NLSIU CJI : ‘సీజేఐ రావద్దు’- నల్సార్ తర్వాత మరో లా వర్సిటీ విద్యార్థుల నిరసన..
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ మనాన్ కుమార్ మిశ్రా ఆహ్వానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్సార్‌లోని తోటి లా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నారు.
రాబోయే స్నాతకోత్సవ వేడుకకు భారత దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఛైర్మన్ మనాన్ కుమార్ మిశ్రాను ఆహ్వానించడాన్ని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ న్యాయ విశ్వవిద్యాలయమైన నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్)లో ఇటీవల పెద్ద వివాదం చెలరేగిన కొన్ని రోజులకే ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని కొందరు విద్యార్థులు వ్యతిరేకించారు. దీనితో 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ బీసీఐ హుటాహుటిన ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర దుమారం రేపింది.
ఆ తర్వాత బీసీఐ ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. విద్యార్థుల "గౌరవం, ఆలోచనా స్వేచ్ఛ, న్యాయమైన ఆందోళనలను" గౌరవించాలని పేర్కొంటూ ఛైర్మన్ మిశ్రా లా విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు.
ఇక శనివారం విడుదల చేసిన సంయుక్త లేఖలో ఎన్ఎల్ఎస్ఐయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తాము నల్సార్‌లోని తమ సహచర విద్యార్థులతో "సంపూర్ణ సంఘీభావం" ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బీసీఐ ఛైర్మన్ వ్యవహారశైలిని తప్పబడుతూ, తమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొనడాన్ని వ్యతిరేకించారు.
గ్రాడ్యుయేషన్ వేడుకకు ఎవరు హాజరవుతున్నారనేది కేవలం ఒక అంశం కాదని, భారతదేశంలోని ప్రముఖ లా స్కూల్స్ విద్యార్థులు ఎలాంటి వృత్తిపరమైన పరిణామాలకు భయపడకుండా శక్తివంతమైన సంస్థలు, పబ్లిక్ అధికారులతో విభేదించే స్వేచ్ఛ కలిగి ఉండాలని విద్యార్థి సంఘం స్పష్టం చేసింది.
"అధికారంలో ఉన్నవారి ముందు నిజం చెప్పడంలో అసాధారణ ధైర్యం, నైతిక స్పష్టత చూపిన నల్సార్‌లోని మా తోటి విద్యార్థులతో మేము బేషరతుగా సంఘీభావం ప్రకటిస్తున్నాము," అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
నల్సార్ విద్యార్థులు, అధ్యాపక వర్గానికి బీసీఐ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎన్ఎల్ఎస్ఐయీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాథమిక హక్కు అయిన భావప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నం బీసీఐ చేసిందని వారు ఆరోపించారు. వివాదాస్పద ఉత్తర్వుల జారీకి సంబంధించిన అధికారిక లెటర్‌హెడ్‌ను ఛైర్మన్ ఎలా ఉపయోగించారో వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
ఎన్ఎల్ఎస్ఐయీ, బీసీఐ మధ్య సుదీర్ఘ సంస్థాగత సంబంధం ఉంది. విశ్వవిద్యాలయ పాలక మండళ్లలో సీజేఐతో పాటు బీసీఐ ఛైర్మన్ కూడా సభ్యులుగా ఉంటారు. 2025 ఎన్ఎల్ఎస్ఐయూ స్నాతకోత్సవంలో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సూర్యకాంత్ అధ్యక్షత వహించగా, మిశ్రా స్వాగతోపన్యాసం చేశారు.
దీనితో ఈ తాజా వివాదం దేశంలోని అత్యంత శక్తివంతమైన రెండు న్యాయ సంస్థలను - సుప్రీంకోర్టు, లీగల్ ప్రొఫెషన్ స్టాట్యూటరీ రెగ్యులేటర్‌ను - భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన లా స్కూళ్లలో ఒకదాని విద్యార్థులతో నడుస్తున్న చర్చ కేంద్రంలో నిలబెట్టింది.
నల్సార్ ఎపిసోడ్ నేపథ్యం..
స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ కాంత్‌ను ఆహ్వానించాలన్న విశ్వవిద్యాలయ ప్రతిపాదనను కొందరు గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు వ్యతిరేకించడంతో నల్సార్‌లో వివాదం ప్రారంభమైంది.
దిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల సమయంలో జరిగిన పోలీసుల అణచివేతకు సంబంధించిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిందిగా కోరినప్పుడు సీజేఐ చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీజేఐ సూర్యకాంత్ "మా సమయం వృధా చేయవద్దు" అని వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. అయితే తాను పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించలేదని, సరైన పద్ధతిలో దాఖలు చేయాలని మాత్రమే కోరానని ఆయన తరువాత స్పష్టం చేశారు.
గురువారం నాడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అయిన మిశ్రా నేతృత్వంలోని కౌన్సిల్.. నల్సార్ 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌లోని సభ్యులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌లో నమోదు చేయవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం పట్ల ఎలాంటి గౌరవం, మర్యాద చూపని లా విద్యార్థి.. భవిష్యత్తులో "బాధ్యతాయుతమైన లేదా సమర్థుడైన న్యాయవాది, ఉపాధ్యాయుడు లేదా న్యాయమూర్తి," అవుతాడని ఆశించలేమని ఆ ఉత్తర్వు పేర్కొంది.
ఇది వెంటనే తీవ్ర దుమారానికి దారితీసింది. ఉత్తర్వులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే, నల్సార్ విద్యార్థులందరినీ శిక్షించాలనే ఆలోచన నుంచి కౌన్సిల్‌ను వేరు చేయడానికి మిశ్రా ప్రయత్నించారు.
ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. "మెజారిటీ" విద్యార్థులు నిర్దోషులని, కొందరి అవాంఛనీయ ప్రవర్తనకు మిగతావారు నష్టపోకూడదని తెలిపారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ రాత్రికి రాత్రే బీసీఐ ఆ ఉత్తర్వులను పూర్తిగా ఉపసంహరించుకుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


