‘భార్యను ఎముకలు విరగకుండా కొడితే.. అది గృహహింస కాదు’- కొత్త చట్టానికి ఆమోదం!
ఆఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కులను కాలరాస్తూ తాలిబన్లు కొత్త శిక్షాస్మృతిని అమల్లోకి తెచ్చారు. భార్యలపై భర్తలు భౌతిక దాడి చేయడాన్ని ఇది పరోక్షంగా అనుమతించడమే కాకుండా, సమాజంలో కుల వివక్ష వంటి వర్గీకరణను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ సమాజం ఈ కొత్త నిబంధనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అఫ్గానిస్థాన్‌ని తాలిబన్లు తమ వశం చేసుకున్నప్పటి నుంచి మహిళలు, మహిళా భద్రతపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. వీటిని మరో స్థాయికి తీసుకుళుతూ.. తాలిబన్లు తాజాగా ఒక పని చేశారు. గృహహింసకు చట్టబద్ధత కల్పించేశారు! తాలిబన్ల అత్యున్నత నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదించిన కొత్త శిక్షాస్మృతి మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అధికారికంగా 'చట్టబద్ధత' కల్పించేలా ఉంది. భార్యను ఎముకలు విరగకుండా కొడితే, అది గృహహింస కాదని ఇప్పుడు తాలిబన్లు చెబుతున్నారు.

గృహహింసను అరికట్టాల్సిన చట్టాలే, ఇప్పుడు హింసను ప్రోత్సహించేలా ఉండటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
హింసకు గ్రీన్ సిగ్నల్?
కొత్త నిబంధనల ప్రకారం.. భర్త తన భార్యను లేదా పిల్లలను శారీరకంగా శిక్షించవచ్చు. అయితే, ఆ దాడిలో "ఎముకలు విరగకూడదు లేదా బహిరంగ గాయాలు కాకూడదు" అనే షరతు పెట్టారు. ఒకవేళ భర్త తీవ్రమైన బలాన్ని ప్రయోగించి భార్యను గాయపరిచినా, అతనికి కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే పడే అవకాశం ఉంది.
కానీ ఇక్కడే అసలైన తిరకాసు ఉంది! భర్తపై ఫిర్యాదు చేయాలంటే సదరు మహిళ కోర్టులో తన గాయాలను నిరూపించుకోవాలి. పైగా, న్యాయమూర్తి ముందు తన గాయాలను చూపేటప్పుడు ఆమె పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచుకోవాలి. అన్నిటికంటే తీవ్రమైన విషయం ఏంటంటే, ఆమె కోర్టుకు వెళ్లాలంటే భర్తో లేదా కుటుంబంలోని మరో మగ వ్యక్తి తోడు ఉండటం తప్పనిసరి.
అంతేకాదు, భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళితే ఆ మహిళకు మూడు నెలల జైలు శిక్ష పడుతుందని కొత్త చట్టంలో ఉంది.
వర్గ వివక్షతో కూడిన శిక్షాస్మృతి..
ఈ 90 పేజీల కొత్త చట్టం ఆఫ్ఘాన్ సమాజాన్ని నాలుగు వింత వర్గాలుగా విభజించింది:
మత పండితులు (ఉలేమాలు)
ఉన్నత వర్గం (అష్రాఫ్)
మధ్య తరగతి
నిగువ తరగతి
నేరం తీవ్రతను బట్టి కాకుండా.. నేరం చేసిన వ్యక్తి ఏ వర్గానికి చెందినవాడనే దానిపై శిక్షలు ఆధారపడి ఉంటాయి. ఒక ఉలేమా నేరం చేస్తే కేవలం 'సలహా' ఇచ్చి వదిలేస్తారు. ఉన్నత వర్గం వారైతే కోర్టుకు పిలిచి బుజ్జగిస్తారు. మధ్య తరగతి వారికి జైలు శిక్ష పడుతుంది. అదే దిగువ తరగతి వారు నేరం చేస్తే జైలు శిక్షతో పాటు అత్యంత క్రూరమైన శారీరక దండన విధిస్తారు.
భయం గుప్పిట్లో ఆఫ్గానిస్థాన్..
2009లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలపై హింస నిర్మూలన చట్టాన్ని’ తాలిబన్లు పూర్తిగా రద్దు చేశారు. ఈ కొత్త చట్టం గురించి చర్చించడం కూడా నేరమని తాలిబన్లు హుకుం జారీ చేయడంతో.. ప్రజలు కనీసం తమ గోడును వెళ్లబోసుకోవడానికి కూడా భయపడుతున్నారు.
"ఈ చట్టం మహిళల పట్ల అత్యంత భయానకమైనది. తమను ఎవరూ ఆపలేరని తాలిబన్లు బలంగా నమ్ముతున్నారు. అంతర్జాతీయ సమాజం వారి నమ్మకాన్ని ఎప్పటికి తలకిందులు చేస్తుంది?" అని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి రీమ్ అల్సలేమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్గాన్ మానవ హక్కుల సంస్థ 'రావదారి' కూడా ఈ చట్టాల అమలును వెంటనే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితిని కోరింది.
ప్రశ్నలు- సమాధానాలు:-
ప్రశ్న- తాలిబన్ల కొత్త చట్టం ప్రకారం 'గృహహింస'కు అనుమతి ఉందా?
సమాధానం- అవును, ఈ కొత్త శిక్షాస్మృతి భార్యాపిల్లలపై భర్తలు భౌతిక దాడులు చేయడాన్ని పరోక్షంగా అనుమతిస్తుంది. అయితే, ఆ దాడుల వల్ల "ఎముకలు విరగకూడదు లేదా బహిరంగ గాయాలు కాకూడదు" అనే నిబంధనను విధించారు. ఒకవేళ తీవ్రంగా గాయపరిచినట్లు రుజువైతే, గరిష్టంగా కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే ఉంటుంది. దీనివల్ల మహిళలపై హింసకు చట్టబద్ధత లభించినట్లవుతుందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రశ్న- బాధిత మహిళలు కోర్టులో న్యాయం పొందే అవకాశం ఉందా?
సమాధానం- కోర్టులో న్యాయం పొందడం అఫ్గానిస్థాన్ మహిళలకు అత్యంత సంక్లిష్టంగా మారింది. మహిళ తనపై జరిగిన దాడిని నిరూపించాలంటే న్యాయమూర్తికి తన గాయాలను చూపించాలి, .ది కూడా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచుకునే నిబంధనల మధ్య జరగాలి. అంతేకాకుండా, ఆమె కోర్టుకు రావాలంటే తప్పనిసరిగా భర్త లేదా మగ తోడు ఉండాలి. దీనివల్ల బాధితురాలు తనను హింసించిన వ్యక్తి సమక్షంలోనే ఫిర్యాదు చేయాల్సి రావడం పెద్ద అడ్డంకిగా మారింది.

E-Paper












