పాకిస్థాన్ చేతుల్లో ఓడిపోయాక అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్నారు: ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

పాకిస్థాన్ చేతిలో ఓ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ అభిమానులు ఎలా ఆత్మహత్యలకు పాల్పడ్డారో ఆ దేశ క్రికెటర్ వెల్లడించాడు. రెహ్మనుల్లా గుర్బాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆ రెండు దేశాల మధ్య శతృత్వం ఏ స్థాయిలో ఉందో కూడా తెలియజేస్తుంది.

Published on: Mar 23, 2026, 21:27:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్నేళ్లుగా క్రికెట్ మైదానంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న పోరు మామూలుగా ఉండట్లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఆటగాళ్ల మధ్య గట్టిగానే ఆవేశాలు, మాటల యుద్ధాలు కనిపిస్తున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత ఆఫ్ఘన్ ఆటగాళ్ల ముఖాల్లో కనిపించిన ఆనందాన్ని అభిమానులు ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. కానీ ఆ భారీ సక్సెస్ చూడటానికి ముందు వాళ్లు చాలాసార్లు తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారు. అందులో వాళ్లను బాగా కుంగదీసిన సంఘటన మాత్రం 2022 ఆసియా కప్‌లో జరిగింది. షార్జా గ్రౌండ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లోకి వచ్చిన విజయాన్ని పాకిస్థాన్ చివర్లో లాగేసుకుంది.

పాకిస్థాన్ చేతుల్లో ఓడిపోయాక అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్నారు: ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ (AP )
పాకిస్థాన్ చేతుల్లో ఓడిపోయాక అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్నారు: ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ (AP )

ఆఖరి ఓవర్‌లో గుండె పగిలే ఓటమి..

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ ఆ మ్యాచ్‌లో తమ జట్టు ఎలా ఓడిపోయిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. ఆఖరి ఓవర్‌లో పాకిస్థాన్ గెలవడానికి 11 పరుగులు కావాలి.. వాళ్ల చేతిలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ గెలుపు ఖాయం అనుకున్న తరుణంలో నసీమ్ షా ఫరూఖీ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతులకు రెండు భారీ సిక్సర్లు కొట్టి పాకిస్థాన్‌కు ఊహించని విజయాన్ని అందించాడు. ఆ ఓటమి తర్వాత ఆఫ్ఘన్ ఆటగాళ్లు మైదానంలోనే తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు.

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత, ఆ ఓటమి తమను ఎంతలా కలచివేసిందో గుర్భాజ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. ఆ ఓటమిని తట్టుకోలేక తమ దేశంలో కొంతమంది అభిమానులు ఆత్మహత్య కూడా చేసుకున్నారని చెప్పి అందరినీ షాక్‌కు గురిచేశాడు.

అభిమానుల కోసమే మా ఆరాటం..

"నాకు తెలిసి ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడం అత్యంత బాధాకరం. మా దేశంలో జనాలు చాలా బాధపడ్డారు. చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ బాధను దిగమింగుకోలేక ఇక్కడ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మా వాళ్లు చాలా ఎమోషనల్. వాళ్ల కోసం ఆడుతున్నప్పుడు మేం కూడా ఓడిపోతే అదే స్థాయిలో బాధపడతాం" అని శుభంకర్ మిశ్రాతో మాట్లాడుతూ గుర్భాజ్ చెప్పుకొచ్చాడు.

"ఆ మ్యాచ్ గురించి నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా, ఆ చేదు జ్ఞాపకాలు నా కళ్ల ముందు కదులుతున్నాయి. షార్జా స్టేడియంలో అడుగుపెట్టిన ప్రతిసారీ ఆ బాధాకరమైన ఓటమి గుర్తొస్తుంది. మనం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఎలా ఓడిపోయామా అని ఇప్పటికీ ఆలోచిస్తుంటాను. ఆరోజు మేం బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు కానీ, బౌలింగ్ మాత్రం అద్భుతంగా చేశాం. అయినా సరే దురదృష్టవశాత్తూ ఓడిపోయాం" అని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ మ్యాచ్ విషయానికి వస్తే, మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఒకానొక దశలో పాకిస్థాన్ 110 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ చివర్లో ఆసిఫ్ అలీ, నసీమ్ షా మెరుపులు మెరిపించి వాళ్ల జట్టును గట్టెక్కించారు.ఆ

శతృత్వం వెనుక అసలు కారణం ఏంటి?

పాకిస్థాన్ ఆటగాళ్లపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం, ద్వేషం లేవని, కానీ ఆఫ్ఘన్ అభిమానులకు పాకిస్థాన్‌పై గెలవడం అంటే చాలా ప్రత్యేకమని గుర్భాజ్ చెప్పాడు.

"మేం క్రికెటర్లం. మా దేశ ప్రజల కోసం ఆడుతున్నాం. వాళ్ల సంతోషంలోనే మా ఆనందం ఉంది. ఇక్కడ ఎవరిని అడిగినా 2023 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయమే తమకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెబుతారు. ఒక క్రికెటర్‌గా నాకు ఎవరిపైనా పర్సనల్ గా ఎలాంటి పగ లేదు. కానీ పాకిస్థాన్‌ను మనం ఎప్పుడూ ఓడించాలని మా అభిమానులు కోరుకుంటారు, వాళ్ళ కోసమే మా పోరాటం" అని గుర్భాజ్ ముగించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More