Pakistan Afghanistan War : తాలిబన్ ప్రభుత్వంపై 'యుద్ధం' ప్రకటించిన పాకిస్థాన్!
పాకిస్థాన్- అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తాలిబన్ దళాలు పాక్ సరిహద్దు పోస్టులపై దాడి చేయడంతో, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ "మా ఓపిక నశించింది, ఇక మీతో బహిరంగ యుద్ధమే" అని హెచ్చరించారు.
పాకిస్థాన్- అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల సరిహద్దు దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. "మా సహనం నశించింది. ఇక మాకు, మీకు మధ్య బహిరంగ యుద్ధం మొదలైంది," అని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్- అఫ్ఘానిస్థాన్ యుద్ధం : ఆపరేషన్ గజబ్-లిల్-హక్..
పాక్ సమాచార మంత్రి అట్టావుల్లా తరార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అఫ్ఘాన్ దళాల కాల్పులకు సమాధానంగా పాక్ సైన్యం 'ఆపరేషన్ గజబ్-లిల్-హక్' ప్రారంభించింది. ఈ దాడుల్లో భాగంగా అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌తో పాటు కాందహార్, పక్తియా ప్రావిన్సుల్లోని తాలిబన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి.
కాబూల్‌లోని రెండు బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు, కాందహార్‌లోని ఒక కోర్ హెడ్ క్వార్టర్స్, ఒక మందుగుండు డిపో, ఒక లాజిస్టిక్స్ బేస్‌ను ధ్వంసం చేసినట్లు పాక్ అధికారిక మీడియా (పీటీవీ) ధృవీకరించింది. అఫ్ఘాన్ తాలిబన్లు చీకటి మాటున పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని, దానికి దీటైన సమాధానం ఇచ్చామని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు.
పాకిస్థాన్- అఫ్ఘానిస్థాన్ యుద్ధం : తాలిబన్ల ప్రతిదాడి..
తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. “పాక్ వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము గురువారం రాత్రి నుంచే సరిహద్దులో భారీ ఎత్తున ఎదురుదాడి ప్రారంభించాము. ఈ క్రమంలో 19 పాక్ సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నము,” అని ప్రకటించారు. ఈ ఘర్షణల్లో తమ సైనికులు 8 మంది చనిపోయారని, 11 మంది గాయపడ్డారని వారు తెలిపారు.
కాగా, తొర్ఖమ్ సరిహద్దు వద్ద శరణార్థుల శిబిరంపై పాక్ వేసిన మిస్సైల్ దాడిలో 13 మంది పౌరులు (మహిళలు, పిల్లలతో సహా) గాయపడ్డారు. అంతేకాకుండా, తాము ఒక పాకిస్థానీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్లు క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు.
పాకిస్థాన్- అఫ్ఘానిస్థాన్ యుద్ధం : మరణాల గణాంకాలలో భారీ వ్యత్యాసం..
ఇరు దేశాలు యుద్ధ భూమిలో జరిగిన నష్టానికి సంబంధించి వేర్వేరు లెక్కలు చెబుతున్నాయి.
అఫ్ఘాన్ రక్షణ శాఖ వాదన: తాము 55 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామని, పలువురిని సజీవంగా పట్టుకున్నామని పేర్కొంది.
పాకిస్థాన్ ప్రభుత్వ వాదన: తమ సైనికులు కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని, మూడు వందల మందికి పైగా గాయపడ్డారని పాక్ తెలిపింది. అయితే, తమ దాడుల్లో 133 మందికి పైగా అఫ్ఘాన్ ఫైటర్లు మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని పాక్ ప్రధాని ప్రతినిధి మొషారఫ్ అలీ జైదీ వెల్లడించారు. 27 అఫ్ఘాన్ పోస్టులను ధ్వంసం చేశామని, 9 మంది ఫైటర్లను పట్టుకున్నామని ఆయన తెలిపారు.
పాకిస్థాన్- అఫ్ఘానిస్థాన్ యుద్ధం : ముదిరిన సంక్షోభం..
గతేడాది అక్టోబర్ నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రమయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ ప్రయత్నాలు ఈ తాజా దాడులతో పూర్తిగా విఫలమయ్యాయనే చెప్పుకోవాలి. పాకిస్థాన్‌లో దాడులకు పాల్పడుతున్న 'తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్' (టీటీపీ) ఉగ్రవాదులకు అఫ్ఘానిస్థాన్ మద్దతు ఇస్తోందని పాక్ ఆరోపిస్తోంది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

E-Paper












