలను విధిగా తొడిగారు. అవాంఛనీయ సంఘటనలను ప్రత్యక్షంగా రికార్డు చేయడానికి, ఆరోపణలను తిప్పికొట్టడానికి ఈ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. అలాగే మహిళా నిరసనకారుల రక్షణ, అదుపు కోసం ప్రత్యేకంగా 'దిల్లీ పోలీస్ పింక్ ఫోర్స్' బలగాలను నిరసన ప్రాంతాల వద్ద భారీగా మోహరించారు. లాఠీలు, హెల్మెట్లు, ప్రొటెక్టివ్ గేర్‌తో పోలీసులు సర్వసన్నాహకంగా ఉన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


