9ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 2 నెలలకే భర్తను గొంతు నులిమి చంపిన భార్య! తల్లిదండ్రుల సాయంతో..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్న భార్యే, తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తను గొంతు నులిమి హత్య చేసింది! ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది.

Published on: Feb 2, 2026, 05:30:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఘనంగా జరిగిన వివాహం.. కట్ చేస్తే, పెళ్లయిన రెండు నెలలకే ఆ బంధం రక్తపాతంతో ముగిసింది! ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు భార్య ఆడిన డ్రామాను పోలీసులు ఛేదించారు.

యూపీ బరేలీలో దారుణం..
యూపీ బరేలీలో దారుణం..

అసలేం జరిగింది?

ఎటావా జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ యాదవ్ (33), జ్యోతి గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. విద్యార్థి దశలోనే మొదలైన వీరి పరిచయం గతేడాది నవంబర్ 25న పెళ్లి పీటల వరకు వెళ్లింది. జితేంద్ర ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్​ఐ)లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ బస్ కండక్టర్‌గా పనిచేస్తున్నారు.

కాగా బరేలీలోని ఇజ్జత్‌నగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఈ జంట మధ్య కొద్దిరోజులుగా గొడవలు మొదలయ్యాయి.

గొడవకు కారణం 'ఆన్‌లైన్ జూదం'

పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. ఆర్థికపరమైన విభేదాలే ఈ హత్యకు దారితీశాయి. జితేంద్ర తన భార్య బ్యాంకు ఖాతా నుంచి రూ. 20,000 డ్రా చేసి, ఆన్‌లైన్ జూదంలో పోగొట్టాడు. ఈ విషయమై జనవరి 26న దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో జ్యోతి తన తల్లిదండ్రులు కాళీచరణ్, చమేలీతో పాటు సోదరుడు దీపక్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది.

పథకం ప్రకారం హత్య.. ఆపై డ్రామా

జ్యోతి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత గొడవ మరింత ముదిరింది. ఆవేశంలో జ్యోతి తల్లిదండ్రులు, సోదరుడు కలిసి జితేంద్రను గట్టిగా పట్టుకోగా, జ్యోతి అతడి గొంతు నులిమి హత్య చేసింది. జితేంద్ర మరణించాడని నిర్ధారించుకున్నాక, దీనిని ఆత్మహత్యగా మార్చేందుకు అందరు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఒక మఫ్లర్‌ను జితేంద్ర మెడకు చుట్టి, కిటికీ గ్రిల్‌కు వేలాడదీశారు. అనంతరం చుట్టుపక్కల వారిని పిలిచి తన భర్త ఉరివేసుకున్నాడని జ్యోతి కేకలు వేసింది.

పోస్ట్‌మార్టం రిపోర్ట్​లో బయటపడిపోయింది..

మొదట పోలీసులు దీనిని ఆత్మహత్యగానే పరిగణించారు. మృతదేహం పరిసరాల్లో చూసినా కూడా ఎలాంటి అనుమానం కలగలేదు. కానీ, జితేంద్ర సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపారు. రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జితేంద్రది ఉరి వల్ల సంభవించిన మరణం కాదని, గొంతు నులపడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని అని వైద్యులు తేల్చారు.

దీనితో పోలీసులు తమ స్టైల్‌లో విచారించగా, జ్యోతి అసలు నిజాన్ని అంగీకరించింది. ఆవేశంలోనే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. ఈ కేసులో జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు.

తొమ్మిదేళ్ల పాటు ప్రేమను కాపాడుకున్న ఈ జంట, కేవలం 20 వేల రూపాయల గొడవతో ఇద్దరి జీవితాలను ఇలా నాశనం చేసుకోవడం విషాదకరం అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More